6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు క‌ల క‌న్నావా బాబూ?

ఉద్యోగాల ప్ర‌క‌ట‌న‌లో సీఎం, మంత్రులు పొంత‌న లేని స‌మాధానాలు

ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ ధ్వ‌జం

తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌

ఏపీలో నిరుద్యోగ రేటు 8.2%కి పెరిగిందని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి

20 నెల‌ల్లో 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని  సీఎం ప్ర‌క‌టించారు

శాస‌న మండ‌లిలో మంత్రి రాంప్ర‌సాద్‌  5.77 లక్షల ఉద్యోగాలు ఇచ్చామ‌ని ప్ర‌క‌ట‌న‌

మంత్రి నారా లోకేష్ మాత్రం రెండు లక్షల ఉద్యోగాలే కల్పించామని చెబుతున్నారు

ఎవ‌రు చెప్పేది నిజం

ఇచ్చిన ఉద్యోగాల పూర్తి వివరాలు పబ్లిక్ డోమైన్‌లో పెట్టాలి

ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌

తాడేప‌ల్లి: రాష్ట్రంలో 20 నెల‌ల్లో 6.28 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు క‌ల‌లు క‌న్నావా అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును సూటిగా ప్ర‌శ్నించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అసెంబ్లీలో చెబుతుంటే, శాస‌న మండ‌లిలో మంత్రులు వేర్వేరు సంఖ్యలు ప్రకటించడం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు. ఉద్యోగాల ప్రకటనలో సీఎం, మంత్రుల మధ్య పొంతన లేని సమాధానాలు ఉన్నాయని, నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే వాటి పూర్తి వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న డిమాండ్ చేశారు. ఎక్కడ, ఎవరికి, ఏ పరిశ్రమలో ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు.

ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ ఇంకా ఏమ‌న్నారంటే..: 

ఎక్క‌డ, ఎవ‌రికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్ప‌గ‌ల‌రా?
కేంద్ర గణాంకాల ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. అయినా ప్రభుత్వం సరైన సమాధానం చెప్పడం లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న‌ అసెంబ్లీలో 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పారు. కానీ శాస‌న మండ‌లిలో ఒక్క రోజు ముందే మంత్రి రాంప్రసాద్ రెడ్డి 5.77 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని అంటున్నారు. మరోవైపు నారా లోకేష్ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు. ఒకే ప్రభుత్వంలో ముఖ్య‌మంత్రి, మంత్రులు వేరు వేరు లెక్క చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమే. నిజంగా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే వాటి పూర్తి వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి. ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు, ఏ పరిశ్రమల్లో ఇచ్చారు, వారి జీతభత్యాలు ఎంత‌, ఏయే హోదాల్లో ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలి. దావోస్‌ పర్యటనలో ఎన్ని  ఒప్పందాలు జరిగాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఈ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాలి.

నిరుద్యోగంలో ఏపీ టాప్‌
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగ రేటు 4.1 శాతంగా ఉందని 2023 డిసెంబర్‌లో రాజ్యసభలో విడుదలైన డేటా స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నా, నిరుద్యోగ రేటు ఎందుకు 8.2 శాతానికి పెరిగింది? కేంద్ర ఆర్థిక సర్వే, పీరియాడిక్ లేబర్ సర్వేలు కూడా ఏపీలో నిరుద్యోగం 8.2 శాతమని చెబుతున్నాయి. ఉద్యోగాలు పెరిగితే నిరుద్యోగం తగ్గాలి కదా? కానీ ఇక్కడ ఎందుకు పెరిగింది? ప్రభుత్వం ఎవరిని మోసం చేయడానికి అబద్ధాలు చెబుతోంది? చంద్రబాబు గారిని కొందరు సీఈవో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు, కానీ నిరుద్యోగ రేటు పెరిగిన పరిస్థితిని చూస్తే ఆయనను చీప్ జాబ్ క్రియేటర్ అనాలేమో.

ఈ ప్ర‌భుత్వంలో కోత‌లే ఎక్కువ‌

 డీఎస్సీ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కూడా గతంలో మా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ఆధారంగానే జరుగుతోంది. ఈ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల కల్పన కంటే ఉద్యోగాల తొలగింపులే ఎక్కువగా జరిగాయి. మద్యం దుకాణాల్లో 18 వేల మంది, ఫైబర్‌నెట్‌లో సుమారు 1800 మంది ఉద్యోగాలను తొలగించారు. ఉపాధి హామీ, రేషన్ షాపులు, అవుట్‌సోర్సింగ్ వ్యవస్థలను కూడా బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోంది.  గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 40 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించింది, వాటి పూర్తి వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాం. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రకటిస్తున్న 6.28 లక్షల ఉద్యోగాల వివరాలు మాత్రం ప్రజలకు వెల్లడించడం లేదు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదు. మూడు బడ్జెట్లలో కూడా నిధులు కేటాయించలేదు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, నిరుద్యోగ భృతి అమలు చేసే వరకు యువత పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు.  

Back to Top