పంటల బీమా..రైతులు దూరం..దూరం 

ప్రస్తుత ఖరీఫ్‌లో వాతావరణ పంటల బీమాకు ముగిసిన గడువు

ప్రీమియం భారంతో ఇన్సూరెన్స్‌పై ఆసక్తి చూపని రైతులు

స్వచ్ఛంద నమోదుకు దూరంగా 60 శాతం అన్నదాతలు

అమరావతి: ఉచిత పంటల బీమాకు టీడీపీ కూటమి ప్రభుత్వం మంగళం పాడడంతో రాష్ట్రంలోని రైతులకు పంటల బీమా భారంగా మారింది. స్వచ్ఛంద నమోదు విధానంలో ప్రీమియం భారం కావడంతో అధిక శాతం మంది పంటల బీమాకు దూరమవుతున్నారు. ఖరీఫ్‌ 2025–26 సీజన్‌లో సాగైన వాతావరణ ఆధారిత పంటలకు ప్రీమియం చెల్లింపునకు మంగళవారంతో గడువు ముగిసింది. గత ఏడాది బీమా రక్షణ పొందినవారిలో 60 శాతం మంది ఈసారి నమోదు చేసుకోలేదు. దాదాపు 58 శాతం విస్తీర్ణంలోని పంటలకు బీమా కవరేజీ పొందలేకపోయారు. దిగుబడి ఆధారిత పంటలు సాగు చేసే రైతులు సైతం పంటల బీమాకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. 
రబీ నుంచే మొదలు..
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు పైసా భారం పడకుండా రైతులకు వెన్నుదన్నుగా నిలి­చి­న ఉచిత పంటల బీమా పథకాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎత్తివేసింది. సమయాభావం వలన ఖరీఫ్‌–2024 వరకు ఉచిత పంటల బీమా కొనసాగించింది. రబీ 2024–25 నుంచి ఎత్తివేసింది. 

దిగుబడి ఆధారిత పంటలకు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), వాతావరణ ఆధారిత పంటలకు నిర్బంధ వాతావరణ ఆధారిత పంటల బీమా స్కీమ్‌ (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌) కింద స్వచ్ఛంద నమోదు విధానంలో పంటల బీమా అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రీమియం భారం కావడంతో రబీలో కేవలం 6.75 లక్ష­ల మంది రైతులే తాము సాగు చేసిన 9.90 ల­క్షల ఎకరాలకు మాత్రమే బీమా కవరేజీ పొందగలి­గారు. దాదాపు 38 లక్షల ఎకరాల్లో  పంటలకు 35 లక్షలమంది రైతులు బీమా పొందలేకపోయా­రు.

భారంగా మారిన ప్రీమియం
ప్రస్తుత ఖరీఫ్‌లో దిగుబడి ఆధారంగా 15, వాతావరణ ఆధారంగా 7 చొప్పున మొత్తం 22 పంటలను నోటిఫై చేశారు. వరికి 26 జిల్లాల్లో, మిగిలిన పంటలకు జిల్లాల వారీగా సాగు విస్తీర్ణాన్ని ఆధారంగా తీసుకున్నారు. వాతావరణ ఆధారిత పంటలుగా పత్తి, నిమ్మ, అరటి, వేరుశనగ, టమాట, అరటి, దానిమ్మ, బత్తాయి నోటిఫై చేశారు. గరిష్టంగా హెక్టార్‌కు దానిమ్మకు రూ.9,375, బత్తాయికి రూ.7,562, అరటికి రూ.7,500, నిమ్మకు రూ.6,250, పత్తికి రూ.5 వేలు, టమాటాకు రూ.4 వేలు, వేరుశనగకు రూ.1,600 చొప్పున ప్రీమియం నిర్దేశించారు. దీని చెల్లింపు గడువు మంగళవారంతో ముగిసింది. 

Back to Top