దిశ చట్టం మహిళలందరికీ శ్రీరామరక్ష

రాష్ట్ర మహిళలందరికీ జగనన్న రక్ష

అయోధ్యలా ఆంధ్రరాష్ట్ర ఆదర్శంగా నిలుస్తుంది

ఏపీ దిశ చట్టంతో మహిళాలోకం హర్షిస్తుంది

కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై విచారణ జరిపించాలి

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

అసెంబ్లీ: మహిళలందరికీ అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. ఆ చట్టంపై మాట్లాడే అవకాశం కల్పించారు. మహిళలందరి తరుఫున సీఎం వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో చాలా మంది మహిళలు, చిన్నారులు, యువతులు అనేక ఇబ్బందులు పడడం చూశాం. అంతేకాకుండా మన దేశంలో కూడా చాలా కేసులు రోజు రోజుకు నమోదవుతున్నాయి. మహిళలకు భద్రత లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల నుంచి మహిళలకు భద్రత కల్పిస్తూ.. మీ అందరికీ నేను అండగా ఉన్నానంటూ.. భరోసా ఇస్తున్నానంటూ సీఎం వైయస్‌ జగన్‌ కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని మహిళా లోకం హర్షిస్తుంది.

2012లో నిర్భయ కేసు చూశాం. కొన్ని రోజుల క్రితం తెలంగాణలో జరిగిన దిశ కేసు చూశాం. అయితే కొన్ని మాత్రమే మీడియా ముందుకు రావడం, ప్రపంచానికి తెలియడం జరుగుతుంది.. కానీ చాలా మంది మహిళలు, యువతులు, బాలికలు, పసికందులపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలు బయటకురానివి ఉన్నాయి. అలాంటి వాటిని దృష్టిలోపెట్టుకొని సీఎం వైయస్‌ జగన్‌ మహిళల పక్షాన ఎంతో మానవత్వంతో ఆలోచించి చక్కటి చట్టాన్ని తీసుకువచ్చారు. మహిళలు ఎక్కడ పూజింపబడుతారో.. అక్కడ దేవతలు ఉంటారనే నానుడి ఉంది. పరాయి స్త్రీలో కూడా మాతృమూర్తిని చూస్తూ గౌరవించాల్సిన అవసరం ఉంది. మహిళలు ఆది పరాశక్తిగా, దేవతగా పూజింపబడే ఈ గడ్డపై నిత్యం ఏదో ఒక చెడువార్త వింటున్నాం. లైంగిక దాడులు, హత్యలు, లైంగిక వేధింపులు ఇలా ఆలోచిస్తుంటే సమాజం ఎటువైపు వెళ్తుందనే భయమేస్తుంది.
మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడుతున్నా.. ఇంకా ఇలాంటి భయంకర సంఘటనలు జరగడం వల్ల ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా మంది భయపడే పరిస్థితి మన దేశంలో ఉంది. విశాఖ జిల్లా మాడ్గుల మండలం వాకపల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి అనే గిరిజన మహిళలపై అత్యాచారం జరిగింది. ఈ రోజున మా పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి చెందిన ఒక శాసనసభ్యుడు తహసీల్దార్‌ వనజాక్షిపై ఏ విధంగా దాడి చేశారో చూశాం. కానీ ఆ రోజున సీఎంగా ఉన్న చంద్రబాబు ఏమాత్రం మహిళలకు అండగా నిలబడకుండా వాళ్ల ఎమ్మెల్యేని వెనకేసుకురావడం చాలా బాధాకరం. ముక్తకంఠంతో అలాంటి సంఘటనలను వ్యతిరేకిస్తున్నాం. దిశ ఘటనపై చాలా మంది మహిళలు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. దిశ నిందితులను వెంటనే శిక్షించాలని తెలియజేశారు. ఆ సందర్భంలో చాలా మంది ఎన్‌కౌంటర్‌ చేయాలని అభిప్రాయపడ్డారు. నిజంగా ఈ రోజున చిన్న పిల్లలపై జరుగుతున్న దాడులు చూసి అలాంటి పరిస్థితి ఉంటే బాగుంటుందని ఒక మహిళగా.. తల్లిగా నాకు కూడా కలిగింది. అత్యాచారాలకు గురికాబడుతున్న మహిళలందరికీ, బాలికలు, పసికందులకు అండగా ఉంటూ జగనన్న చట్టం తీసుకురావడం మా అందరికీ ధైర్యాన్ని ఇచ్చింది.

గత ప్రభుత్వ పాలన దుశ్యాసన పర్వంగా సాగింది. సాధారణ మహిళ నాటి నుంచి జిల్లా ప్రథమ పౌరురాలైన మహిళ, చిరు ఉద్యోగుల వరకు వేధింపులకు గురికావడం గత ప్రభుత్వంలో చూశాం. అలాగే గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడినప్పుడు ఆ ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో మనందరికీ తెలుసు. అంతేకాకుండా గత ప్రభుత్వం పాలుపోసి పెంచిన కాలనాగు కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ వందలాది కుటుంబాలను, వేలాది మంది మహిళలను శారీరకంగా, మానసికంగా తెలుగు తమ్ముళ్లు ఏ విధంగా హింసించారో మనందరికీ తెలుసు. అలాంటి కేసుల్లో కూడా వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాల్‌మనీ కేసులు తన మనుషులు ఎక్కడ దొరికిపోతారో అని ఆ రోజున చంద్రబాబు అంబేడ్కర్‌ స్మృతివనం అని సభను డైవర్ట్‌ చేశారు. ఈ రోజు వరకు అంబేడ్కర్‌ స్మృతివనం లేదు.. 125 అడుగుల విగ్రహం పెట్టింది లేదు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై విచారణ చేయించింది లేదు. కాల్‌మనీ కేసుల విచారణ జరిపించాలని సీఎం వైయస్‌ జగన్‌ అన్నను కోరుతున్నాను.
గత ప్రభుత్వం నేరస్తులపై తీసుకున్న చర్యలకంటే.. నేరాన్ని నిలదీసిన వారిపై తీసుకున్న చర్యలు అధికం. ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆ రోజున కాగితాలకే పరిమితం చేశారు. ఈ ఘనత చంద్రబాబుకే దక్కింది. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో మంచినీరు దొరకడం కంటే మద్యం మాత్రం ఏరులై పారింది. వీధి వీధిన బెల్టుషాపులు పెట్టి తెలుగు తమ్ముళ్లు నడిపించారు. మా నియోజకవర్గంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి ఉన్నారు.. ఆయన బీరును హెల్త్‌ డ్రింక్‌గా ప్రమోట్‌ చేశారు. ఆ రోజుల్లో మా నియోజకవర్గానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి బెల్టుషాపులు ఉంటే బెల్టు తీస్తానని చెప్పిన మాట వాస్తవం.. ఈ ప్రభుత్వం వచ్చేంత వరకు బెల్టుషాపులు రద్దు చేయలేదు. సీఎం వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఏ వీధుల్లో బెల్టుషాపులు లేకుండా చేశారు. మద్యం వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందని తెలిసినా కూడా మహిళలు సంతోషంగా ఉండాలి.. కుటుంబాలు ఆనందంగా ఉండాలని బెల్టుషాపులను రద్దు చేయించారు. మద్యం షాపులను తగ్గించి మిగిలిన షాపులు కూడా ప్రభుత్వం నడిపేలా చర్యలు తీసుకున్నారు. నాలుగు దశలుగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. దానికి సీఎం కట్టుబడి ఉన్నారు.

Read Also: ఇన్నాళ్లకు మన కన్నీళ్లు తుడిచే అన్నొచ్చాడు

పార్టీలకు అతీతంగా మద్యం నియంత్రణను మహిళలంతా స్వాగతిస్తున్నారు. చాలా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయంటే సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయమేనని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అభం.. శుభం తెలియని చాలా మంది బాలికలపై  లైంగిక దాడులు జరుగుతుంటే.. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు బీటలుబారుతున్నాయి. ఇలాంటి చర్యలను అంతమొందించాలంటే సమర్థవంతమైన దర్యాప్తు అవసరం. మనం అంతా చదువుకునే రోజుల్లో చరిత్ర గురించి చదివాం.. విన్నాం.. కానీ ఇప్పటి వరకు చరిత్రలో జరగని సంఘటనలు చేసి చూపిస్తున్న మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. జగనన్నకి పేరు పెట్టినప్పుడు దివంగత నేత వైయస్‌ఆర్‌ ఏం ఆలోచించి పెట్టారో తెలియదు కానీ.. నిజంగా జగన్మోహనుడు అంటే అర్థం.. ప్రపంచం అంతా అభిమానం పొందే విధంగా ఆయన చేస్తున్న సంక్షేమాలు, తీసుకుంటున్న నిర్ణయాలు చూసి ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తున్నాయి.
మొదటి కేబినెట్‌ భేటీ దగ్గర నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలు నెరవేర్చే దిశగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరికీ 50 శాతం రిజర్వేషన్లు కల్పించి ఈ రోజున దళిత మహిళలను హోంమంత్రిగా చేయడం.. గిరిజన మహిళలను డిప్యూటీ సీఎంగా చేయడం... గత ప్రభుత్వంలో గిరిజన శాఖకు మంత్రిని కూడా నియమించలేదు. కానీ సీఎం వైయస్‌ జగన్‌ గిరిజన మహిళకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి.. గిరిజన శాఖను ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. కేబినెట్‌లో ముగ్గురం మహిళా మంత్రులం ఉన్నాం. సీఎం వైయస్‌ జగన్‌ మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో కేబినెట్‌ చూస్తేనే అర్థం అవుతుంది. ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు కృషిచేస్తున్నాం. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ హోంశాఖను ఆ రోజున మహిళలకు ఇస్తే.. ఈ రోజున మన సీఎం వైయస్‌ జగన్‌ తండ్రికి మించిన తనయుడిగా రెండు అడుగులు ముందుకు వేసి దళిత మహిళలకు హోంశాఖ ఇవ్వడం నిజంగా చరిత్ర. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కేటాయించడమే కాకుండా అందులో 50 శాతం మహిళలకు కేటాయించడం చాలా అభినందించదగ్గ విషయం.

డీసీసీ బిల్లు, ఏంఎసీ, మైనర్‌ ఇరిగేషన్‌ కమిటీలు, స్కూల్‌ కమిటీలు, దేవాలయ కమిటీల్లో గతంలో ఎక్కడా ప్రాధాన్యత ఉండేది కాదు.. కానీ, ఈ రోజున ఆ కమిటీల్లో మహిళలు ఉంటున్నారంటే దానికి కారణం సీఎం వైయస్‌ జగన్‌. మహిళా పక్షపాతి సీఎం వైయస్‌ జగన్‌ అని చెప్పేందుకు ఇవన్నీ చాలా తక్కువ. పక్కరాష్ట్రంలో జరిగిన సంఘటన చూసి మన రాష్ట్రంలో ఆడవారు ఎలాంటి ఇబ్బంది పడకూడదని చక్కటి చట్టాన్ని తీసుకువచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. గత ప్రభుత్వంలో బాబు వస్తే జాబు వస్తుందనే నినాదాలతో అధికారంలోకి వచ్చారు.. వారు వచ్చిన తరువాత ఉన్న ఉద్యోగాలు పోయాయి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఏ గ్రామానికి వెళ్లినా.. బాబు పోయాడు కాబట్టే జాబు వచ్చిందని యువత చెబుతున్నారు. నిరుద్యోగులంతా ఉద్యోగులుగా మారారంటే అదొక చరిత్ర. సీఎం వైయస్‌ జగన్‌ను సృష్టికర్త అని చెప్పుకోవచ్చు.

అంబేడ్కర్, జ్యోతిరావుపూలే, గాంధీజీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు స్వయంగా సీఎం వెళ్లడమే కాకుండా.. వారి ఆలోచన విధానాలను, ఆశయాలను కార్యాచరణలోకి తీసుకురావడానికి ఎంతగా కృషిచేస్తున్నారో ఈ ఆరు నెలల పాలన ఆదర్శం. జ్యోతిరావుపూలే ఆశయం స్త్రీ విద్యను ప్రోత్సహించడం.. విద్యను ప్రోత్సహించడం కోసం సీఎం వైయస్‌ జగన్‌ అమ్మ ఒడి పథకం పెట్టారు. ఎక్కడా బాలకార్మిక వ్యవస్థ ఉండకూడదు.. డ్రాప్‌ అవుట్స్‌ ఎక్కడా ఉండకూడదని మంచి ఉద్దేశ్యంతో అమ్మ ఒడి పథకాన్ని పెట్టి ప్రతీ విద్యార్థి చదువుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం పెట్టడం హర్షణీయం.

అలాగే స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి వెయ్యి రోజుల వరకు చక్కటి పౌష్టికాహారం ఇస్తే.. రాబోయే తరం ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం ఎంతో మంచి చర్యలు తీసుకుంటుంది. పిల్లలు చదువుకోవడానికి అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15 వేల ఆర్థికసాయంతో పాటు యుక్తవయస్సు వచ్చిన ఆడపిల్లలకు పెళ్లి కానుక ద్వారా అండగా ఉండడం, మహిళల పేరు మీదనే ఇళ్ల స్థలాలు, పట్టాలు, రేషన్‌ కార్డులు, భరోసా కింద రూ.75 వేలు ఇవ్వడం, మహిళలు ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం శ్రద్ధతో ఉంది.

మహిళా బిల్లుతో ప్రపంచంలోనే నవశకాన్ని ప్రారంభించినట్లు. మహిళలతో అమానుషంగా ప్రవర్తించే వారికి మనస్సులో సైతం చెడు ఆలోచన రాకుండా నియంత్రిస్తుంది. సీఎం వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన దిశ బిల్లు నిర్ణిత కాలంలో దర్యాప్తు చేపట్టడం, శిక్ష విధించడం చరిత్రాత్మక నిర్ణయం. అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండడం వల్ల ఈ కాలంలో వేగవంతమైన దర్యాప్తు సాధ్యం అవుతుంది. నిర్దిష్టమైన సాక్షాధారాలు లక్ష్యమైనప్పుడు నిర్ణిత కాలంలో శిక్ష విధించడం సాధ్యం అవుతుంది. శిక్షాకాలం పెంచడం స్వాగతించాల్సిన అంశం.
చిన్న పిల్లలను లైంగిక వేధింపులు చేస్తే పాల్పడితే 14 ఏళ్ల జైలు తీవ్రమైన శిక్ష, పోస్కో చట్టం కింద 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచడం నిజంగా హర్షణీయం. మహిళలను అవమానించినా.. అసత్య ప్రచారాలు చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసినా శిక్షలు వేసేలా బిల్లు తీసుకురావడం నిజంగా మహిళలందరికీ చాలా అండగా, భరోసాగా ఉంటుంది. అసత్య ప్రచారాలకు మొదటి తప్పు రెండేళ్లు అయితే.. తరువాతి తప్పుకు నాలుగేళ్లు జైలుశిక్ష వేయడం మహిళలకు సపోర్టుగా ఉంటుంది. అత్యాచార కేసుల్లో ఆధారాలు ఉన్నప్పుడు ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో వాదన, 21 రోజుల్లో శిక్ష విధించడం అనేది అత్యాచారాలకు గురవుతున్న మహిళలకు ఊరటగా ఉంటుంది. అన్ని జిల్లాల్లో స్త్రీలపై జరిగే అత్యాచారాలను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం ఈ బిల్లు ద్వారా నేరప్రవృత్తి కలిగిన వ్యక్తుల్లో భయం కలుగుతుంది. నేరం చేయాలనే ఆలోచన కూడా వారికి రాకుండా చేస్తుంది. ఆనాడు త్రేతాయుగంలో శ్రీరాముడు పరిపాలించిన అయోధ్య ఒక ఆదర్శ రాజ్యం అయితే.. సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రరాష్ట్రం ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈ చట్టం మహిళలందరికీ శ్రీరామరక్షగా ఉంటుంది. 

Read Also: ఇన్నాళ్లకు మన కన్నీళ్లు తుడిచే అన్నొచ్చాడు

   
Back to Top