తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోందని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్‌రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో దాడి జరగడమేంటని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు హింసాత్మక విధానాలను ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండిస్తూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. ‘చంద్రబాబు దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడి. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్‌రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండం. రెడ్‌బుక్ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు నాయుడుగారు ప్రతిచోటా తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్షనేతగా ఇవాళ నా పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించి, దాన్ని అడ్డం పెట్టుకుని ఈ భయంకరమైన దాడికి పాల్పడి, దానిమీదే రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని, ప్రజా సమస్యలేవీ బయటకు రాకూడదంటూ చేసిన కుట్ర ఇది. చంద్రబాబుగారి హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ దాడుల ద్వారా, కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరనే విషయాన్ని గుర్తించాలి’ అని వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.