విజయవాడ: కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో మెగా స్కాం సృష్టించిందని వైయస్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన చంద్రబాబు, ఆయన కుమారుడికి మాత్రమే “పైలా పచ్చీస్”లా సాగిందని, ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజలు వైద్యం కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. రెండేళ్ల పాలనపై పండగ చేసుకునే పరిస్థితి కూడా ప్రభుత్వానికి లేదని చంద్రబాబు అంతరాత్మకే తెలుసు” అని వ్యాఖ్యానించారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ” అని మండిపడ్డారు. డీఎస్సీ పరీక్షల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, కాంట్రాక్ట్ ఉద్యోగి ఫస్ట్ ర్యాంక్ సాధించడం వెనుక అనుమానాలు ఉన్నాయన్నారు. “మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా మెరిట్ పరీక్షలు నిర్వహించడం ఏంటి? ఇది మెగా డీఎస్సీ కాదు.. మెగా స్కాం” అని విమర్శించారు. అమరావతి పేరుతో రైతులను మోసం చేశారని, భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు ఎక్కడున్నాయో ఇప్పటికీ తెలియదన్నారు. పరిశ్రమల పేరుతో భూముల దందా జరుగుతోందని, “రూపాయికి ఎకరం భూమి ఇస్తాం” అనే వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆరోపించారు. టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ అమలయ్యాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. “టీడీపీకి ఓటేసిన కార్యకర్తలే ఇప్పుడు మోసపోయామని బాధపడుతున్నారు. డబ్బులు ఇవ్వకుండా పనులు జరగడం లేదని ఎన్ఆర్ఐలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు” అన్నారు. ఎడాపెడా పెట్రోల్, డీజిల్ ధరల పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని, డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పి.. ఇప్పుడు కేంద్రం పెంచితే మాకు సంబంధం లేదంటున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ విమర్శల సందర్భంగా “మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటున్నారు.. అయితే మీది తడి గుడ్డల పార్టీ” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “నమ్ముకున్న వారందరికీ తడి గుడ్డతో గొంతు కోశారు” అని టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటంలో గోడ కూల్చివేత సమయంలో స్పందించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు కార్యకర్త ఇంటి కూల్చివేత విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కొబ్బరితోట నివాసం కూల్చివేత వివాదంలో ఎంపీ బాలశౌరి స్పందనను రాజకీయ డ్రామాగా అభివర్ణించిన పేర్ని నాని, బాధిత కుటుంబం అనుభవించిన మానసిక వేదనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. శిశుపాలుడి పాపాలు శ్రీకృష్ణుడు లెక్కించినట్లే.. రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వ పాపాలను లెక్కిస్తున్నారు అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు.