అమరావతి అద్దాల ఖర్చుతో మెడికల్‌ కాలేజీలు పూర్తవుతాయి

ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి ధ్వ‌జం

పులివెందులలో వైయ‌స్ఆర్‌సీపీ బూత్‌ స్థాయి సమావేశం

వైయ‌స్ఆర్ జిల్లా: పులివెందులలో వైయ‌స్ఆర్‌సీపీ బూత్‌ లెవల్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌పై పార్టీ శ్రేణులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కడప ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ..అమరావతిలో నిర్మించబోయే భవనాల అద్దాలకు అయ్యే ఖర్చుతో రాష్ట్రంలోని అన్ని మెడికల్‌ కాలేజీలను పూర్తి చేయవచ్చని అన్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఎదురుదాడులకు దిగుతున్నారని విమర్శించారు. గతంలో పన్నులు తగ్గిస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయని చెప్పిన నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ పని చేయడం లేదన్నారు. ఈ విషయాలపై వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. తమ తప్పులను సరిదిద్దుకోవాల్సింది పోయి స్వర్గీయ రాజారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేర్లు ప్రస్తావిస్తూ “గొడ్డలి పార్టీ” అంటూ విమర్శలు చేస్తున్నారని అన్నారు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాన్ని ప్రస్తావిస్తూ, గొడ్డలితో హత్య చేశానని చెప్పిన వ్యక్తిని తమే నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారని, అలాంటప్పుడు వైయ‌స్ఆర్‌సీపీని ఎలా “గొడ్డలి పార్టీ” అంటారని ప్రశ్నించారు.

పులివెందులలో అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని బైరెటిస్‌, ఇసుక అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. పేదల డీకేటీ భూములను లిటిగేషన్‌ పేరుతో ఆక్రమిస్తున్నారని విమర్శించారు. గత రెండేళ్లలో మూడు సార్లు అరటి పంటలు దెబ్బతిన్నా రైతులకు సరైన సాయం అందలేదని, ఇప్పటికీ ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా అందలేదన్నారు. టీడీపీ నేత బీటెక్‌ రవిపై కూడా అవినాష్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవిని అమ్ముకునేందుకు ప్రయత్నించాడని, గతంలో విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చి తనకు సహాయం చేయాలని అడిగాడని ఆరోపించారు. వైయ‌స్ఆర్‌సీపీలో చేర్చుకోకపోతే బీజేపీలోకి వెళ్తానని చెప్పిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. వైయ‌స్ జగన్‌ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తున్నారని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని అవినాష్‌రెడ్డి అన్నారు. “మీ ప్రతి మాటకు సమాధానం చెబుతాం” అంటూ హెచ్చరించారు.
 

Back to Top