కృష్ణా: డైవర్షన్ పాలిటిక్స్‌లో కూటమి ప్రభుత్వం మరో కొత్త డ్రామాకు తెర లేపింది. కృష్ణా జిల్లాలోని గుడివాడలో జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక కుటుంబంపై దాడి చేసిన వారిని వదిలేసి బాధితులపై గుడివాడ పోలీసులు ఎదురు కేసులు పెట్టారు. టీడీపీ నాయకురాలి ఫిర్యాదుతో ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాముపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె కారులో వెళుతుండగా టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి మరీ దాడికి దిగారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడి తర్వాత కూటమి సర్కార్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో, రంగంలోకి కూటమి పెద్దలు.. బాధితులను టార్గెట్ చేశారు. తాజాగా జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక కారుపై దాడి చేసి రివర్స్‌లో వారిపైనే కేసు పెట్టారు. పచ్చ బ్యాచ్ ప్లాన్‌లో భాగంగా హారిక భర్త రాము.. తన కాలుపై కారు ఎక్కించాడని టీడీపీ నాయకురాలు మాదాల సునీత ఆరోపించారు. అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతల సాయంతో సునీత.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, హారిక భర్త రాముపై గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాముతో సహా నందివాడ మండలం వైయస్ఆర్‌సీపీ నేత కందుల నాగరాజుతో పాటు మరికొందరిపై కేసులు పెట్టారు. అయితే, జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక కారుపై దాడి ఘటనలో మాత్రం పోలీసులు ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. దాడి ఘటనలో గుడివాడ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గోవాడ శివ ప్రసాద్ పాల్గొన్నట్లు పక్కాగా ఆధారాలున్నప్పటికీ ...ఉప్పాల హారిక ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించలేదు.