తాడేపల్లి: మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పై దాడి ఘటనకు సూత్రధారి ధూళిపాళ్ల నరేంద్రేనని, ఈ కేసులు అతనిపై ఏ-1 కేసు నమోదు చేయాలని వైయస్ఆర్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీ డిమాండ్ చేశారు. తాడేపల్లి లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేవలం రాజకీయ కక్షతోనే 50-60 ఏళ్లుగా మన్నవలో రాజకీయంగా పదవుల్లో ఉన్న నాగమల్లేశ్వరరావును అంతమొందించేందుకే దాడి చేశారన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర హత్యా రాజకీయాలపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపేదిలేదని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... సీసీ టీవీ పుటేజ్ తో గత్యంతరం లేకే 307 కేసు: పొన్నూరు పట్టణంలో కట్టెంపూడి అడ్డరోడ్డు వద్ద టీటైం సాక్షిగా జరిగిన దారుణమైన సంఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. బాధితుడుకి మల్టిపుల్ ఇంజ్యూరీస్ ఉన్నాయి. రిబ్ పదిచోట్ల ఫ్రాక్చర్ అయింది. స్లీన్ రిమూవ్ చేశారు. బ్రెయిన్ లో మేజర్ ఇంజ్యూర్. రమేష్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు ప్రాణంతో పోరాటం చేస్తున్నాడు. దాడి సీసీ పుటేజ్ పొన్నూరు దాటి ప్రపంచమంతా వ్యాపించినా ప్రభుత్వం నుంచి చర్యలు లేవు. నామ మాత్రంగా కొంతమంది అరెస్టులు చూపించారు. దాడి 5.05 గంటలకు జరిగితే 5.35 గంటలకు స్థానిక పోలీసులు దాడి ఘటనకు సంబంధించిన సీసీ పుటేజ్, టీ స్టాల్ యజమాని ఫోన్ తీసుకుని వెళ్లిపోయారు. దాడిని యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తుంటే... ప్రజలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అంతకముందే సీసీ టీవీ పుటేజ్ రావడంతో గత్యంతరం లేక 307 కేసు నమోదు చేశారు. మన్నవ వైయస్ఆర్‌సీపీ ఆయువుపట్టు: దళిత సామాజిక వర్గానికి చెందిన నాగమల్లేశ్వరరావు కుటుంబం 1948 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉంది. ఆ గ్రామంలో వారి కుటుంబమే గడిచిన 50-60 ఏళ్లకు పైగా సర్పంచ్ గానూ, ఎంపీటీసీ గానూ ఎన్నికవుతూ వస్తోంది. ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ, సర్పంచ్ గా గెలవలేకపోయింది. దాడికి గురైన నాగమల్లేశ్వరరావు 4 పర్యాయాలుగా సర్పంచ్ గా ఎన్నికవుతూ వస్తున్నారు. దళిత కుటుంబంలో పుట్టి అంబేద్కర్ స్పూర్తితో ఎదిగిన కుటుంబం. నలుగురు సోదరులు ఉంటే ముగ్గరు సోదరుల భార్యల్లో ఒకరు ఆర్డీఓ, మరొకరు డిప్యూటీ డైరెక్టర్ స్టాటస్టిక్స్, ఇంకొకరు బ్యాంకు మేనేజరుగా పనిచేస్తుండగా.. వారి పిల్లలు సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడ్డారు. మన్నవ గ్రామం రిజర్వుడు స్ధానం అయినా, కాకున్నా వీరే సర్పంచ్, ఎంపీటీసీగా ఎన్నికవుతున్న పరిస్థితి ఉంది. స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర ఏడుపర్యాయాలు, ఆయన తండ్రి మరో రెండు పర్యాయాలు మొత్తం 9 పర్యాయాలు పోటీచేసినా మన్నన గ్రామంలో ఎప్పుడూ సర్పంచ్, ఎంటీటీసీ కాలేకపోయారు. ఇంకా చెప్పాలంటే 2019 కంటే 2024 లో కూడా మన్నవ గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 194 ఓట్ల మెజారిటీ పెరిగింది. ఆ గ్రామం వైయస్ఆర్‌సీపీ ఆయువు పట్టు. అక్కడ ఫ్యాక్చన్ చిచ్చు రేపడం ద్వారా నాశనం చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర ప్రయత్నం చేస్తున్నాడు. నియోజకవర్గంలో చిచ్చు రేపుతున్న నరేంద్ర: నియోజకవర్గమంతా ఈయన దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. గతంలో చింతలపూడి గ్రామంలో కూచిపూడి గాంధీ ఆత్మహత్య చేసుకుంటూ నా మరణానికి నరేంద్ర కారణమని లేఖ రాశాడు. నిడుబ్రోలు యలివర్తి నాగేశ్వరరావు హత్య కేసులో నరేంద్ర, ఆయన సోదరుడు రవికుమార్ మరో పది మంది ముద్దాయిలు కలిసి ప్రత్యక్షంగా ఆ హత్యలో పాల్గొన్నట్టు ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. నరేంద్ర సోదరుడుతో పాటు ఆరుగురు ముద్దాయిలు కేసు తేలకముందే విచిత్రమైన వ్యాధితో మరణించారు. అది ఏం వ్యాధో నరేంద్రకూ, పొన్నూరు పట్టణ ప్రజలకూ తెలుసు. ఇదీ నరేంద్ర అరాచకాల చిట్టా: ధూళిపాళ్ల పెట్టిన చిచ్చు వల్ల వెళ్లనూరు గ్రామంలో 11 హత్యలు జరిగాయి. నాగమల్లేశ్వరరావు సోదరుడు అమరేంద్ర మీద 2016లో ఒకసారి తాజాగా 2024లో మరోసారి దాడి చేశారు. సర్పంచ్ గా ఉన్న నాగమల్లేశ్వరావు చెక్ పవర్ తీసేశారు. పంచాయితీ ఆఫీసుని దాడిలో ముద్దాయిగా ఉన్న బాబూరావు ఇంట్లో పెట్టారు. సర్పంచ్ ఇంట్లో ఊర్లో చెక్ పవర్ లేకుండా ఉంటాడు. ఇదా అంబేద్కర్ కోరుకున్న ప్రజాస్వామం, రాసిన రాజ్యాంగం. నరేంద్ర అరాచకాలు లెక్కకు మించి ఉన్నాయి. నాగమల్లేశ్వరరావుపై జరిగిన దాడిని ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ అని చిత్రీకరిస్తున్నారు. ఇటీవల చింతలపూడిలో జరిగిన మినీమహానాడులో నరేంద్ర ప్రత్యక్షంగా బాబూరావును దాడికి దిగమని రెచ్చగొట్టాడు. లెక్కకు లెక్క ఇవ్వాలని.. గీత దాటి వచ్చిన వాడిని భూస్థాపితం చేయమని ఆదేశించావు. ఆ వీడియోలు నియోజకవర్గంలో సర్క్యూలేట్ అవుతున్నాయి. అయినా ఇంత వరకు ఏ-4, ఏ-5 లను అరెస్టు చేయలేదు. వాళ్లు మీడియా సమావేశం పెట్టినా వారిపై చర్యలు లేవు. పోలీసుల తీరు అభ్యంతరకం: వైయస్ఆర్‌సీపీ జిల్లా నాయకులందరం ఎస్పీని కలిసి.. మినీమహానాడులో నరేంద్ర జారీ చేసిన ఆదేశాలకు సంబంధించిన వీడియో, టీ టైం దగ్గర హత్యాప్రయత్నం చేసిన వీడియో రెండింటిని ఇచ్చాం. విచారణ జరిపి నరేంద్ర మీద ఏ-1 ఫైల్ చేయమని సూత్రధారిపై చర్యలు తీసుకోవాలని అడిగాం. అయితే ఆయన మాట్లాడిన వీడియో ఫ్యాబ్రికేటెడ్ అంటూ తిరిగి నా మీద కేసు ఫైల్ చేశారు. కేసులకు భయపడేదిలేదు. పోరాటం ఆగదు. రాష్ట్ర రాజధానిలో ఒక శాసనసభ్యుడు దళితులను ఇలా చంపిస్తుంటే రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఈ నేపథ్యంలో ధూళిపాళ్ల నరేంద్రపై నాగమల్లేశ్వరరావుపై దాడి కేసులో మొదటి ముద్దాయిగా కేసు నమోదు చేయాలి. లేని పక్షంలో మల్లేశ్వరరావు సోదరునితో పాదయాత్ర చేసి ఉద్యమాలు నడిపే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్తున్నప్పుడు గోవతోటి రాంబాబు తెలుగుదేశం క్రియాశీలక కార్యకర్త, మైక్ అనౌన్సర్ నీ కారు కింద చనిపోతే పోస్ట్ మార్టమ్ లేకుండా మెడికో లీగల్ కేసు రిజిస్టర్ చేయకుండా ఆ కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ఖననం చేశావు. దీనిపై విచారణకు సిద్ధమా. ఈ కేసులో నిన్ను ఎందుకు ముద్దాయిగా ఈ ప్రభుత్వం పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డారని మీరు ఫ్యాబ్రికేట్ కేసు పెట్టారు కదా ఇది ఇక్కడ నరేంద్రకు వర్తించదా అని నిలదీశారు. నరేంద్ర చేసిన అరాచకాలను కేసులుగా మార్చకపోతే భవిష్యత్తులో వీటిని కేసులుగా కచ్చితంగా నమోదు చేయిస్తామన్నారు.