తాడేపల్లి: ప్రజలు, రైతులు నడ్డి విరిచేలా విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న డిస్కమ్ ల ప్రతిపాదనలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఎన్నికలకు ముందు ఏ సభకు వెళ్లినా సందర్భం ఉన్నా లేకున్నా.. తాము రాబోయే ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని హామీ ఇచ్చారని.. తీరా అధికారంలోకి రాగానే ఛార్జీల పేరుతో భారం మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా నా దగ్గర మంత్రదండం ఉంది. ప్రతి ఒక్కరిని వ్యాపారవేత్తలను చేస్తానని నమ్మబలకడంతో పాటు మిమ్నిల్నే విద్యుత్ ఉత్పత్తిదారులగా చేసి మీ దగ్గర నుంచే విద్యుత్ కొనుగోలు చేసి సంపద సృష్టిస్తానని హామీలు సైతం ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎలా పెంపు ప్రతిపాదనలు చేస్తారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో రూ.15,485 కోట్లు భారం వినియోగదారులపై వేయడంతో పాటు ఆ పాపాన్ని గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నెట్టివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రెండో ఏడాదికి వచ్చేటప్పటికి రూ.3629.87 కోట్లు అదనపు ఛార్జీలు వసూలు చేయాలని డిస్కమ్ లు విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు పంపించడం ద్వారా మరోసారి ప్రజల నెత్తిన భారం వేయడానికి మరోసారి కూటమి ప్రభుత్వం సన్నద్ధమైందని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు ఛార్జీల భారం ప్రజలపై వేయబోమని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈ ఛార్జీల పెంపు ప్రతిపానదలను పంపించాలని... ఈ భారం వాళ్లే భరించాలని డిమాండ్ చేశారు.రాజకీయ ప్రయోజనం కోసం ఎంత పెద్ద అబద్దం అయినా ఆడడానికి వెనుకాడకపోవడం చంద్రబాబు నైజమని తేల్చి చెప్పారు. ఓట్లు వేసేంత వరకు ప్రజలను మభ్యపెట్టి... తీరా గెలిచిన తర్వాత ఒడ్డు దాటిన తర్వాత బోడు మల్లన్న తరహాలో.. ప్రజలకిచ్చిన హామీలను మర్చిపోవడం చంద్రబాబుకి అలవాటేనని ఎద్దేవా చేశారు. ప్రతి పథకంలోనూ కోత పెట్టడం కూటమి పార్టీకి అలవాటేనన్న శివశంకర రెడ్డి... 80 లక్షల మందికి ఇవ్వాల్సిన అమ్మఒడిని 50 లక్షల మందికి మాత్రమే ఇచ్చారని, అదే విధంగా రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్ పెంచి ఇస్తున్నామని ఘణంగా చెప్పుకుంటూ.. ఏకంగా 5 లక్షల మందికి పెన్షన్లు ఎగరగొట్టారని మండిపడ్డారు. ఇలా ఒకవైపు పథకాలు ఎగరగొడుతూ.. మరోవైపు రూ.19,115 కోట్లు ప్రజల నుంచి ముక్కు పిండి ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ పెంపుతో పేద, మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఛార్జీలు పెంచినా.. మరోవైపు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైందన్నారు. సంపద సృష్టి అంటే ప్రజల నెత్తిన భారం వేయడమా అని నిలదీశారు. గతంలో 2014-19లో చంద్రబాబు ప్రభుత్వం 2019లో దిగిపోయేనాటికి 2018లో చేసుకున్న ఒప్పందం ప్రకారం సోలార్ పవర్ యూనిట్ రూ.5.90కు, పవన విద్యుత్ యూనిట్ రూ.4.63 భారత దేశంలో మరే రాష్ట్రం ఇవ్వనంత అత్యధిక మొత్తంతో కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుదని తేల్చి చెప్పారు. అదే టైంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటే... సోలార్ పవర్ యూనిట్ రూ.2.44, పవన విద్యుత్ యూనిట్ రూ.2.43కే కొనుగోళ్లు జరిగాయన్నారు. ప్రజల నడ్డి విరవడంతో పాటు విద్యుత్ సంస్దలను చంద్రబాబు ఏ విధంగా నాశనం చేశాడనడానికి ఇవే నిదర్శనమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ సంస్థలు కుప్పకూలిపోయే పరిస్ధితి తలెత్తిందన్నారు. రాష్ట్రం విడిపోయేనాటికి అంటే 2014 నాటికి విద్యుత్ సంస్థల అప్పులు, బకాయిలు రూ.29,551 కోట్లు ఉంటే... 2019 మార్చిలో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి ఆ బకాయిలు రూ.86,215 కోట్లకు చేరాయన్నారు. అంటే సగటున ఐదేళ్లలో విద్యుత్ పైన చంద్రబాబు రూ.56,663 కోట్లు బకాయిలు పెట్టారని తేల్చిచెప్పారు. ఇక 2019-24 జగన్మోహన్ రెడ్డి హయాంలో దూరదృష్టితో 30 ఏళ్ల పాటు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ద్వారా కేవలం రూ.2.49కే ఇంటర్ స్టేట్ ట్రాన్స్ మిషన్ ఛార్జీలు లేకుండా ఒప్పందం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను ఐదేళ్లపాటు నిరంతరాయంగా ఇచ్చి... వారిని ఆదుకున్నారని తెలిపారు. మరోవైపు ఆక్వా రైతులకు రూ.5 యూనిట్ ను కేవలం రూ.1.50కే అందించి మిగిలిన రూ.3.50 సబ్సిడీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని తేల్చి చెప్పారు. మొత్తంగా రూ.50 వేల కోట్లు సబ్సిడీ రూపంలో డిస్కమ్ లకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెల్లించామన్నారు. మరోవైపు ఎంతో ముందు చూపుతో సామాన్య ప్రజలకు, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలను మేలైన విద్యుత్ ను అందించాలన్న లక్ష్యంతో పునరుత్పాదన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు గణనీయమైన కృష్టి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఇంధన రంగాలకు చెందిన కంపెనీలతో రూ.8,19,815 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నారని.... ఇదీ జగన్మోహన్ రెడ్డికీ చంద్రబాబుకీ ఉన్న తేడా అని స్పష్టం చేశారు. ఇక రైతులకు సైతం కూటమి ప్రభుత్వం మోసం చేసిందని.. పగటి పూట 9 గంటలు నిరంతర, నాణ్యమైన విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. రాత్రిళ్లు కూడా అరకొర సరఫరాతో రైతుల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. వైయస్ జగన్ ప్రభుత్వం యూనిట్ విద్యుత్ ధరకు రూ.2.49 కే కొనుగోలు చేస్తే ఆ రోజు ఎల్లో మీడియా నానా యాగీ చేసిందన్నారు. మరి ఇవాళ చంద్రబాబు హయాంలో యాక్సెస్ రెన్యువబల్ ఎనర్జీ కంపెనీతో ఏకంగా యూనిట్ రూ.4.60 కే ఒప్పందం చేసుకుని రూ.11వేల కోట్లు రాష్ట్ర ఖజానా మీద భారం పడుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. తొలి ఏడాది రూ.15,485 వేల కోట్లు భారం వేసిన కూటమి ప్రభుత్వం... రెండో ఏడాది మరో రూ.3629.87 కోట్ల ఛార్జీల పెంపు ప్రతిపాదనలు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. తక్షణమే ఛార్జీల పెంపు ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంటలకు పెడ్డుబడి సాయం, గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు మరలా ఛార్జీల పెంపుతో మరింత భారం వేయాలని చూస్తే... ఊరుకునేది లేదని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ ఈ ప్రతిపాదనలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అలా చేస్తే ప్రజలంతా పెరిగిన విద్యుత్ బిల్లులతో కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడం ఖాయమని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు ప్రజల తరపున వైయస్ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని శివశంకర్ హెచ్చరించారు.