కాంత్రికారుడిలా వైయ‌స్ జగన్ నిర్ణయాలు 

ఎమ్మెల్యే  భూమన కరుణాకర్ రెడ్డి
 

అమ‌రావ‌తి:  కాంత్రికారుడిలా వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. నూతన మద్యం విధానంపై శాసన సభలో భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ మన దేశంలోని ఏ రాష్ట్రం సాహసించలేనటువంటి నిర్ణయం మన ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్నారన్నారు. రాబోయే విప్లవానికి వామనుని అంగ ఈ బిల్లు అని కొనియాడారు. ఇందులో ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతుంది అని సవరణ తీసుకువచ్చినా దీని వెనుక  ఓ లోతైన ఆలోచన ఉందని చెప్పారు. 
రాష్ట్రంలో మహిళలయొక్క ఆక్రందన, మహమ్మారి బారినపడి అల్లాడుతున్న కుటుంబాలు, తరిగిపోతున్న మానవ సంపద, సామాజిక సంపద ఈ శాఖలో అంతర్లీనంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం పేదల, శ్రమజీవులను మద్యానికి బానిసలుగాచేసిన దుష్టబుద్ధి పాలనే గతంలో సాగింది అన్నారు. మనుషులను ఓటర్లుగా, ఓట్ల కోసం విలువలను మంటగలిపేవిధంగా చంద్రబాబు ప్రవర్తించాడన్నారు. స్కూలుకు వెళ్లే పిల్లవాడి చేతిలోనూ, పనిచేసే కార్మికుడి చేతిలోనూ మందు సీసా పెట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని ఎద్దేవా చేసారు. సందుకో బారు మనిషికో బీరు అన్నట్టు చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారించాడని దుయ్యబట్టారు. ఒకప్పుడు ఎన్టీరామారావు సైతం సంచీల్లో మందును పంపిణీ చేసాడని గుర్తు చేసారు. నేటి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగుల జీవితాలనుంచి మద్యం మహమ్మారిని పారద్రోలేందుకు కంకణం కట్టుకుందని శాసనసభ సాక్షిగా తెలియజేసారు. 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలనే కాదు సంక్షోభాలను కూడా అధిగమించి, ఓ క్రాంతికారుడిలా ఆలోచన చేస్తున్నాడని కితాబిచ్చారు. యువతను నిర్వీర్యం చేస్తున్న, మానవ విలువలను, సంబంధాలనూ నాశనం చేస్తున్న మద్యాన్ని కట్టడి చేసే విధానం ఇదని వివరించారు భూమన. ఆదాయం కోసం ప్రభుత్వం ఈపని చేయడం లేదని, నిర్ణీత సమయం పాలన, రేట్లు పెంచి మద్యాన్ని పేదలకు దూరంగా ఉంచడం, విద్యార్థులు, యువత ఈ మహమ్మారి బారిన పడకుండా కట్టుదిట్టం చేసేందుకే మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నామని తెలియజేసారు. 
పిన్నవయసులో 25 - 35 సంవత్సరాలకే మద్యానికి బానిసలై, ఆనారోగ్యంపాలై, ఆర్థికంగా చితికిపోయి మరణిస్తున్న వారి వివరాలు సేకరించాలని ప్రభుత్వానికి సూచన చేసారు భూమన. 25ఏళ్ల వయసుకే ఎందరో అమ్మాయిలు భర్తలను కోల్పోయి, పిల్లలు, కుటుంబాలతో సహా వీధిన పడటానికి ఈ మద్యమే కారణం అని అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారని తెలియజేసారు భూమన కరుణాకర్ రెడ్డి.
 

తాజా వీడియోలు

Back to Top