నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ శివారులోని పీవీఎస్‌ఆర్ గోడౌన్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీకు చెందిన గూండాలు కత్తులతో దాడి చేసి వైయస్ఆర్‌సీపీ నాయకుడు శివరామిరెడ్డిని హతమార్చేందుకు యత్నించారు. ముసుగు ధరించిన ముగ్గురు దుండగులు ఒక్కసారిగా శివరామిరెడ్డిపై కత్తులతో విరుచుకుపడడంతో ఆయన శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు మాట్లాడుతూ, తనపై భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ దాడి చేసినట్లు గుర్తించానని, తనను చంపడానికే వచ్చారని అనుమానం వ్యక్తం చేశాడు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే భూమా కిషోర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని శివరామిరెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా అఖిలప్రియపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే శివరామిరెడ్డిపై దాడి చేయించారని శివరామిరెడ్డి సతీమణి ఆరోపించారు. గాయపడిన శివరామిరెడ్డిని అత్యవసర చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.