‘ఆర్డీటీ’ కోసం లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమం

 మాజీ ఎంపీ తలారి రంగయ్య పిలుపు 

అనంతపురం జిల్లా: ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఆర్డీటీ (ఆర్డీటీ)కు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ‘లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమం’ చేపట్టనున్నట్లు మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య తెలిపారు. శుక్ర‌వారం కళ్యాణదుర్గంలోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో ఈ ఉద్యమానికి సంబంధించిన పోస్ట్ కార్డులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలారి రంగయ్య… దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆర్డీటీ సంస్థ చేస్తున్న సేవలు అమూల్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత వంటి అనేక రంగాల్లో ఆర్డీటీ విశేషంగా కృషి చేస్తోందని ఆయన చెప్పారు. అలాంటి సేవా సంస్థకు నిధుల విషయంలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ నెల 10వ తేదీన కుందుర్పిలోని ఫెర్రర్ ఆలయం నుంచి ‘లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని’ అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్‌ను రీన్యువల్ చేయాలని కోరుతూ ప్రజలంతా పోస్ట్ కార్డులు పంపించాలని ఆయన పిలుపునిచ్చారు. 

Back to Top