పేద‌ల గుండెచ‌ప్పుడు వైయ‌స్ఆర్‌

రాజ్య‌స‌భ స‌భ్యులు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి  

వ్యవ‌సాయాన్ని పండ‌గ చేసి చూపించిన విజ‌న‌రీ వైయస్ఆర్‌

విద్య‌, వైద్యం ప్ర‌భుత్వ బాధ్య‌త‌గా భావించి అమ‌లు చేసిన మాన‌వ‌తావాది

సంక్షేమ ప‌థ‌కాల‌తో విప్లవాత్మ‌క మార్పులు తెచ్చిన మహనీయుడు  

ఆయ‌న సేవ‌లు ఎప్ప‌టికీ చిర‌స్మ‌ర‌ణీయం 

ఘనంగా వైయ‌స్ఆర్ కు నివాళి అర్పించి, ఆయన స్మృతులు స్మరించుకున్న పార్టీ నేతలు

తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఘనంగా మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి జ‌యంతి వేడుక‌లు, రక్తదానం చేసిన అభిమానులు

తాడేప‌ల్లి:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేద‌ల గుండెచ‌ప్పుడు అని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు, రాజ్య‌స‌భ స‌భ్యులు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి  కొనియాడారు. తాడేప‌ల్లి లోని వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాల‌యంలో మహానేత స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్‌ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాల‌య ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి రాజ్య‌స‌భ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య‌రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా పార్టీ కార్యాల‌యంలోని వైయ‌స్సార్ విగ్ర‌హానికి పూల‌వేల వేసి పుష్పాంజ‌లితో నివాళులు అర్పించారు. అనంత‌రం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో  మాజీ మంత్రులు జోగి ర‌మేష్‌, వెలంప‌ల్లి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, పలువురు మాజీ కార్పొరేష‌న్ చైర్మ‌న్లు, వైయ‌స్ఆర్‌సీపీ  అనుబంధ విభాగాల అధ్య‌క్షులతో క‌లిసి భారీ కేకును క‌ట్ చేశారు. త‌ర్వాత పేద‌ల‌కు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ర‌క్త‌దాన శిబిరాన్ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే... 

 నాయ‌కులంతా స‌మిష్టిగా ప‌నిచేయాలి :   రాజ్య‌స‌భ స‌భ్యులు వైవీ సుబ్బారెడ్డి

సంక్షేమం, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సీఎంగా వైయ‌స్సార్ అందించిన సేవ‌లు దేశంలోనే ట్రెండ్ సెట్ చేశాయి. ఆయ‌న చ‌నిపోయి 15 ఏళ్లు గ‌డిచినా రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఇప్ప‌టికీ ఆయ‌న్ను గుండెల్లో పెట్టుకున్నారు. ఉచిత విద్యుత్, జ‌ల‌య‌జ్ఞం వంటి కార్య‌క్ర‌మాల ద్వారా రైతుల‌ను రాజుగా నిల‌బెట్టారు. పేద‌వాడికి ఉచితంగా విద్య‌, వైద్యం అందించేందుకు ఆయ‌న తీసుకొచ్చిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాలు ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అమ‌ల‌వుతున్నాయి. అర్హులైన ప్ర‌తి కుటుంబానికీ సంక్షేమ ప‌థ‌కాలు అందించారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.  

వైయ‌స్ఆర్‌ నుంచి క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వర్చుకోవాలి :  రాజ్య‌స‌భ స‌భ్యులు అయోధ్య‌రామిరెడ్డి 

వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌ రెడ్డి లాంటి క్ర‌మశిక్ష‌ణ క‌లిగిన నాయ‌కుడు రాజ‌కీయాల్లో చాలా త‌క్కువ మంది ఉంటారు. కుటుంబాన్ని, పార్టీని, ప్ర‌భుత్వాన్ని స‌మ‌న్వ‌యం చేయ‌డంలో ఆయ‌న్ను మించిన వారుండ‌రు. ప్రతి మ‌నిషినీ సంతోషంగా న‌వ్వుతూ ప‌ల‌క‌రించ‌డం ఆయ‌న నుంచే నేర్చుకోవాలి. ఆయన జీవిత‌మంతా ప్ర‌జా సేవ‌లోనే గడిపారు. ఆయ‌న పాల‌న స‌మాజంలో ఎంతో గొప్ప మార్పు తీసుకొచ్చింది. ప్ర‌త్య‌ర్థుల‌ను కూడా స‌మ్మోహితుల్ని చేయ‌గ‌ల నాయ‌కుడు. ఎల్లప్పుడూ పేద‌వారికి అండ‌గా ఉండే వైయ‌స్సార్ వారి గుండె చ‌ప్పుడు అయ్యారు. ఆయ‌నలా ప్ర‌తిఒక్క‌రూ క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వ‌ర్చుకోవాలని అయోధ్య రామిరెడ్డి పిలుపునిచ్చారు. 


 ఆరోగ్య‌శ్రీ పేరు చెబితే వైయ‌స్ఆరే గుర్తుకొస్తారు :   మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌

ఐదేళ్ల పాల‌న‌తోనే పేదల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయిన గొప్ప నాయ‌కులు వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, ఆరోగ్య‌శ్రీ పేరు చెబితే ఆయ‌నే గుర్తుకొస్తారు. విద్య‌, ఆరోగ్యం ప్ర‌భుత్వ బాధ్య‌త అని తెలియ‌జెప్పారు. వ్య‌వ‌సాయాన్ని పండ‌గ చేసి చూపించిన విజ‌న‌రీ వైయ‌స్సార్‌. ఆ మ‌హానేత ఆశ‌యాల‌ను మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు తీసుకెళ్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 

 ప్ర‌తి కుటుంబానికి ఆప్తుడు వైయ‌స్ఆర్‌:  మాజీ మంత్రి జోగి ర‌మేశ్‌

ప్ర‌జ‌లంద‌రి గుండెల్లో చిర‌స్మ‌ర‌ణీయ నాయ‌కులు వైయ‌స్సార్‌. నాయ‌కుడంటే వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌ రెడ్డిలా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు. అన్న‌లా, తమ్ముడిలా, ఇంటికి పెద్ద కొడుకిలా ప్ర‌తి కుటుంబానికి ఆయ‌న ఆప్తుడు. ఆ మహా నాయ‌కుడు లేని లోటుని ఆంధ్ర‌ప్ర‌దేశ్ చూసింది. వైయ‌స్సార్ మ‌ర‌ణం త‌ర్వాత ఈ రాష్ట్రం దిక్కులేనిది అయ్యింది. కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన గొప్ప నాయ‌కుడు వైయ‌స్సార్‌ అని జోగి రమేష్ కొనియాడారు. 

వ్యవసాయాన్ని పండుగ చేసిన నేత :  మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు 

వైయ‌స్ఆర్‌ ప్ర‌జా నాయ‌కుడు. రాజ‌కీయాల్లో వైయ‌స్ఆర్‌ లాంటి అరుదైన నాయ‌కులు అతికొద్ది మందే ఉంటారు. దీన‌స్థితిలో ఉన్న వ్య‌వ‌సాయ రంగాన్ని పండ‌గ చేసి చూపించిన నాయ‌కుడు. సాధ్యం కాద‌న్న ఉచిత విద్యుత్‌ని తొలి సంత‌కంతోనే చేసి చూపించిన కార్య‌ద‌క్షుడు. జ‌ల‌య‌జ్ఞంతో ప్రాజెక్టుల్లో నీటి వ‌ర‌ద పారించిన భగీర‌థుడు. ఆయ‌న తీసుకొచ్చిన ఎన్నో కార్య‌క్ర‌మాలు తీసేయ‌డానికి ఏ నాయ‌కుడూ సాహసించ‌లేక‌పోయారంటే అవి ప్ర‌జ‌ల్లో ఎంత‌మార్పు తీసుకొచ్చాయో చెబుతుంది. ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు, ఆద‌ర్శాల‌కు అనుగుణంగా ఏర్పాటైన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పేద ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డిందని మల్లాది విష్ణు అన్నారు.    

వైయ‌స్ జ‌గ‌న్‌తోనే రాజ‌న్న రాజ్యం: మాజీ ఎంపీ నందిగం సురేష్‌

సంక్షేమ పాల‌న‌కు పునాది వేసిన గొప్ప నాయ‌కులు దివంగ‌త వైయ‌స్ఆర్‌. చ‌నిపోయినా ప్ర‌జ‌ల గుండెల్లో ఇప్ప‌టికీ నిలిచిపోయారు. ఆయ‌న మొద‌లు పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో ద‌శ‌కు తీసుకెళ్లారు. చంద్ర‌బాబు పాల‌న‌లో రాష్ట్రాన్ని రావ‌ణ‌కాష్టంలా మార్చేశారు. అభివృద్ధి సంక్షేమం పూర్తిగా ఆగిపోయింది. శాంతిభ‌ద్ర‌త‌లు గాడి త‌ప్పాయి. మ‌ళ్లీ వైయ‌స్ఆర్‌ రాజ్యం రావాలంటే వైయ‌స్ జ‌గ‌న్‌ని ముఖ్య‌మంత్రిగా చేసుకోవాలని నందిగం సురేష్ అన్నారు.
 

Back to Top