తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(మీడియా విభాగం) పూడి శ్రీహరిని మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు , విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు బుధవారం తాడేపల్లిలో ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా శ్రీహరిని అక్రమంగా అరెస్టు చేసి వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. గత కొద్ది రోజులుగా శ్రీహరిని లక్ష్యంగా చేసుకుని వరుసగా తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టులు చేయించారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియా పోస్టింగ్స్‌కు సంబంధించి 41A నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని ఉన్నత న్యాయస్థానాలు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని విమర్శించారు. చట్టాలను అతిక్రమించి అరెస్టు చేసి మానసికంగా, శారీరకంగా వేధించినా, చివరికి న్యాయస్థానంలో బెయిల్ మంజూరు కావడంతో న్యాయమే గెలిచిందని పేర్కొన్నారు. ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టే ప్రయత్నాలు చేసినా వైయస్ఆర్‌సీపీ వెనక్కి తగ్గదని, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు స్పష్టం చేశారు.