తాడేపల్లి: రాష్ట్రంలో కల్తీ లిక్కర్ తయారీ టీడీపీ నడిపిస్తున్న కుటీర పరిశ్రమగా మారిపోయిందని, సీఎం చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కల్తీ లిక్కర్ తయారీని వ్యవస్థీకృతం చేశారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి మరీ కల్తీ లిక్కర్ తయారు చేయడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి కూడా గండికొట్టి మరీ ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి టీడీపీ నాయకుల ద్వారా ఈ కల్తీ దందాను నడిపిస్తున్నాడని, బెల్ట్ షాపుల ద్వారా పంపిణీ చేసి ప్రజలతో తాగిస్తున్నాడని ఎమ్మెల్యే తాటిపర్తి వివరించారు. మొలకలచెరువు కల్తీ లిక్కర్ స్కాంలో పట్టుబడిన తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డిని వైయస్ఆర్‌సీపీ కోవర్టు అని ప్రచారం చేసుకోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. సీఎం చంద్రబాబు కల్తీ లిక్కర్‌పై ప్రజలకు సమాధానం చెప్పలేక పదవుల ఆశ చూపించి పట్టాభిని మీడియా ముందుకు పంపించి నోటికొచ్చినట్టు మాట్లాడిస్తున్నాడని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి మాట్లాడే ముందు పట్టాభి ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని, లేదంటే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు తానే బాధ్యుడవుతాడని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.... రుషికొండ నిర్మాణాలను చూసి ఓర్వలేకపోతున్నారు చంద్రబాబు అడ్డగోలుగా అక్రమాలు, అవినీతి కార్యక్రమాలను చేసి అవి బయటపడినప్పుడు ప్రజలకు నిజాలు తెలియకుండా వారిని బురిడీ కొట్టించడానికి నాలుకను ఎలా పడితే అలా తిప్పేసే కొమ్మారెడ్డి పట్టాభి లాంటి వారితో నోటికొచ్చినట్టు మాట్లాడిస్తుంటాడు. ఈ పట్టాభి కండలు పెంచాడు కానీ, బుద్ధిని పెంచకుండా పేదలకు అత్యంత విలువైన మెడికల్ కాలేజీల గురించి పచ్చి అబద్ధాలు మాట్లాడి తానొక అజ్ఞానిని నిరూపించుకున్నాడు. గత అనుభవాలను చూసైనా ఆయన ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోవడం లేదు. మాజీ ముఖ్యమంత్రి గురించి ఎలా మాట్లాడాలో ఆయనకి ఇప్పటికీ తెలిసిరాలేదు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ఈర్ష్యపడేలా విశాఖలో వైయస్ జగన్ కట్టిన నిర్మాణాల గురించి పట్టాభి మాట్లాడిన మాటలు ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పరువు తీసేలా ఉన్నాయి. రూ.1100 కోట్లు పెట్టి అమరావతిలో చంద్రబాబు కట్టిన కారే బిల్డింగులతో ప్రజలు పోల్చి చూస్తున్నారన్న ఆలోచన కూడా వారికి రాకపోవడం విడ్డూరం. విశాఖకి రాష్ట్రపతి, గవర్నర్ వంటి ప్రముఖులు వచ్చినప్పుడు వారు ఉండేందుకు నిర్మించిన రుషికొండ ప్రభుత్వ భవనాలపై బురదజల్లాలని చూసినప్పుడల్లా అమరావతిలో వేల కోట్లు వెచ్చించి చంద్రబాబు నిర్మించిన తాత్కాలిక భవనాల గురించి చర్చ జరుగుతున్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నారో అర్థం కావడం లేదు. వైయస్ జగన్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. చంద్రబాబు దగ్గర పట్టాభి తన పరపతి పెంచుకోవాలని ఆశపడతున్నాడు. పట్టాభి టెంట్ వేసుకోవాలనుకుంటే చంద్రబాబు ఇంటి ముందు వేసుకోవాలి. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి పదవుల మోజులో పడి నోటికొచ్చినట్టు పేట్రేగి మాట్లాడితే పట్టాభి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరిస్తున్నా. చంద్రబాబు తెచ్చింది 14 లిక్కర్ కంపెనీలే నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణం జరగలేదని మాట్లాడుతున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి సత్యప్రసాద్ లు.. రేపు మాజీ సీఎం వైయస్ జగన్ అక్కడికే వెళ్తున్నారు కాబట్టి వారూ అక్కడికొస్తే వాస్తవం తెలుస్తుంది. మెడికల్ కాలేజీల గురించి దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులతోపాటు ప్రపంచం మొత్తం కూడా నిజాలు తెలుసుకుంటుంది. ప్రజల సొమ్మును ప్రైవేటీకరణ పేరుతో 66 ఏళ్లపాటు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం తప్పు కాదా? మంచి చేస్తాడని ఓటేసిన ప్రజలకు చంద్రబాబు చేస్తున్న ద్రోహం కాదా? పీపీపీ పేరుతో వైద్యాన్ని ప్రైవేటుపరం చేసి వారికి ప్రభుత్వ ఆస్తులు రాసిస్తే పేద ప్రజలు జబ్బు చేసినప్పుడు వారి దగ్గరకు పోవాలా? ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత కాదా? రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క పేరున్న సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ అయినా ఉందా అని చంద్రబాబు ఎందుకు ఆలోచించడం లేదు? దేశంలోని టాప్ టెన్ ఆస్పత్రుల్లో ఎయిమ్స్ కూడా లేదు. వైయస్ జగన్ ఐదేళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే చంద్రబాబు 40 ఏళ్ల జీవితంలో 14 లిక్కర్ కంపెనీలు తీసుకొచ్చాడు. రాష్ట్రంలో ఏర్పాటైన లిక్కర్ కంపెనీలన్నీ తెలుగుదేశం హయాంలో ఏర్పాటైనవే. నాలుగు దిక్కులకూ నలుగురు నాయకులతో కల్తీ లిక్కర్ సరఫరా రాష్ట్ర ప్రజల నరనరాల్లోకి కల్తీ సారాను ఎక్కించి చంద్రబాబు సహా టీడీపీ నాయకులు జేబులు నింపుకుంటున్నారు. దేశంలోనే సంపన్నులుగా ఎదిగారు. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు, ధనిక ఎంపీ పెమ్మసాని, ధనిక మంత్రులుగా నారా లోకేష్, నారాయణ ఉన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఇవ్వకూడని విధంగా అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం ఇస్తానని ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నాడు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ లిక్కర్ మరణాలు ఒక్కటీ సంభవించకపోయినా ఎల్లో మీడియా ద్వారా జరిగినట్టు దుష్ప్రచారం చేశారు. ఈ విషయం ఎన్‌సీఆర్‌బీ తన నివేదికలో స్పష్టం చేసింది. 2019-24 మధ్య వైయస్ఆర్‌సీపీ హయాంలో ఏవైనా కల్తీ లిక్కర్ మరణాలు సంభవించాయా అని ప్రశాంత్‌రెడ్డి అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా వివరాలు కోరితే ఏ ఒక్కరూ చనిపోలేదని, కనీసం అనారోగ్యంపాలైన ఆనవాళ్లు కూడా లేదని ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు స్పష్టం చేసింది. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక నాణ్యమైన లిక్కర్ హామీకి తూట్లు పొడిచేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అధికారికంగా కల్తీ లిక్కర్ తయారు చేసి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఒక కుటీర పరిశ్రమ మాదిరిగా కల్తీ లిక్కర్ దందాని నడిపిస్తున్నారు. కల్తీ బాటిళ్లకు నకిలీ స్టిక్కర్లు వేసి బెల్ట్ షాపుల ద్వారా రాష్ట్రమంతా సరఫరా చేస్తున్నారు. లిక్కర్ సరఫరా కోసం రాష్ట్రాన్ని నాలుగు ఏరియాలుగా విభజించి నలుగురు నాయకులను నియమించి వారి ద్వారానే నాలుగు దిక్కులకూ అధికారికంగా పంపిణీ చేస్తున్నారు. ఆ వచ్చిన డబ్బును చంద్రబాబు ఉండవల్లి ప్యాలెస్‌కి తరలించేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాలను కూటమి ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. నిందితులంతా టీడీపీ నాయకులే కల్తీ లిక్కర్ దందాలో పట్టుబడుతున్న నిందితులంతా టీడీపీ నాయకులే. తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి అడ్డంగా దొరికిపోయాక వైయస్ఆర్‌సీపీ కోవర్టు అని ప్రచారం చేసుకుంటున్నందుకు టీడీపీ సిగ్గుపడాలి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీద టీడీపీ టికెట్ మీద పోటీ చేసిన వ్యక్తినే పెద్దిరెడ్డి అనుచరుడని దిగజారిపోయి ప్రచారం చేసుకోవడమే చంద్రబాబు విజనరీయా? తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే కల్తీ లిక్కర్ దందా సాగుతుందని చెప్పడానికి అరెస్టు అవుతున్న టీడీపీ నాయకులే సాక్ష్యం. టీడీపీలో నియోజకవర్గ ఇన్‌చార్జిలే అరెస్ట్ అవుతుంటే ఇంతకన్నా వేరే ఆధారాలు అవసరం లేదు. వైయస్ఆర్‌సీపీ హయాంలో కల్తీ లిక్కర్ మరణాలు సంభవించకపోయినా జరిగినట్టు పవన్ కళ్యాణ్ విష ప్రచారం చేశాడు. కానీ నేడు కూటమి పాలనలో టీడీపీ నాయకులే అధికారికంగా ఇంత దారుణంగా ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి మరీ కల్తీ లిక్కర్ తయారు చేసి దోచుకుంటుంటే నోరెత్తకుండా హైదరాబాద్‌లో తిరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రాష్ట్రంలో అందుబాటులో ఉండటం లేదని కూటమి ఎమ్మెల్యేలే ఆరోపణలు చేస్తున్నారు. కల్తీ మద్యం తాగి నెల్లూరులో నలుగురు, ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులో ఒకరు, కాలేశ్వర గ్రామంలో ఒకరు, గుంతకల్లులో బేల్దారి మేస్త్రీ చనిపోయారు. కల్తీ లిక్కర్ తాగి చనిపోయిన వారి కుటుంబాలకు పవన్ కళ్యాన్, చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? కూటమి నాయకుల ధన దాహానికి రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి.