విజయవాడ: కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన మహిళలంతా బాధపడుతున్నారని, ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం ప్రసాదించాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని వేడుకున్నట్లు వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కోరారు. గుడిలో ఉన్న దేవుడిని వదిలిపెట్టి..ఇప్పుడు వేడుకుంటున్నా ఈ ప్రభుత్వం కనికరించడం లేదని కూటమి నేతలకు ఓట్లు వేసిన మహిళలు బాధపడుతున్నారని తెలిపారు. పోలీసులు కూడా మహిళ భధ్రతపై దృష్టి పెట్టేలా మంచి బుద్ధిని ప్రసాదించాలని అంబేద్కర్‌ను కోరినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనల్లో భాగంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో వరుదు కళ్యాణి, మేయర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని స్వరాజ్ మైదానంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ..`రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై శాంతియుతంగా నిరసన తెలుపుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు విజయవాడ స్వరాజ్ మైదానానికి వచ్చాం. ప్రభుత్వం మమ్మల్ని మైదానంలోని అనుమతించకుండా అభ్యంతరాలు సృష్టించారు. విగ్రహం వెనుకవైపు వినతిపత్రాలు ఇవ్వమని పోలీసులు అడ్డుకుంటున్నారు. వినతిపత్రాలు ఎవరికైనా ముందునుంచి కదా ఇచ్చేది. మేం శాంతియుతంగా వినతిపత్రం ఇస్తామంటే ఒప్పుకోవడం లేదు. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు విఫరీతంగా పెరిగాయి. ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో పూర్తిగా విఫలమైంది. మహిళలు ఇంట్లో ఉన్నా కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. స్కూల్, కాలేజీ, పని ప్రాంతంలో కూడా హత్యాచారాలు జరుగుతున్నాయి. అనంతపురంలో తన్మయి అనే విద్యార్థిని కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కుళ్లి శవమైన బాలికను చూపించారు. ప్రభుత్వం మేల్కోని వెతికిపట్టుకుంటే ఆ అమ్మాయి బాగుండేంది. ఆరు నెలల పాటు శ్రీసత్యసాయి జిల్లాలో 14 ఏళ్ల బాలికను అత్యాచారం చేశారు. మేం ఫిర్యాదు చేసే వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనలపై సీఎం, డిప్యూటీసీఎం, హోం మంత్రి స్పందించడం లేదు. ఉండి, భీమిలి ఇలా ప్రతి చోటా ఏదో ఒక ఘటన జరుగుతున్నాయి. గంటకు మూడు నాలుగు అఘయిత్యాలు జరుగుతున్నాయి. హోం మంత్రిగా మహిళా ఉండి కూడా ఆమె స్పందించడం లేదు. సాక్షి మీడియాపై అక్రమ కేసులు పెట్టాలని సీఎం, డీసీఎం, లోకేష్ ఆదేశాలు ఇచ్చారే..మహిళలపై జరుగుతున్న ఘటనలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మహిళలపై దాడులకు మద్యం, గంజాయి కారణం. వంద రోజుల్లో గంజాయిని రూపుమాపుతామని చెప్పారు. హోం మంత్రి సొంత నియోజకవర్గంలోనే గంజాయి గుప్పుమంటోంది. డోర్ డెలివరీ జరుగుతున్నా వీరు పట్టించుకోవడం లేదు. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రతిపక్షంపై అక్రమ కేసులు పెట్టడంపై పోలీసులు దృష్టి పెడుతున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఒక మహిళను టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తున్నారు. మా భారతమ్మ కాలి గోటికి కూడా సరిపోని వారు ఈ రోజు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆమెను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఆమె జోలికి వస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. ప్రతి సంఘటనలోనూ టీడీపీ కార్యకర్తలే నిందితులు. ఈ ప్రభుత్వం ఒక్క సమీక్ష కూడా చేయడం లేదు. గతంలో వైయస్ జగన్ మహిళా భద్రతకు పెద్ద పీట వేశారు. పక్క రాష్ట్రంలో దిశపై అఘాయిత్యం జరిగితే ఏపీలో ప్రత్యేక చట్టాన్ని తెచ్చారు. దిశా యాప్ తీసుకువచ్చారు. కోటి 30 లక్షల మంది ఆడబిడ్డలు దిశా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ప్రభుత్వం తెచ్చిన శక్తి యాప్‌పై ఎవరికీ అవగాహన లేదు. మహిళల భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారు. మహిళల మాన ప్రాణాలు గాలిలో ఉన్నాయి. ఎక్కడ చూసినా రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి నెలకొంది. టీడీపీ, జనసేన నేతల అరాచకాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై ఓ మహిళ కేసు పెడితే ఎందుకు అరెస్టు చేయలేదు. జనసేన లీడర్ కిరణ్‌పై లక్ష్మీ అనే మహిళ ఫిర్యాదు చేస్తే ఎందుకు అతన్ని అరెస్టు చేయడం లేదు. మహిళలంటే ఇంత చులకనాభావమా? ఇచ్చిన ఏఒక్క హామీని అమలు చేయకుండా మహిళల రక్షణను గాలికి వదిలేశారు. మొన్నటి వరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అరెస్టు చేశారు. వైయస్ఆర్‌సీపీ నేతలను, కార్యకర్తలను అరెస్టు చేయించారు. తాజాగా జర్నలిస్టులను అరెస్టు చేయిస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచుకొని రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి` అని వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.