ఎల్లో మీడియా క‌థ‌నాల కూర్పుగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం 

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో వచ్చే వార్త‌లనే గ‌వ‌ర్న‌ర్‌తో చ‌దివించారు

అన్నీ అబ‌ద్ధాలు, కాకి లెక్క‌లు, నిరాధార ఆరోప‌ణ‌లు, భ్ర‌మ‌లు

స్ప‌ష్టం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ య‌ర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ 

తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన య‌ర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ 

ప్ర‌జా సమ‌స్య‌ల‌పై వైయ‌స్ఆర్‌సీపీ నిల‌దీస్తుంద‌ని ప్ర‌భుత్వానికి భ‌యం 

స‌భ‌లో ప్ర‌భుత్వ వైఫల్యాలు చ‌ర్చ‌కు రాకూడ‌ద‌నేది వారి ఆలోచ‌న‌

164 మంది స‌భ్యులు 11 మందికి స‌మాధానం చెప్పలేకున్నారు 

సంప‌ద సృష్టిస్తామ‌ని 20 నెల‌ల్లోనే రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచేశారు

విజ‌న‌రీ పాల‌నలో వింత పోక‌డ‌లే కానీ విష‌యం లేదు..  

ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే అసెంబ్లీకి రావ‌డానికి వైయ‌స్ఆర్‌సీపీ సిద్ధం

వైయ‌స్ఆర్‌సీపీకి ప్ర‌తిప‌క్ష హోదాపై గ‌వ‌ర్న‌ర్ చొర‌వ చూపాలి

విజ్ఞ‌ప్తి చేసిన ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ 

తాడేప‌ల్లి: ఎల్లో మీడియా క‌థ‌నాలు కూర్పుగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉంద‌ని.., ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ5ల‌లో వ‌చ్చే క‌థ‌నాల‌నే పుస్తకంగా అచ్చేసి ఆయ‌న‌తో చ‌దివించారేమోన‌న్న అనుమానం క‌లుగుతోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ య‌ర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ స్ప‌ష్టం చేశారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్ర‌సంగమంతా చూస్తుంటే భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, కాకి లెక్క‌లు, నిరాధార ఆరోప‌ణ‌లే క‌నిపిస్తాయ‌ని వివ‌రించారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టిన‌ అట్ట‌ర్ ఫ్లాప్ సినిమాకి ప్రెస్‌మీట్ పెట్టి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిసింద‌ని చెప్పిన‌ట్టుగా ఉంద‌ని ఎద్దేవా చేశారు. విజ‌న‌రీన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు పాల‌నలో అడుగడుగునా వింత పోక‌డ‌లే త‌ప్ప విష‌యం లేదని మండిప‌డ్డారు. ప్ర‌జా సమ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నిల‌దీస్తుంద‌ని ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంద‌ని, స‌భ‌లో ప్ర‌భుత్వ వైఫల్యాలు చ‌ర్చ‌కు రాకూడ‌ద‌నే భ‌యంతోనే వైయ‌స్ఆర్‌సీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డం లేద‌ని చెప్పారు. ప్ర‌తిప‌క్ష హోదా విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ చొర‌వచూపాల‌ని ఎమ్మెల్యే విజ్ఞ‌ప్తి చేశారు. 164 మంది స‌భ్యులున్న కూటమికి 11 మంది వైయ‌స్ఆర్‌సీపీ స‌భ్యుల‌కు స‌మాధానం చెప్పే ద‌మ్ము లేదా అని ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే స‌భ‌కు రావ‌డానికి వైయ‌స్ఆర్‌సీపీ సిద్ధంగా ఉంద‌ని తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ స్ప‌ష్టం చేశారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

● అట్ట‌ర్ ఫ్లాప్ సినిమాకి క‌లెక్ష‌న్ల వ‌ర్షం అన్న‌ట్టుంది

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక మూడో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలోనైనా వాస్త‌వాలు ఉంటాయ‌నుకుంటే ఆయ‌న‌తో కూడా ప‌చ్చి అబ‌ద్దాలు చెప్పించారు. ఆయ‌న ప్ర‌సంగం చూస్తే నిత్యం ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి టీవీ5, ఏబీయ‌న్‌ల‌లో వ‌స్తున్న క‌థ‌నాల‌ను వింటున్న‌ట్టు, చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఎల్లో మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌నే పుస్త‌కంగా అచ్చేసి గ‌వ‌ర్న‌ర్‌తో చ‌దివించారేమోన‌ని ఎవ‌రికైనా అనుమానం క‌లుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ప‌థ‌కాల గురించి ఊసే లేదు. అవే అబ‌ద్ధాలు, కాకి లెక్క‌లు, నిరాధార ఆరోప‌ణ‌లు, ఏదో జ‌రిగిపోతుంద‌న్న భ్ర‌మ‌లు... ఇవి మాత్ర‌మే కాకుండా నిత్యం ఎల్లో మీడియాలో క‌నిపించే వైయ‌స్ఆర్‌సీపీ మీద ఏడుపులు, పెడ‌బొబ్బ‌లు.. స్థూలంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టిన సినిమాకి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిసింద‌ని ప్రెస్‌మీట్ పెట్టి చెప్పుకున్న‌ట్టుగా ఉంది. 20 నెల‌ల్లో రూ. 3.27 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసి ప‌త‌నం వైపున రాష్ట్రాన్ని న‌డిపిస్తూ అభివృద్ధి వైపు ప‌రుగులు పెడుతున్న‌ట్టు గ‌వ‌ర్న‌ర్ తో చెప్పించ‌డం హాస్యాస్ప‌దంగా ఉంది. నిన్నటి వ‌రకు చేసేందేమీ లేదు. ఈరోజు ఏం చేస్తాడో తెలియ‌దు.. కానీ ఏరో స్పేస్ సిటీ, ఎల‌క్ర్టానిక్ సిటీ, క్వాంటం సిటీల పేరుతో ప్ర‌జ‌ల‌కు భ్ర‌మ‌లు క‌ల్పిస్తున్నారు. ఎవ‌రో చేసిన‌ హైద‌రాబాద్ సిటీ, సైబ‌రాబాద్ సిటీ డెవ‌ల‌ప్‌మెంట్‌ను ఇప్ప‌టికీ త‌న గొప్ప‌గానే చెప్పుకుంటున్నాడు. 

● ఇళ్లు లేవు, పింఛ‌న్లు లేవు, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేదు

పున‌ర్నిర్మాణం, అభ్యుద‌యం, అభివృద్ధి అని పెద్ద పెద్ద మాట‌లు చెబుతున్న ప్ర‌భుత్వం.. రెండేళ్ల‌వుతున్నా విధ్వంస పాల‌న అంటూ వైయ‌స్ఆర్‌సీపీ మీద నెపం నెట్ట‌డం దౌర్భాగ్యం. గ‌త చంద్ర‌బాబు నేతృత్వంలోని టీడీపీ ప్ర‌భుత్వం రాష్ట్ర ఖజానాలో రూ. 100 కోట్లు పెట్టి దిగిపోతే ఐదేళ్లు సంక్షేమ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో విజ‌య‌వంతంగా నడిపించారు. రూపాయి అవినీతి లేకుండా ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తి హామీని నెర‌వేర్చారు. సంప‌ద సృష్టిస్తాన‌ని ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌బ‌లికి 2024లో వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం.. సంప‌ద సృష్టించ‌డం ప‌క్క‌న‌పెడితే రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బ‌తీసి శ్రీలంక హీనంగా మార్చేశాడు. వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ హయాంలో ఐదేళ్ల‌లో రూ. 3.36 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేస్తే.. సంప‌ద సృష్టిస్తామ‌ని చెప్పిన కూట‌మి ప్ర‌భుత్వం 20 నెల‌ల‌కే రూ. 3.27 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసింది. అమ‌రావ‌తి రాజ‌ధాని పేరుతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం, కంపెనీల ఏర్పాటు పేరుతో విశాఖ‌లో భూముల పంప‌కం త‌ప్పించి చంద్ర‌బాబు చేసింది శూన్యం. చేసిన త‌ప్పులు, హామీలు అమ‌లు చేయ‌లేని చేత‌కానిత‌నాన్ని, జ‌రుగుతున్న అవినీతిని కప్పి పుచ్చుకోవ‌డానికి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఆఖ‌రుకి క‌లియుగదైవం శ్రీ వేంక‌టేశ్వ‌రుడిని వివాదాల్లోకి ప‌బ్బం గ‌డుపుకోవ‌డం సిగ్గుచేటు. కూట‌మి నాయ‌కుల దారుణాల‌ను ప్ర‌శ్నిస్తే మాజీ మంత్రుల ఇళ్ల‌పై పెట్రోల్ బాంబులు, యాసిడ్ దాడులు చేశారు. శాంతిభ‌ద్ర‌త‌ల ప‌త‌నం జ‌రుగుతుంటే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో దాని ఊసే లేదు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక రాష్ట్ర పోలీసు వ్య‌వ‌స్థ దేశంలోని అత్యున్న‌త స్థానం నుంచి అట్ట‌డుగు స్థాయికి ప‌డిపోతే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌స్తావించ‌లేదు. ఒక్క పింఛ‌న్ కొత్త‌గా ఇవ్వ‌క‌పోగా 5 ల‌క్ష‌ల పింఛ‌న్లు తొల‌గించారు. ఒక్క ఇంటి స్థ‌లం మంజూరు చేయ‌క‌పోయినా ఇంటి నిర్మాణాలు ఆపేశారు. ఫీజు రీయింబ‌ర్స్ బ‌కాయిలు క్లియ‌ర్ చేయ‌క‌పోయినా, ఆరోగ్య‌శ్రీతో వైద్యం అంద‌క‌పోయినా, రైతులు పండించే పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు లేక‌పోయినా .. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ పాల‌న అందిస్తున్న‌ బ‌డాయి మాట‌లు చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు విద్యుత్ చార్జీల‌ను త‌గ్గిస్తామ‌ని అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి.. ట్రూఅప్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలు రెండింత‌లు పెంచేసి దోచుకుంటున్నారు. శ్రీశైలం చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనివిధంగా భ‌క్తుల మీద లాఠీ చార్జీ చేశారు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదాన్ని వివాదాల్లోకి లాగారు. ఆస్తుల కోసం ఆల‌యాల నేల‌మ‌ట్టం జ‌రుగుతోంది. స‌నాత‌న ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షిస్తామ‌ని అధికారంలోకి వ‌చ్చిన నాయ‌కుల పాల‌న‌లో ఇన్ని అరాచ‌కాలు జ‌రుగుతున్నా గ‌వర్న‌ర్ ప్ర‌స్తావ‌న ఎక్క‌డా లేదు. వక్ఫ్ భూములు, ఆల‌యాల‌కు చెందిన ఎండోమెంట్ భూములు కాజేస్తున్నారు. మెడిక‌ల్ కాలేజీలు ప్రైవేటీక‌రించి పేద‌ల‌కు నాణ్య‌మైన వైద్యాన్ని దూరం చేస్తుంటే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో దాని ప్ర‌స్తావ‌నే క‌నిపించ‌లేదు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తూ ప్ర‌జ‌ల త‌ర‌ఫున గొంతు వినిపిస్తున్న ప్ర‌తిప‌క్షం మీద అక్ర‌మ కేసులు బ‌నాయించి వేధిస్తున్నారు. 

● ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాలంటే స‌భ‌లో స‌మ‌యం ఇవ్వాలి క‌దా

ఎక్క‌డ చూసినా అన్యాయాలు, అరాచ‌కాలు, దౌర్జ‌న్యాలు, దోపిడీ, అత్యాచారాలు రాజ్య‌మేలుతున్నాయి. ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన‌ పోలీసు వ్య‌వ‌స్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. స‌భ‌లో ఉన్న ఒకే ఒక్క ప్ర‌తిప‌క్ష పార్టీ.. ఆరు కోట్ల ప్ర‌జ‌లంద‌రి త‌ర‌ఫున 175 నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌ను స‌భ‌లో బ‌లంగా వినిపించాలంటే అసెంబ్లీలో స‌మ‌యం కావాలి క‌దా. స‌మ‌యాన్ని కేటాయించ‌కుండా అసెంబ్లీకి రమ్మంటే ఎలా?  దీనిపై గ‌వ‌ర్న‌ర్‌కి ఫిర్యాదు చేసినా స్పంద‌న లేదు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తిప‌క్షం బ‌లంగా గొంతు వినిపించక‌పోతే అమాయ‌కుల‌కు న్యాయం జ‌రిగేది ఎలా? వైయ‌స్ఆర్‌సీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌కూడ‌ద‌నే నిబంధ‌న ఎక్క‌డైనా ఉందా? గ‌వ‌ర్న‌ర్ గారు దీనిపై స్పందిస్తార‌ని ఆశించినా ఫ‌లితం క‌నిపించ‌లేదు. ప‌క్క రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు నిర్మించి మ‌న‌కు రావాల్సిన నీటి వాటాను వినియోగించుకుంటుంటే చంద్ర‌బాబు చోద్యం చూస్తూ కూర్చున్నాడు. రాయ‌ల‌సీమ ప్రాంతానికి సంజీవ‌ని లాంటి పోతిరెడ్డిపాడు ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ప‌క్క రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప్ర‌యోజ‌నాల కోసం సీఎం చంద్ర‌బాబు తాక‌ట్టు పెట్టేశాడు. వీట‌న్నింటిపై అసెంబ్లీలో చ‌ర్చ‌కు రాకూడ‌ద‌ని, చ‌ర్చ‌కు వ‌స్తే ప్ర‌జ‌ల‌కు స‌మాధానం  చెప్పే ద‌మ్ములేక వైయ‌స్ఆర్‌సీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డం లేదు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను అసెంబ్లీ సాక్షిగా వైయ‌స్ జ‌గ‌న్ గారు ప్ర‌శ్నిస్తార‌నే భ‌యంతోనే ప్ర‌తిప‌క్ష నాయకుడిగా గుర్తించ‌డానికి వెనక‌డుగు వేస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ గారు హెచ్చ‌రించిన‌ట్టుగానే దోచుకో పంచుకో తినుకో లాంటి పాల‌న న‌డుస్తోంది.

● జ‌ర్న‌లిస్టుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు

అసెంబ్లీకి వెళ్లి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని బ‌లంగా నిల‌దీయాల‌ని ఉంది. కానీ ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌డానికి భ‌య‌ప‌డిపోతోంది. దీనిపై గ‌వ‌ర్న‌ర్ గారు కూడా చొర‌వ చూపించాలి. రాష్ట్రంలో జ‌రుగుతున్న అల్ల‌ర్ల‌పై ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్‌కి  విన‌తిప‌త్రం ఇచ్చినా చ‌ర్య‌లు క‌నిపించ‌లేదు. అమ‌రావ‌తి పేరు చెప్పి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేయ‌డం త‌ప్ప‌, నిర్మాణం జ‌ర‌గ‌డం లేదు. పెట్టుబ‌డుల పేరుతో చంద్ర‌బాబు విలువైన భూములు బినామీల‌కు రాసిచ్చేస్తున్నాడు. పొలిటిక‌ల్ గ‌వర్నెన్స్ పేరుతో రాష్ట్రాన్ని కుక్క‌లు చింపిన విస్త‌రిలా మార్చేశారని తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ విమ‌ర్శించారు.

Back to Top