గిరిజన విద్యార్థులను వెనక్కి పంపే ప్రయత్నాలు విరమించాలి

ఐటీడీఏ అధికారులకు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే ఫాల్గుణ

పాడేరు: విశాఖపట్నం మారికవలస గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న 5, 6, 7 తరగతుల విద్యార్థులను వెనక్కి పంపించే ప్రయత్నాలను ప్రభుత్వం, అధికారులు వెంటనే విరమించుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు సోమవారం పాడేరు క్యాంపు కార్యాలయంలో పాడేరు ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు మాజీ ఎమ్మెల్యే ఫాల్గుణను కలిసి తమ సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ప్రస్తుతం ఉన్న గురుకుల పాఠశాలలోనే విద్యను కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

తల్లిదండ్రుల సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే ఫాల్గుణ విద్యార్థులతో కలిసి ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లారు. ఐటీడీఏ పీఓ అందుబాటులో లేకపోవడంతో ఏపీఓకు వినతిపత్రం అందజేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. గిరిజన విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలను వెనక్కి తీసుకుని, వారి విద్య కొనసాగింపునకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
 

Back to Top