వియత్నాంలో బోటు ప్రమాదం

పలువురు తెలుగువారు దుర్మరణం

శ్రీ వైయస్‌ జగన్‌ తీవ్ర సంతాపం

తాడేపల్లి:  వియత్నాంలోని హాలాంగ్‌ బే వద్ద జరిగిన ఘోర బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పర్యాటకులు దుర్మరణం చెందడం  తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ విచారం వ్యక్తం చేశారు. వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకుల బృందం ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురి కావడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు.
    వియత్నాంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఉండటం మరింత బాధాకరమన్నారు. ముఖ్యంగా కడప, బందరు ప్రాంతాలకు చెందిన పలువురు మొబైల్‌ డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రమాదంలో మృతి చెందడం ఎంతో కలిచి వేసిందన్నారు.
    మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ కుటుంబాలకు భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ఇంకా ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన శ్రీ వైయస్‌ జగన్, ప్రస్తుతం వియత్నాంలో చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టి, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ విపత్కర పరిస్థితిలో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని శ్రీ వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

Back to Top