ఎన్నికలకు ముందే తుంగభద్ర జలాలు..!

 పైప్ లైన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి 

అనంత‌పురం: ఎన్నికలకు ముందే పాపంపేట, కక్కలపల్లి కాలనీ, కురుగుంట, కామారుపల్లి, చిన్నంపల్లి, రాచానపల్లి పంచాయతీలకు తుంగభద్ర జలాలు  తీసుకొస్తామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం నుంచి అనంతపురం రూరల్ మండలం పాపంపేట వరకు జరిగే పైప్ లైన్ పనులకు సంబంధించి చిన్నంపల్లి పంచాయతీ కళ్యాణ్ దుర్గం రోడ్డులో శనివారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. 

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 54 కోట్లు, 41 కోట్లు మొత్తం 95 కోట్లతో ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలం రెండు ప్యాకేజీల కింద పనులు జరుగుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి పీఏబీఆర్‌ నుంచి ఆత్మకూరు అక్కడి నుంచి పాపంపేట వరకు నీళ్లిస్తాం. సమీపంలో ఉండే ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, సంపులకు కనెక్షన్లు ఇస్తారు.  ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నాం. 
వాస్తవానికి అనంతపురం నగరానికి వెళ్లే పైపులైను ద్వారా నీళ్లు తీసుకునేలా ప్రభుత్వం జిఒ ఇచ్చింది. కొన్ని అవాంతరాలు, అడ్డంకుల వల్ల అది చేయలేకపోయాం. అందుకోసమే సమాంతరంగా మరో పైపులైను తీసుకొస్తున్నాం. 
 
చెన్నేకొత్తపల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే... ఆత్మకూరు, అనంతపురం రూరల్, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాలకు నాలుగు ప్యాకేజీలను జగనన్న ప్రకటించారు. ఇప్పుడు రెండు ప్యాకేజీల పనులు వేగంగా జరుగుతున్నాయి. తక్కిన రెండు ప్యాకేజీల పనులు ఈ నెలాఖరులోగా ప్రారంభమవుతాయి. మొత్తం ఈ నాలుగు ప్యాకేజీల కింద నియోజకవర్గంలోనీ139 గ్రామాలకు తాగునీరు ఇస్తున్నాం. ఇందుకోసం పెరిగిన అంచనాలతో కలిపి  150 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంతేకాకుండా మరోవైపు ఇంటింటికి పైప్ లైన్ ఇచ్చే పనులు జరుగుతున్నాయి.

Back to Top