గీతంకి భూముల కేటాయింపు పెద్ద భూ కుంభకోణం

 ఎమ్మెల్సీ కుంభ రవిబాబు 

అమరావతి: గీతం యూనివర్సిటీకి వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కేటాయించే ప్రయత్నం పెద్ద భూ కుంభకోణమని శాసన మండలిలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు తీవ్రంగా విమర్శించారు. గీతంకి ప్రభుత్వ భూములు ఇవ్వడంపై మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చామని, అయితే ప్రభుత్వం దానిని తిరస్కరించిందని ఆయన తెలిపారు. మండలి మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ… సుమారు రూ.5 వేల కోట్ల విలువైన భూములను గీతంకి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని ఆరోపించారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న అతిపెద్ద భూ కుంభకోణాల్లో ఒకటని అన్నారు. విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ గీతంకి భూములు ఇవ్వాలని తీర్మానం చేసినప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని ఆయన గుర్తు చేశారు. గీతం ఒక వ్యాపార సంస్థగా మారి విద్యను వ్యాపారంగా మార్చిందని, అలాంటి సంస్థకు వేల కోట్ల విలువైన భూములు ఇవ్వడంపై వైయ‌స్ఆర్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి గీతంకి ఉచితంగా భూములు ఇవ్వడం పరిపాటిగా మారిందని విమర్శించారు. గతంలో ఎకరం రూ.15 లక్షలకే భూములు కేటాయించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

రుషికొండలో వైయ‌స్ జగన్ ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ భవనాలపై కూటమి పార్టీలు గగ్గోలు పెట్టాయని, ఎన్నికల్లో ప్రచారం కోసం ఆ అంశాన్ని ఉపయోగించుకున్నాయని అన్నారు. ఇప్పుడు మాత్రం 51 ఎకరాలు 71 సెంట్ల విలువైన భూములను గీతంకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అనేక కంపెనీలకు కూడా 99 పైసలకే భూములు కేటాయిస్తున్నారని, విలువైన ప్రభుత్వ భూములను కారు చౌకగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించే చర్యలను వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని రవిబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఈ నిర్ణయాన్ని పార్టీ తరఫున బలంగా వ్యతిరేకిస్తామని ఆయన తెలిపారు.
 

Back to Top