పేదవాడి జీవనోపాధిని దెబ్బతీస్తే సహించం

టీడీపీ నేతలకు తలారి రంగయ్య స్ట్రాంగ్ వార్నింగ్ 

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా: పేదవారి జీవనోపాధిని రాజకీయ కక్షలతో దెబ్బతీసే చర్యలను సహించబోమని క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, మాజీ ఎంపీ త‌లారి రంగ‌య్య కూట‌మి నేత‌ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికార గర్వంతో పేదవాడి పొట్ట కొడితే చూస్తూ ఊరుకోమని, చట్టవిరుద్ధంగా సాగుతున్న అరాచకాలకు త్వరలోనే ముగింపు పలుకుతామని హెచ్చరించారు.  శెట్టూరు మండలం బసంపల్లి గ్రామంలో ఓ పేద వ్యక్తి రమేష్‌కు చెందిన కిరాణా దుకాణాన్ని రాజకీయ కక్షలతో తొలగించిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న చిన్న షాపును అడ్డగోలుగా తొలగించడం అమానుషమని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్నది ప్రజాస్వామ్య రాజ్యాంగం కాదని, ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అంటూ విమర్శించారు. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలకు కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు.

పేదవాడి జీవనోపాధిని ధ్వంసం చేయడం రాజకీయ శౌర్యం కాదని, అధికార మదంతో వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు భవిష్యత్తులో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బాధితుడు రమేష్‌ను వ్యక్తిగతంగా కలిసి తలారి రంగయ్య భరోసా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని, తనకు పార్టీ తరపున అండగా ఉంటామని తెలిపారు. ఈ ఘటనపై చట్టపరంగా పోరాడతామని, రమేష్‌కు తిరిగి జీవనోపాధి కల్పించే వరకు వైయ‌స్ఆర్‌సీపీ  తరపున అండగా నిలుస్తామని ఆయన ప్రకటించారు.  కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఎం.ఎస్. హనుమంతరాయుడు, ఎంపీపీ సోమనాథ్ రెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ దొడ్ల తిప్పేస్వామి, గ్రామ కమిటీ అధ్యక్షుడు బోయ నాగేంద్ర, సీనియర్ నాయకుడు శ్యాంసుందర్ చౌదరి, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టైగర్ వన్నూరుస్వామి, వైసీపీ నాయకులు మిద్దె సుధాకర్, మాజీ సర్పంచ్ బాబురావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top