అనంతపురం : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జన హృదయ నేత అని వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి కొనియాడారు. వైయస్‌ఆర్ భౌతికంగా లేకపోయినా అందరి హృదయాల్లో బతికే ఉన్నారని తెలిపారు. మంగళవారం అనంతపురంలో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయం వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని అనంత వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. 130 మంది రక్తదానం చేశారు. అనంతరం వైయస్ఆర్‌సీపీ ఇంటెలెక్చువల్ వింగ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి కట్టుబడి తానీషా, రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరయ్య, జిల్లా అధ్యక్షుడు రమేష్, నగర అధ్యక్షుడు జయప్రకాష్‌రెడ్డి, దాసిరెడ్డి ఆధ్వర్యంలో డెయిరీ ఆవిష్కరించారు. కమలానగర్‌లో ఉన్న ‘నిరాశ్రయ’ వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. వైయస్ఆర్ విగ్రహానికి నివాళి వైయస్‌ఆర్ జయంతి సందర్భంగా నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి వైయస్ఆర్‌సీపీశ్రేణులతో కలిసి అనంత వెంకటరామిరెడ్డి నివాళి అర్పించారు. అనంతరం ప్రభుత్వ సర్వజనాస్పత్రి వద్ద అన్నదానం నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో సర్వజనాస్పత్రిలో 108 వాహన సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు. ఆ తర్వాత వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ కాలనీ సమీపంలోని నేషనల్ పార్క్ వద్ద ఉన్న రాకేష్ వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఆశ్రమంలో వృద్ధులతో కలిసి అనంత వెంకటరామిరెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం లక్ష్మీనగర్‌లో ఉన్న రెయిన్‌బో అనాథాశ్రమంలో బీసీ సెల్ అనంతపురం నియోజకవర్గ అధ్యక్షుడు లక్ష్మన్న ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. వైయస్ స్ఫూర్తితో వైయస్ జగన్ పాలన వైయస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితోనే వైయస్ జగన్ ఐదేళ్ల పాలన సాగిందని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వైయస్‌ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పేదరికాన్ని పొగొట్టడానికి అనేక చర్యలు తీసుకున్నారన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో కరువును పారదోలడానికి జలయజ్ఞం ద్వారా 86 ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. ఈ రోజు రాయలసీమకు కృష్ణా జలాలు వస్తున్నాయంటే అది వైయస్ రాజశేఖరరెడ్డి చలవతోనేనని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభించిన ఘనత కూడా వైఎస్‌ఆర్‌దేనని తెలిపారు. పేదలకు విద్యను చేరువ చేయడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తెచ్చారని గుర్తు చేశారు. దీని వల్ల వేలాది మంది ఉన్నత విద్యను అభ్యసించారన్నారు. అదేవిధంగా పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించారని తెలిపారు. 108.. 104 వాహనాలను తెచ్చిన ఘనత కూడా వైఎస్‌ఆర్‌దేనని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించారన్నారు. వడ్డీ వ్యాపారస్తులు పీల్చిపిప్పి చేస్తుంటే మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు అందించిన ఘనత వైఎస్‌దని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించి వారి సొంతింటి కలను సాకారం చేశారన్నారు. పరిపాలకుడు అంటే ఎలా ఉండాలో తెలియజేసిన నాయకుడు వైయస్ రాజశేఖరరెడ్డి అని కీర్తించారు. తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడిగా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రెండు అడుగులు ముందుకు వేసి సంక్షేమ పథకాలు అందించినట్లు చెప్పారు. వైయస్ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధన కోసం పని చేస్తామని స్పష్టం చేశారు.