‘ఆ ఫ్లెక్సీలో అభ్యంతరకర వ్యాఖ్యలు ఎక్కడున్నాయ్‌! 

కడప కోర్టులో పోలీసులకు చుక్కెదురు

వైయ‌స్ఆర్‌ జిల్లా: ఎంత పని సేచ్చి వయ్యా జగనూ..!అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వ్యవహారంలో కడప కోర్టులో పోలీసులకు చుక్కెదురైంది. ప్లెక్సీలో ఎక్కడా అభ్యంతరకర వ్యాఖ్యలు లేవన్న మెజిస్ట్రేట్‌ కోర్టు.. 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే? 
వైఎస్‌ జగన్‌ పాలన గురించి ప్రస్తావిస్తూ ప్లెక్సీ ఏర్పాటు చేశారని వైయ‌స్ఆర్‌సీపీ  వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొద్ది రోజుల క్రితం ‘ఎంత పని చేశావయ్యా జగన్’ అంటూ కడప ఆర్ట్స్ కాలేజ్ వద్ద నాలుగు రోజుల క్రితం నాగార్జున రెడ్డి ఓ ప్లెక్సీని ఏర్పాటు చేయించారు.

వైయ‌స్‌ జగన్‌ అందించిన జనరంజకమైన పాలనను కూటమి ప్రభుత్వం సైతం అనుసరించేలా చేశారనే భావనతో ప్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే, ఆ ఫ్లెక్సీపై సైతం కుట్ర పూరిత రాజకీయాలకు తెరలేపారు.  ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన వారిని, దానిని తయారు చేసిన వారిపై కేసు నమోదు చేశారు. నాగార్జున రెడ్డితో పాటు ప్లెక్సీ తయారు చేసిన అమృతరాజు అనే వ్యక్తి అరెస్ట్ చేశారు.

రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా చేశారంటూ నాన్ బెయిలబుల్‌తో పాటు మొత్తం ఆరు సెక్షన్లు కింద పోలీసులు కేసులు పెట్టారు. రిమాండ్ కోసం ఆ ఇద్దరిని మెజిస్ట్రేట్ ముందు హజరు పరిచారు. విచారణ చేపట్టిన మెజిస్ట్రేట్‌ కోర్టు ఫ్లెక్సీ వ్యవహారంలో నాన్ బెయిలబుల్‌ సెక్షన్లు వర్తించవని రిమాండ్ తిరస్కరించింది. అంతేకాదు,ప్లెక్సీలో ఎక్కడా అభ్యంతరకర వ్యాఖ్యలు లేవన్న మెజిస్ట్రేట్.. 41ఏ నోటీసులు ఇచ్చి  విచారించాలని స్పష్టం చేసింది. 

Back to Top