గత పొరపాట్లు పునరావృతం కావొద్దనే..

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని నివేదికలు చెబుతున్నాయి

సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని హైపవర్‌ కమిటీకి సీఎం సూచన

అమాయక మహిళలను అడ్డుపెట్టుకొని బాబు నీచ రాజకీయం

తన స్వార్థం కోసం బాబు ఎంతకైనా దిగజారుతాడు

మహిళలను రెచ్చగొడుతూ కారుణ్య మరణాలకు ప్రోత్సహిస్తున్నాడు

అమరావతి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు

పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ

తాడేపల్లి: గతంలో జరిగిన పొరపాట్లు పునరావతృం కాకుండా అభివృద్ధి వికేంద్రకరణ జరగాలని బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) నివేదిక ఇచ్చిందని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత వేసిన కమిటీలు శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్‌ కమిటీ, జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు అన్ని కమిటీలు ఇచ్చిన నివేదికల్లో సారాంశం.. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కావొద్దని స్పష్టంగా ఉన్నాయన్నారు. కానీ, చంద్రబాబు అమరావతిలో రాజధాని అనే సెంటిమెంట్‌తో అమాయక మహిళలను రోడ్డు మీదకు తీసుకువచ్చి కారణ్య హత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నాడన్నారు. తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం చంద్రబాబు ఎంత స్థాయికైనా దిగజారుతాడనే విషయం అందరికీ తెలుసన్నారు. రాజధాని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ న్యాయం చేసేలా సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకుంటారన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారంటే.. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమితమైంది. హైదరాబాద్‌ను కోల్పోతూ రాష్ట్ర విభజన జరిగినప్పుడు వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు, కరువు కాటకాలతో అల్లాడే రాయలసీమ వాసులు అనేక ఉద్యమాలు చేశారు. వాటన్నింటినీ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శివరామకృష్ణన్‌ కమిటీ నుంచి నిన్నటి బోస్టన్‌ కమిటీ వరకు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని రిపోర్టులు ఇచ్చాయి.

కేబినెట్‌ నిర్ణయానుసారం సీఎం వైయస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీలో జీఎన్‌రావు, బోస్టన్‌ గ్రూపు రెండు నివేదికలపై చర్చించి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని సీఎం స్పష్టంగా చెప్పారు. బోస్టన్‌ గ్రూపు ఏజెన్సీ కాదు.. వారిపై కేసులు ఉన్నాయని చంద్రబాబు అవాకులు, చవాకులు పేలుతున్నారు. బోస్టన్‌ గ్రూపు అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సంస్థ. తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతిలో మాయ ప్రపంచాన్ని సృష్టించాలని గత ఐదేళ్లలో అనేక కన్సల్టెన్సీలను తీసుకువచ్చి వందల కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారు. రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే అమాయక రైతులను మోసం చేసి వేలాది ఎకరాలు గత టీడీపీ ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కొనుగోలు చేశారు. ఆ భూములతో రియలెస్టేట్‌ వ్యాపారం చేయాలని చూశారు. ఐదేళ్లలో ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదు. అమరావతి నిర్మాణానికి రూ. 5800 కోట్లు ఖర్చు చేశాడు. ఆ అప్పులకు  సంవత్సరానికి రూ. 700 కోట్ల వడ్డీ కట్టాల్సిన దుస్థితి.

ప్రజా నాయకుడిగా అన్ని ప్రాంతాలు నాకు సమానం అనే భావనతో సీఎం వైయస్‌ జగన్‌  శాస్త్రీయ పద్ధతితో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని పూర్వం నుంచి ఉన్న డిమాండ్‌. అమరావతిని ఒక భాగంగా అభివృద్ధి చేయాలని, ఉత్తరాంధ్రను ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి కోసం సీఎం వైయస్‌ జగన్‌ పారదర్శక నిర్ణయాలు తీసుకుంటుంటే దాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం డబ్బులు అన్నీ రాజధాని నిర్మాణానికి ఖర్చు చేస్తే సాగునీటి ప్రాజెక్టులు, ప్రజల సంక్షేమం ఏమవ్వాలి.

రాజధాని సెంటిమెంట్‌తో మహిళలను రోడ్డు మీదకు తీసుకువచ్చి ఏదో అన్యాయం, నష్టం జరుగుతుందని చంద్రబాబు గందరగోళం సృష్టిస్తున్నాడు. ఇలా ఉద్యమాన్ని ప్రేరేపించాలనుకోవడం సరైన విధానం కాదు. లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం చంద్రబాబు ఏ స్థాయికి అయినా దిగజారుతాడు. చంద్రబాబు నైజం అందరికీ తెలుసూ.. చరిత్ర కూడా చెబుతుంది. అధికార పీటం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ మరణానికి పరోక్షంగా కారణమైయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన రాజకీయ పబ్బం కోసం అమాయక మహిళలను ఆసరా చేసుకొని ఉద్యమాలు చేయిస్తూ..  కారుణ్య మరణాలకు ప్రోత్సహించేలా చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు.

అమరావతి రైతులను అన్ని విధాలుగా సీఎం వైయస్‌ జగన్‌ ఆదుకుంటారు. ఇంకా మెరుగైన పద్ధతిల్లో ఈ ప్రాంత మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏఏ కార్యక్రమాలతో అమరావతి అభివృద్ధి చెందుతుందో ప్రభుత్వపరంగా దృష్టిసారిస్తాం. రైతులకు ఎలాంటి అన్యాయం జరగదు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దు. అందరినీ అన్ని విధాలుగా అందుకుంటాం’ అని మంత్రి మోపిదేవి అన్నారు.

 

Back to Top