అమరావతి: సభను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేయవద్దని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అధికార పక్షాన్ని కోరారు. ఆనాటి ప్రభుత్వం అనేక హామీలను నెరవేర్చిందని, కొన్ని హామీల అమలుకు సంబంధించిన సమాచారాన్ని అధికారులను పిలిపించి తెలుసుకోవాలని సూచించారు. లేనిపోని కల్లబొల్లి కబుర్లు చెప్పకుండా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న వారిని అవమానించవద్దని ఆయన అన్నారు. మంత్రి సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి అగ్రిమెంట్‌లు చేసుకోలేదని చెబుతున్నారని, అంతకు ముందు ఏం జరిగిందో ముందుగా తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పట్ల సానుభూతితో సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గీతం యూనివర్సిటీ భూ వ్యవహారంపై చర్చించాలి విశాఖలోని గీతం వర్సిటీకి రూ.5 వేల కోట్ల భూ వ్యవహారంపై సభలో చర్చించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ గీతం యూనివర్సిటీ అంశంపై చర్చ జరగాల్సిందేనని అన్నారు. అలాగే “తల్లికి వందనం” పథకం అమలుపై కూడా సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్లి రూ.15 వేల చొప్పున ఇస్తామని ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు ఆ పథకం తల్లికి వంచనగా మారిందని మండిపడ్డారు.