ఇంటింటికీ ‘బాబు’ మోసాలు తీసుకువెళ్లాలి 

 నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త  ఆనం విజయకుమార్ రెడ్డి పిలుపు
 

నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఇంటింటికీ తీసుకువెళ్లి, ప్రజలను చైతన్యపరచాలని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌,  నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త  ఆనం విజయకుమార్ రెడ్డి  పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని చింతారెడ్డిపాళెంలో ఆనం విజయకుమార్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న  "బాబు షూరిటీ మోసం గ్యారెంటీ" "రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో (క్యూ ఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్క‌ర‌ణ‌) కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా విజ‌య్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సంయుక్తంగా బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌ గ్యారంటీ పేరిట ప్రమాణ పత్రాలు పంపిణీ చేశారన్నారు. సాధ్యం కాని హామీలిచ్చిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేశారని చెప్పారు. అధికారం చేపట్టి 13 నెలలవుతున్నా, తూతూమంత్రంగా ఒక్క గ్యాస్‌ సిలిండర్‌, అరకొరకగా తల్లికి వందనం మినహా చేసిందేమీ లేదని గుర్తు చేశారు. ప్రభుత్వ మోసాలను ప్రశ్నిస్తున్న తమపై రాజద్రోహం కేసులు పెడతామంటూ బెదిరించడం దారుణమన్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదని, రాష్ట్రాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని అన్నారు. ఇచ్చిన హామీలు చేసేంత వరకూ ప్రజల గొంతుకై ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మేనిఫెస్టోను భగవద్గత, బైబిల్‌, ఖురాన్‌గా భావించిందని, అప్పటి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను మొదటి సంవత్సరంలోనే అమలు చేశారని విజ‌య్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో  కార్పొరేటర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top