చంద్రబాబు, ఎల్లోమీడియా కుట్రలను తిప్పికొట్టాలి

వైయస్‌ జగన్‌ ప్రభుత్వ సంక్షేమ పాలనను ప్రతీ గడపకూ తీసుకెళ్లాలి

పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతీ కార్యకర్తకు న్యాయం జరుగుతుంది

అనంతరం నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అనంతపురం: మూడున్నర సంవత్సరాల పాలనలోనే మేనిఫెస్టోలోని వాగ్దానాలను 98 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని, కరోనా కష్టకాలంలోనూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారని వైయస్‌ఆర్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పేదల సంతోషాన్ని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై నిత్యం బురదజల్లుతున్న చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్రలను తిప్పికొట్టాలని, వైయస్‌ జగన్‌ ప్రభుత్వ సంక్షేమ పాలనను ప్రతీ గడపకూ వివరించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అనంతపురం నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, ఉషాశ్రీచరణ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు.  

''వైయస్‌ఆర్‌ సీపీ, సీఎం వైయస్‌ జగన్‌ మీద ప్రజల్లో ప్రేమాభిమానాలు ఇసుమంత కూడా తగ్గలేదు. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో వైయస్‌ఆర్‌ సీపీలో పనిచేస్తున్నందుకు మనమంతా చాలా గర్వపడాలి. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు తూచా తప్పకుండా దాదాపు 98.44 శాతం అమలు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది. గతంలో ఏ రాష్ట్రంలోనూ, ఏ ముఖ్యమంత్రి కూడా మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించలేదు. చెప్పినవే కాకుండా.. చెప్పని వాగ్దానాలను కూడా అమలు చేస్తున్నారు. 

రెండు సంవత్సరాలు కరోనా ప్రభావంతో ప్రభుత్వ ఖజానాకు గండిపడినా.. చెప్పిమాట తప్పకుండా ఆ సంక్షోభ సమయంలోనూ రాష్ట్ర ప్రజలను ఆర్థికంగా ఆదుకున్నారు. అనంతపురం పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రంలో ప్రజలను పట్టించుకున్న నాధుడేలేడు. అనేక ఆర్థిక ఇబ్బందులున్నా.. మొక్కవోని ధైర్యంతో ప్రజలను సీఎం వైయస్‌ జగన్‌ ఆదుకున్నారు. 

2014లో చంద్రబాబు ఇచ్చిన  హామీలను రైతులు, మహిళలు, యువకులు అన్ని వర్గాల వారు నమ్మారు.. ఇవన్నీ నమ్మి చంద్రబాబుకు అధికారం కట్టబెడితే ప్రజలందరినీ నట్టేట ముంచాడు. 100 పేజీల మేనిఫెస్టోలోని 600 హామీలను అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వెబ్‌సైట్‌ నుంచి తీసేశాడు. చంద్రబాబు ఏ  విధంగా అధికార, ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడ్డాడో ప్రజలందరికీ వివరించాలి. ఆరోజున ఉన్న ఆదాయమే ఈరోజూ రాష్ట్రానికి వస్తుంది. లక్షల కోట్ల రూపాయల డబ్బును సీఎం వైయస్‌ జగన్‌ ప్రజల కోసం ఖర్చు చేశారు. మరి చంద్రబాబు ఆ డబ్బును ఎందుకు, ఎవరి కోసం ఖర్చు చేశారు..? ఏదైనా ప్రాజెక్టు పూర్తిచేశారా..? 14  సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏ ఒక్క మంచిపనైనా చేయగలిగాడా..? 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని తలచుకుంటే ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌ వంటి పథకాలు గుర్తుకువస్తాయి. సీఎం వైయస్‌ జగన్‌ నవరత్నాలు, అమ్మ ఒడి వంటి అనేక పథకాలు వినూత్నంగా మొదలుపెట్టి అమలు చేస్తున్నారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు చెప్పుకోదగ్గ పథకం ఒక్కటైనా ఉందా..? పత్రికలు, మీడియా ఛానళ్లను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం బురదజల్లుతున్నాడు. సీఎం వైయస్‌ జగన్‌కు మనమంతా అండగా నిలుస్తూ టీడీపీ, ఎల్లోమీడియా కుట్రలను తిప్పికొట్టాలి.

పార్టీ ముఖ్యనేతల సమావేశంలో కార్యకర్త గురించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రస్తావించారు. కార్యకర్తలపై దృష్టిసారిస్తాం.. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతీ కార్యకర్తకు గుర్తింపునిస్తామని సీఎం చెప్పారు. విజయవాడలో జయహో బీసీ మహాసభ విజయవంతమైంది. 85 వేల మంది పైచిలుకు బీసీ ప్రజాప్రతినిధులుగా తయారు చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది. బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు.''
 

Back to Top