తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులకు కనీస మద్దతు ధర (MSP) కూడా దక్కడం లేదని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు రైతులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 'ధరల స్థిరీకరణ నిధి' హామీని కూటమి నేతలు తుంగలో తొక్కి రైతులను నట్టేట ముంచుతున్నారని ఆయన మండిపడ్డారు. క్వింటా మొక్కజొన్న సాగుకు రూ.2,200 వ్యయం అవుతుండగా, మార్కెట్లో కనీసం రూ.1,400 ధర కూడా లభించక రైతులు అల్లాడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు వేల కోట్ల నష్టాలను చవిచూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... మొక్కజొన్న రైతుల కన్నీళ్లు - రూ. 3500 కోట్ల నష్టం ప్రస్తుతం రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. క్వింటా మొక్కజొన్న కనీస మద్దతు ధర రూ. 2,400 ఉండగా, రైతులు రూ. 1,400 నుండి రూ. 1,600కే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. అదే మొక్కజొన్న పంట సాగు వ్యయం క్వింటాకు రూ. 2,000 నుండి రూ. 2,200 వరకు ఉండగా, మార్కెట్లో లభిస్తున్న ధర దానికి చాలా తక్కువగా ఉంది. ఒక్క మొక్కజొన్న విషయంలోనే రాష్ట్ర రైతులు రూ. 3,500 కోట్ల వరకు నష్టపోయారు. పొరుగు రాష్ట్రాల్లో మద్దతు ధర లభిస్తున్నా, మన ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అడుగడుగునా నిర్లక్ష్యం - కుంటుపడిన వ్యవసాయం కూటమి పాలనలో కేవలం మొక్కజొన్నే కాకుండా, అన్ని రకాల పంటల పరిస్థితి దయనీయంగా తయారైంది. శనగ, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పత్తి వంటి ఏ పంటకూ కనీస మద్దతు ధర లభించడం లేదు. టమాటో ధర కేవలం కిలో రూ. 2కే పడిపోయింది. ఎన్నికల ముందు రూ.300 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైంది? రెండేళ్లలో కనీసం ఇన్‌పుట్ సబ్సిడీ గురించి కూడా మంత్రులు నోరు మెదపకపోవడం దారుణం. గతంలో వచ్చిన తుపానుల వల్ల 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా, ఇప్పటివరకు రైతులకు ఎటువంటి పరిహారం అందలేదు. కౌలు రైతుల పరిస్థితిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. జగనన్న పాలనలో 'సాగు పండగ' వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు వ్యవసాయం పండగలా సాగింది. రైతు భరోసా కేంద్రాల (RBK) ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు ప్రభుత్వం అండగా నిలిచింది. విత్తనం నుంచి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలతో వైయస్.జగన్ రైతులకు అడుగడుగునా అండగా నిలబడ్డారు. ప్రభుతమే ప్రతి పంటను స్వయంగా కొనుగోళ్లు జరిపింది. 2019–20లో 4,17,268 టన్నులు, 2020–21లో 3,06,713 టన్నులు, 2022–23లో 73,302 టన్నులు మొక్క జొన్న మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. – దీంతో ఎక్కడా ధర తగ్గిన పరిస్థితి లేదు. రైతులు నష్టపోయిన దాఖలాలు అంత కంటే లేవు. వైయస్.జగన్ హయాంలో అడుగడుగునా రైతులను ఆదుకున్న పరిస్ధితి. ఈ నేపధ్యంలో కూటమి ప్రభుత్వం మాత్రం రైతులను పట్టించుకోకుండా, కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకుంటోందని కైలే అనిల్ కుమార్ ఆక్షేపించాు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, మార్కుఫెడ్ ద్వారా మొక్కజొన్నతో పాటు అన్ని పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు, ఎన్నికల ముందు ఇచ్చిన 'ధరల స్థిరీకరణ నిధి' హామీని అమలు చేసి, ఆదుకోవాలని వైయస్ఆర్‌సీపీ తరపున డిమాండ్ చేశారు. అలా కాకుండా ఇదే నిర్లక్ష్య వైఖరి కొనసాగితే కూటమి ప్రభుత్వంపై రైతులు తిరగబడటం ఖాయమని, రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఈ సర్కారుకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని కైలే అనిల్ కుమార్ హెచ్చరించారు.