'స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టు' ను ఎన్జీటీ ఆపేసింది 

క‌లెక్ట‌ర్‌ను క‌లిసి ఆదేశాల‌ను అంద‌జేస్తా

ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డి వెల్లడి 

నెల్లూరు లోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌ రెడ్డి 

జాఫ‌ర్ సాహెబ్ కెనాల్ పై షాప్‌ల ఏర్పాటును నిలిపేయాలని ఎన్జీటీ ఆదేశాలు‌

ఈ ప్రాజెక్టుతో న‌గ‌రంలో ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులు  

ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖర్‌రెడ్డి ఆగ్రహం 

నెల్లూరు: పర్యావరణానికి విఘాతం కలిగించేలా నెల్లూరులో జాఫర్ సాహెబ్ కెనాల్‌పై ఏర్పాటు చేస్తున్న 'స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్‌'ను తక్షణం నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసినట్లు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు లోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ కారణంగా కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతాయనే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఎన్జీటీ నుంచి ఈ మేరకు నిలుపుదల ఆదేశాలు వెలువడ్డాయని తెలిపారు. నెల్లూరులో మంత్రి నారాయణ ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా తన అనుయాయులకు దాదాపు రెండు వందల దుకాణాలను కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎన్జీటీ ఆదేశాలతో ఆగిపోయాయని అన్నారు. మొత్తం పెన్నానదికే ముప్పు కలిగించేలా కూటమి ప్రభుత్వం, మంత్రి నారాయణ వ్యవహరిస్తున్న తీరుకు ఎన్జీటీ ఆదేశాలు చెంపపెట్టు అని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... 

మంత్రి నారాయ‌ణ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు..

నారాయ‌ణ వ‌ల్ల నెల్లూరు జిల్లాకి మంచి జ‌రుగుతుంద‌ని భావించి ప్ర‌జ‌లు ఆయ‌న్ను గెలిపిస్తే ఏడాదిలో నెల్లూరు ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఆయ‌న మంత్రిగా ఉండి కూడా ఏమీ ప‌ట్ట‌నట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 'స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టు' మీద ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయ సేక‌ర‌ణ చేస్తే మెజారిటీ ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నారు. ఈ ప్రాంతం దానికి అనువైనది కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా వాహ‌నాల సుల‌భ‌ ర‌వాణాకు అనువుగా ఉండాల‌ని 100 అడుగుల రోడ్డు నిర్మిస్తే దాన్ని షాపుల‌తో మూసేయ‌డం ఏమాత్రం ఆహ్వానించ‌ద‌గిన నిర్ణ‌యం కాదు. షాపుల కేటాయింపులోనూ పార‌ద‌ర్శ‌క‌త ఉండ‌టం లేదు. మ‌హిళా శ‌క్తి పేరుతో ఎన్నిక‌ల్లో టీడీపీ కోసం ప‌నిచేసిన మ‌హిళ‌ల‌కు ఈ షాపుల‌ను కేటాయించ‌డం న్యాయ‌మా అని ఆలోచించాలి. 300 మంది నిర్వాసితులు ఈ షాపుల కోసం ద‌రఖాస్తు చేసుకుంటే వారెవ‌రికీ ఇవ్వ‌డం లేద‌ని అధికారులే చెబుతున్నారు. మంత్రి నారాయ‌ణ ఇప్ప‌టికే ఎవ‌రెవ‌రికి ఇవ్వాలో లిస్ట్ రెడీ చేశార‌ని చెబుతున్నారు. ప్ర‌భుత్వ సంప‌ద‌ను త‌న వారికి ఇలా ఏక‌ప‌క్షంగా క‌ట్ట‌బెట్టేయ‌డం త‌ప్పు. 

రూ. 120 కోట్ల‌తో వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో కాలువ అభివృద్ధి 

పెన్నా న‌ది నుంచి నెల్లూరు సిటీ మీదుగా నాలుగు మండ‌లాల‌కు జాఫ‌ర్ సాహెబ్ కెనాల్ ప్ర‌వ‌హిస్తుంది. ఈ కాలువ కింద నాలుగు మండ‌లాల ప‌రిధిలో 43 వేల ఎక‌రాలు సాగ‌వుతుంది. ఈ కెనాల్ లో మురుగు నీరు క‌లిసి కలుషితం కావ‌డంతోపాటు పిచ్చి చెట్ల‌తో కాలువ స్వ‌రూప‌మే మారిపోయింది. దీంతో వైయ‌స్సార్సీపీ హ‌యాంలో జాఫ‌ర్ సాహెబ్‌ కెనాల్ కి రూ. 100 కోట్ల‌తో 1000 మీట‌ర్ల పొడ‌వున ర‌క్ష‌ణ గోడ (రివిట్మెంట్ వాల్‌) నిర్మించ‌డం జ‌రిగింది. నెల్లూరు సిటీలో ఈ కాలువ మురుగు నీటితో భ్ర‌ష్టుప‌ట్టిపోయి ఉండ‌టంతో వైయస్సార్సీపీ హ‌యాంలో సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టి వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేయ‌డం జ‌రిగింది. దీంతోపాటు అద‌నంగా మ‌రో రూ. 20 కోట్ల‌తో రెండు వైపులా డివైడ‌ర్‌తో 100 ఫీట్ రోడ్డు నిర్మాణం చేశాం. కాలువ ఒడ్డున నివ‌సించే ఎంతోమంది పేద‌లు చేసిన త్యాగంతో ఈ కాలువ అభివృద్ధి సాధ్య‌ప‌డింది. వైయ‌స్సార్సీపీ హయాంలోనే దాదాపు 80 శాతానికిపైగా ప‌నులు  పూర్త‌యితే, కూట‌మి ఏడాది పాల‌న‌లో 20 శాతం ప‌నులు పూర్తి చేయ‌డానికి పూనుకోలేదు. కెనాల్ డివైడ‌ర్ మీద 200 షాపులు పెట్ట‌డానికి అవ‌స‌ర‌మైన ప‌నుల‌ను మాత్రం వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇందుకోసం 'స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టు' పేరుతో జీవో నెంబ‌ర్ 1005 తీసుకొచ్చారు. 

వ్యర్థాలతో పెన్నా నది కలుషితం
 
200 షాపులు పెడితే నెల్లూరు న‌గ‌రంలో తీవ్ర‌మైన ట్రాఫిక్ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. దుకాణాల నుంచి వ‌చ్చిన వేస్ట్‌ను కాలువ‌లో డంప్ చేసే ప్ర‌మాదం ఉంది. అదే జ‌రిగితే రూ. 100 కోట్ల‌తో శుభ్రంగా తీర్చిదిద్దుకున్న కాలువ మ‌ళ్లీ చెత్తా చెదారంతో నిండిపోయే ప్ర‌మాదం ఉంది.  కాలువను శుభ్రం చేయ‌డానికి, పూడిక‌ను, వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డం కోసం వ‌దిలిన పోరంబోకు ల్యాండ్ మీద షాపుల‌ను సిద్ధం చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ట్రాక్ట‌ర్లు, జేసీబీలు రావ‌డానికి ఇబ్బంది ఏర్పడుతుంది. కాలువ మ‌ర‌మ్మ‌తుల‌కు అవ‌కాశం లేకుండా దాన్ని పూర్తిగా నిర్బంధించారు. పెన్నా నుంచి వ‌చ్చే వ‌ర‌ద ఈ కాలువ గుండా ప్ర‌వ‌హిస్తుంది. పూడిక తొల‌గించ‌కుండా వ‌దిలేస్తే ఆ నీరంతా న‌గ‌రంలోకి వ‌చ్చి ఇళ్ల‌ను ముంచెత్తే ప్ర‌మాదం ఉంటుంది. వాకింగ్ ట్రాక్ మీద 200 షాపులు ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల‌ పాద‌చారుల‌కు కూడా ఇబ్బంది క‌లుగుతుంది. ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్‌ మెప్మా, క‌లెక్ట‌ర్‌, క‌మిష‌న‌ర్‌, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్‌, సూప‌రింటెండెంట్ ఇంజినీర్ లతో ఐదుగురు అధికారుల‌తో క‌లెక్ట‌ర్ జాయింట్ క‌మిటీని ఏర్పాటు చేయ‌గా స‌మ‌స్య‌లున్నాయ‌ని గుర్తిస్తూ వారు కూడా మార్చి 25న రిపోర్టు ఇచ్చారు. ఇప్పటికే ఎన్జీటీలో దీనిపై కేసు విచారణలో ఉండటంతో మున్సిపల్ క‌మిష‌న‌ర్ ఎన్జీటీకి ఇచ్చిన వివరణలో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీతో ఏర్పాటు చేయ‌డంతోపాటు ఈ దుకాణాల వల్ల వచ్చే వ్యర్థపు నీటిని శుద్ధి చేస్తామ‌ని చెప్పారు. అలాగే వ్య‌ర్థాలు కాలువలో వేయ‌కుండా 6 అడుగుల ఎత్తులో మెష్ ఏర్పాటు చేస్తామ‌ని ఎన్జీటీకి వివరించారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ ఆ ప‌నుల‌న్నీ పూర్త‌య్యే వ‌ర‌కు షాపులు మొద‌లు పెట్ట‌డానికి వీల్లేద‌ని ఆదేశాలు జారీ చేసింది. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌టానికి నేను చేసిన ప్ర‌య‌త్నాన్ని ఎన్జీటీ అభినందించింది. ఎన్జీటీ ఆదేశాల‌ను అమ‌లు చేయ‌మ‌ని రేపు క‌లెక్ట‌ర్‌ను కూడా క‌లవ‌బోతున్నాను. తెలుగుదేశం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల కోసం నెల్లూరు సిటీని రాసిస్తామంటే వైయ‌స్సార్సీపీ ఎట్టిప‌రిస్థితుల్లో చూస్తూ ఊరుకోదు.

Back to Top