పుంగనూరులో దాడులకు చంద్రబాబు, లోకేశ్‌ బాధ్యత వహించాలి

మిథున్‌రెడ్డిని సురక్షితంగా బయటకు తీసుకురావాలి

మాజీ మంత్రి పెద్దిరెడ్డి డిమాండ్‌

చిత్తూరు జిల్లా: పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై జరిగిన దాడుల వెనుక చంద్రబాబు, నారా లోకేశ్‌ ఉన్నారని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. దాడుల పర్యవసానాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పుంగనూరులో చోటుచేసుకున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. రిటర్నింగ్‌ అధికారి నారాయణరెడ్డి వ్యవహారశైలిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, పోలీసులు టీడీపీ కార్యకర్తలతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు.

మిథున్‌రెడ్డికి భద్రత కల్పించాలి

రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని పెద్దిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికల్లో అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, దాడులకు పాల్పడిన వారిపై తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

Back to Top