హైదరాబాద్: ఏపీఎండీసీ బాండ్ల జారీలో రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కు కల్పించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన కూటమి ప్రభుత్వం దీనిపై ప్రశ్నించినందుకు రాజద్రోహం కేసు పెడతామనడం వారి దివాలాకోరుతనంకు నిదర్శనమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ ..రాష్ట్రానికి డబ్బు రాకుండా వైకాపా కుట్రలు చేసిందని, ఏపీ బాండ్లు కొనొద్దంటూ 200 ఆర్ధిక సంస్థలకు మెయిల్స్ చేసిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాజ్యాంగం నిబంధనలనే ఉల్లంఘిస్తూ చేసిన తప్పులను ఎలా సమర్థించుకుంటున్నారని ప్రశ్నించారు. దీనిపై జోక్యం చేసుకోవాలని న్యాయ స్థానాలను కోరితే రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ, కోర్టుకు తప్పుడు ఫిర్యాదులు చేయించిన వైయస్ జగన్, బుగ్గనలను ప్రాసిక్యూట్ చేయాలంటూ ఆర్ధిక మంత్రి కేశవ్ అర్థంలేని వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఏపీఎండీసీ బాండ్లలో పెట్టుబడి పెట్టొద్దంటూ తప్పుడు మెయిల్స్ చేస్తున్నారని, వైకాపా చేస్తున్న కుట్రపై విచారణ చేస్తామని సీఎం పేర్కొన్నట్లుగా ఈనాడులో వచ్చిన కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రాభివృద్ధిని వైయస్ఆర్‌సీపీ అడ్డుకుంటోందని, దీనిపై రాజద్రోహం కేసులు పెట్టాలంటూ సీఎం మాట్లాడినట్లుగా ఆ కథనాల్లో వచ్చిన అంశాలు అత్యంత అభ్యంతరకరం. రూ.9 వేల కోట్లకు బాండ్లు జారీ చేసి మధ్యవర్తులకు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు నేరుగా డ్రా చేసుకునే హక్కు కల్పించిన మాట నిజం కాదా? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే నిరూపించగలరా? లేదా తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పగలరా? దీనికి బదులివ్వకుండా, ఎందుకు మీరు ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారు? ఏపీఏండీసీ ద్వారానే కాకుండా కొత్తగా జలజీవన్ వాటర్ సఫ్లై కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా బాండ్లు జారీ చేసి అప్పు చేయాలని మీరు ప్రయత్నిస్తున్న మాట వాస్తవం కాదా? 2025 మే 9న రూ.3489 కోట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా అప్పు చేశారు. జూన్ 25 నాడు రూ.5526 కోట్లతో కలుపుకుంటే దాదాపు రూ.9వేల కోట్లు బాండ్లు ద్వారా అప్పు చేశారు. ఈ డబ్బులు ఖనిజాభివృద్ధి సంస్థ వద్దే ఉన్నాయని, వాటిని ఖనిజాభివృద్ధి సంస్థ వ్యాపారాన్ని పెంచేందుకే వాడుతున్నారు, ప్రభుత్వం ఈ డబ్బులు వాడడం లేదు అని చెప్పగలరా?. గతంలో మీరు లేఖలు రాయలేదా? ఖనిజాభివృద్ధి నుంచి సుమారు 400 లీజులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి తిరిగి లీజుదార్లు డబ్బులు చెల్లించారు అని చెబుతున్నారు. అంటే ప్రభుత్వమే ప్రభుత్వ ఆస్థిని కొనబోతుందా?, అంటే భర్త ఆస్తిని భార్య, భార్య ఆస్ధిని భర్త కొనుగోలు చేస్తున్నారా? గతంలో ఐదేళ్లు పాటు 2014-19 వరకు మీరు అధికారంలో ఉన్నారు. అప్పుడు కూడా కూటమి పార్టీలే అధికారంలో ఉన్నాయి. మీరు అమరావతి కట్టలేకపోయారు. అమాయకులైన రైతుల నుంచి 30, 40 వేల ఎకరాలకు పైగా పోగుచేశారు. అభివృద్ధి చేసేందుకు మీ దగ్గర డబ్బులు లేవని తెలిసి కూడా భూములు తీసుకున్నారు. అప్పుడు కూడా అప్పులుకు వెళ్లి మేము అడ్డుపడుతున్నామని చెప్పారు. కేంద్రంలో కూటమి సర్కారు మీరు భాగస్వామ్యులు. కూటమి ప్రభుత్వం మీద ఆధారపడి ఉండగా... మాకు అడ్డుపడే శక్తి, సామర్ధ్యాలు ఉన్నాయా. ఎక్కడో జర్మనీలో మెయిల్స్ రాస్తే.. మీకున్న శక్తిని ఆపగలుగుతున్నారా. గతంలో 2019-24 వరకు కూడా ఎంతోమంది అమెరికా, యూరప్ నుంచి వివిధ రకాలు ఫిర్యాదులు చేశారు. అప్పుడు మా ప్రభుత్వంలో బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చట్ట ప్రకారం అప్పు చేస్తుంటే... మీ పార్టీ వైజాగ్ శాసససభ్యుడు కోర్టుకు వెళ్లలేదా? మీ దగ్గర రాజ్యాంగపరమైన ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి అప్పుడు లేఖలు రాయలేదా? అంటే ఇప్పుడు ఎవరో లేఖలు రాస్తే దేశద్రోహం అయితే అప్పుడు కూడా దేశద్రోహమే అవుతుంది. అంటే మీ దగ్గర అప్పుడు ఎంత మంది దేశద్రోహులు ఉన్నారు. మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మా మీద బురద జల్లుతున్నారు. లేఖలు రాయడం అనేది ప్రాధమిక హక్కు. మా ఛాలెంజ్ ఏమిటంటే.. మీరు రాష్ట్ర ప్రజలకు చెందిన ఖజానా మీద డబ్బులు డ్రా చేసే అధికారం ప్రయివేటు వ్యక్తులకు అధికారమిస్తున్నారు అది అవునా? కాదా? అంటే దానికి సమాధానం చెప్పడం లేదు. మీరు చాలా శక్తిమంతులు. హుధ్ హుథ్ ను కంట్రోల్ చేయగలరు. కరవును ఆపగలరు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దోమల్ని కంట్రోల్ చేయగల మీకు ఒక మెయిల్ అడ్డు వచ్చిందా. ఎందుకు మీరు అంత అసహనానికి గురవుతున్నారు. మేము సూటిగా ఒక్కటే అడుగుతున్నాం. అప్పు చేయడం కరెక్టా? కాదా?. మేం అప్పు చేస్తే తప్పు. మీరు అప్పు చేస్తే ఒప్పు. మేం చాలా కష్టాలు ఎదుర్కున్నాం. 2014-19 వరకు అన్నీ సగం సగం పనులు చేసి వదిలేసి వెళ్లిపోయిన అసమర్ధ పాలన మీద. పోలవరం సగం చేసారు, రాజధాని పనులు మధ్యలో నిలిచిపోయాయి. టిడ్కో పనులు సగం చేశారు. విపరీతంగా పెండింగ్ బిల్లులు బకాయిలు పెట్టారు. అన్నీ పనులు సగం సగం మిగిల్చి వెళ్లిపోయారు. వీటికి తోడు మా హయాంలో కోవిడ్ వచ్చింది. మీకు ఇవేవీ లేవు. ఏ ఇబ్బందులు లేకుండా మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు. మా పథకాలన్నీ ఏమయ్యాయి మా ప్రభుత్వ ఆఖరి సంవత్సరం 2023-24 బడ్జెట్ రూ.2.36 లక్షల కోట్లు అయితే మీ ప్రభుత్వ మొదటి సంవత్సరం 2024-25 మీ మొత్తం బడ్జెట్ రూ.2.45 లక్షల కోట్లు. మీ బడ్జెట్ రూ.2.45 లక్షల కోట్లలో జీతాలు రూ.1.18 లక్షల కోట్లు జీతాలు, పెన్షన్లు ఖర్చవుగా మా హాయంలో రూ.2.36 లక్షల కోట్లలో రూ.1.03 లక్షల కోట్లు జీతాలు, పెన్షన్లకు ఖర్చయ్యాయి. తేడా మీ హయాంలో రూ.1.08 లక్షల కోట్లు అయితే మా దగ్గర రూ.1.09 లక్షల కోట్లు. కేవలం రూ.2వేల కోట్లలో మీరు కొత్తగా తొలి ఏడాది చేసింది కేవలం పెన్షన్లు పెంపు మాత్రమే. మరి మేం అమలు చేసిన జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన, విదేశీ విద్యాదీవెన, రైతు భరోసా, వైయస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు, ఉచిత పంటల బీమా, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, ఆసరా, నేతన్న నేస్తం, జగనన్న గోరుముద్ద, జగనన్న తోడు, వాహన మిత్ర, ఆరోగ్యశ్రీ, ఈబీసీ నేస్తం, మత్స్యకార భరోసా, చేయూత, కళ్యాణమస్తు, పోషణ ఇవన్నీ ఏమయ్యాయి. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్లాయి. మరలా మీరు మాట్లాడితే అప్పులు అంటారు. చేసిన అప్పులతో ఏం చేస్తున్నారు 2014-19 వరకు మీ ప్రభుత్వ హయంలో 22 శాతం అప్పులు మీరు చేస్తే.. మా ప్రభుత్వ హయాంలో కేవలం 13 శాతం అప్పులు మాత్రమే చేస్తే... మేమేదో భారీ తప్పు చేసినట్లు గగ్గోలు పెట్టారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2014-19 వరకు మీ ప్రభుత్వం ప్రతి లక్ష రూపాయలకు ప్రతి సంవత్సరం రూ. 22వేలు, రూ.100కు రూ.22 అప్పు చేశారు. మేం రూ.100కు రూ.13 మాత్రమే అప్పు చేశాం. మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన2024 జూన్ లో రూ.6వేల కోట్లు, జూలైలో రూ.10వేల కోట్లు, ఆగష్టులో రూ.3వేల కోట్లు, సెప్టెంబరులో రూ.4వేల కోట్లు, అక్టోబరులో రూ.6వేల కోట్లు, నవంబరులో రూ.4 వేలకోట్లు అఫ్పు చేయగా, డిసెంబరులో ఎప్పుడూ లేని విధంగా రూ.9237 వేల కోట్లు అప్పు చేశారు. మరలా 2025 ఫిబ్రవరిలో రూ.7వేల కోట్లు, మరలా రూ.5820 కోట్లు, మార్చిలో రూ.3,600 కోట్లు ఒకసారి రూ.4548 కోట్లు, ఏప్రిల్ 2025లో రూ.5750 కోట్లు, మేలో రూ.6822 కోట్లు, జూన్ 3వ తేదీన రూ.7వేల కోట్లు అప్పు చేయగా, వారం రోజుల వ్యవధిలోనే జూన్ 10 వ తేదీన మరలా రూ.7 వేల కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక కాదా? ఎందుకు మా మీద దేశ ద్రోహం. మీరు చేస్తున్న అప్పులను ఎందుకు చేస్తున్నారు అని అడిగినందుకా మా మీద దేశ ద్రోహం. మీరు 2024 ఎన్నికల ముందు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని పదే పదే అబద్దాలు చెబుతూ... రాష్ట్రం అప్పు రూ.11 లక్షల కోట్లు, రూ.13 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అని మట్కా నెంబర్లు చెప్పినట్లు చెప్పి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు తన నోటితోనే రూ.5,19,192 కోట్లు మాత్రమే అప్పు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి ఎన్నికల ముందు ఎందుకు రూ.14 లక్షల కోట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత రూ.5.19 లక్షల కోట్లు మాత్రమే అప్పు అని చెప్పి ప్రజలను ఎందుకు మభ్యపెట్టి తప్పుదారి పట్టించారు అని మేం అడిగినందుకా మా మీద దేశ ద్రోహం కేసులు. ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచబోము... మాకు విద్యుత్ ఎట్లా తయారు చేయాలో తెలుసు, తక్కువకే ఉత్పత్తి చేస్తామని చెప్పారు. గతంలో రూ.100 కట్టే కరెంటు బిల్లుకు ఇవాళ రూ.150 చెల్లిస్తున్నారు. అంటే కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారని ప్రజల తరపున అడిగినందుకా మా మీద దేశద్రోహం. ప్రజల తరపున మేం అడగొద్దా? హామీలెప్పుడు అమలు చేస్తారు రైతులకు ఏం సాయం చేశారు. చిత్తూరులో మామిడి రైతులు, గతంలో పొగాకు రైతులు పరిస్థితి ఎలా ఉంది. ఇన్ పుట్ సబ్సిడీ లేదు, బీమా లేదు. మేం ఇన్సూరెన్స్ కట్టేవాళ్లం. మీరు కడుతున్నారు. మీరు ఏం సాయం చేస్తున్నారు. రైతుల తరపున అడిగినందుకా మా మీద దేశద్రోహం?. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డీఏ అయినా ఇచ్చారా మేం ఏర్పాటు చేసిన పీఆర్సీని కూడా రద్దు చేశారు. మీరు కొత్త పీఆర్సీని ఏర్పాటు చేశారా జీతాలు ఒకటో తేదీన ఖచ్చితంగా ఇస్తామన్నారు. మూడు నుంచి ఐదో తేదీలోగా మేం ఇచ్చినట్టే ఇస్తున్నారు. మా హయాంలో తప్పు మీరు చేస్తే ఒప్పా. మాకు కోవిడ్ వంటి ఇబ్బందులు ఉన్నాయి. మీకు అవి కూడా లేవు. ఉద్యోగుల తరపున అడిగినందుకా మా మీద దేశ ద్రోహం?. ఉద్యోగుల సొమ్మునూ వాడుకున్నారు చివరకు ఉద్యోగులకు సంబంధించిన డిపాజిట్ మరియు ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించి మీరు 2014-19లో రూ.57378 కోట్లు వాడారు. మా హయాంలో తిరిగి రూ.500 కోట్లు కట్టాం. మీరు సూపర్ సిక్స్ అని చెప్పారు. 20 లక్షల మంది యువతకు ఉపాధి ఇస్తామన్నారు. లేదంటే నెలకు రూ.3వేలు ఇస్తామన్నారు. ఎప్పుడిస్తారు అని యువత అడుగుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా అడిగినందుకా మా మీద దేశ ద్రోహం? తల్లికి వందనం ఇప్పుడు ఇచ్చారు. అది కూడా 85 లక్షల మందికి ఇవ్వాల్సింది 65 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. అన్నదాత సుఖీభవ ఎందుకు రైతులకు ఇవ్వలేదు. దీపం పథకం కాస్తా పావుదీపమైంది. మూడు సిలెండర్లు చెప్పి అరకొరగా ఒక సిలిండర్ ఇచ్చారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500 అని లెక్కలు వేసి చూపించారు. అదెప్పుడని ప్రజలు అడుగుతున్నారు. మీరు ఈ సూపర్ సిక్స్ తోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదెప్పుడిస్తారని అడిగితే దేశద్రోహమా? ఉచిత బస్సు కింద అక్కచెల్లెమ్మలు ఎక్కడ నుంచి ఎక్కడికైనా పోవచ్చని చెప్పారు. ఆడబిడ్డలు శ్రీకాకుళం నుంచి తిరుపతి, నెల్లూరు నుంచి సింహాచలం వెళ్లొచ్చనుకున్నారు. ఇప్పుడు జిల్లాల్లో మాత్రమే అని చెబుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కాక 35 హామీలు ఇచ్చారు. అవి అడిగితే దేశద్రోహమా? చంద్రబాబు హామీల వల్ల మీకు కలిగిన నష్టం ఎంత అని లెక్కిస్తే.. నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, 50 ఏళ్ల పెన్షన్ ఎంత మందికి వచ్చింది. మా హయాంలో తొలి ఏడాదే అమలు చేసిన రన్నింగ్ స్కీములన్నీ తీసేశారు. ఆర్దిక శాఖ మంత్రి కేశవ్ గారు జీతాల బిల్ల 90 శాతం ఉందని చెబుతున్నారు. 2019-20 మా తొలి ఏడాదిలో రాష్ట్ర సొంత ఆదాయం రూ.61,146 కోట్లు ఉంటే ఆ రోజు జీతాలు రూ.53051 కోట్లు అంటే 87 శాతం. 2024-25 మీ తొలి ఏడాది రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,01985 కోట్లు ఉంటే ఆ రోజు జీతాల బిల్లు రూ.89,008 కోట్లు అంటే 87శాతం ఉంది. అయినా మీకేదో చాలా ఇబ్బంది ఉన్నట్టు మాట్లాడుతున్నారు. వైయస్ జగన్ ను నిందించడానికే కేబినెట్ సమావేశం కేబినెట్ మీటింగ్ లో పాలసీలు చేస్తారు. కానీ మీరు మాత్రం కేబినెట్ లో జగన్మోహన్ రెడ్డి ని నిందిస్తారు. ఆ తర్వాత సమాచారాశాఖ మంత్రి మీడియాతోనూ అవే మాటలతో విమర్శిస్తారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చన్నాయుడు మాట్లాడూతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రైతులకు దగ్గరకు వెళ్లాలి అని మాట్లాడుతున్నారు. మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్న మామిడి రైతులను పరామర్శించకూడదా? మా హయాంలో అదే తోతాపురి మామిడి కిలో రూ.22 నుంచి రూ.29 అమ్మితే ఇప్పుడు రూ.2 ఎందుకు అని అడిగితే దానికి సమాధానం లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కేంద్రం రూ.16 రూపాయలకు కొనుగోలు చేస్తే... కేంద్రంలో మీ వల్ల ప్రభుత్వం ఉంది అయినా మీరు ఎందుకు ఆదుకోలేకపోతున్నారని ప్రశ్నిస్తే మీకు కోపం వస్తుంది. పైగా హెలీ ప్యాడ్ దగ్గర 30 మంది కంటే ఎక్కువ ఎందుకు, 500 మంది కంటే ఎక్కువ ఎందుకు వస్తారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లినప్పుడు అంతే వస్తారు అని చెబుతున్నారు. అంటే ముఖ్యమంత్రి వెలితే ఇంతకంటే ఎక్కువ మంది రారని అచ్చన్నాయుడు గారే రాళ్లు వేస్తున్నట్టుంది. ఒక ఏడాది తర్వాత మీ ప్రభుత్వం పనితీరు చూస్తే... పనిరాని మనిషిఆరునెలలు కష్టపడి పందిరివేస్తే.. కుక్క తోక తగిలి పందిరి మొత్తం కూలిన చందంగా మీ ప్రభుత్వ పనితీరు ఉంది. మేం అడిగినదానికి సమాధానం చెప్పకుండా ఏడుపులు, పెడబొబ్బలు అని చెబుతున్నారు. బాండ్ల జారీలో మీకూ మాకూ తేడాలివే. ఆర్ధిక శాఖ మంత్రి మాట్లాడుతూ ఏపీఎండీసీ జీవో మీ హయాంలోఇచ్చారు అని చెప్పుతూ.. మీరు రూ.7వేల కోట్లకు ఇస్తే మేం రూ.9వేల కోట్లకు ఇచ్చామంటున్నారు. మా హయాంలో 15-03-2024లో ఏపీఎండీసీలో ఇచ్చిన జీవో 35 ప్రకారం.. ఏపీఏండీసీ ఇష్యూ చేసిన బాండ్లు వడ్డీ, అసలు కట్టేది వ్యాపార సంస్థే ద్వారనే తప్ప ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాం. ఈ బాండ్లు కూడా ఏపీఎండీసీ ఎంత వ్యాపారం అభివృద్ధిచేయడానికి అవసరమో అంతే తీసుకోవాలని చెప్పాం. కచ్చితంగా ఆ డబ్బులు తిరిగి ఏపీఎండీసీ చెల్లిస్తుందే తప్ప ప్రభుత్వానికి ఎప్పటికీ సంబంధం లేదని చెప్పాం. మూడోది ఏపీఎండీసీ ఎండీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తారు. ఆయన మీద బాధ్యత పెడుతున్నాం అని జీవో ఇచ్చాం. ఇందులో ఎక్కడా కూడా ఏపీఎండీసీ చేసే అప్పు ప్రభుత్వం వాడుకోవడానికి అవకాశం ఉందని లేదు. అదే మీరు జారీ చేసిన జీవో చూస్తే... రూ.9వేల కోట్లు మొత్తం తీసుకోవాలన్నదే ఏపీఎండీసీ బాధ్యత అని ఇచ్చారు. ఏపీఎండీసీకి చెందిన మైనింగ్ లీజులు, ఖనిజంపై బాండ్ల కొనుగోలు చేసిన వారికి పూర్తి ఛార్జ్ ఇవ్వాలన్నారు. ఒక్కచోట కూడా ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్పలేదు సరికదా.. మరింత అడ్వాన్స్ గా రూ.1,91,000 లక్షల కోట్లకు సంబంధించిన ఖనిజ సంపద అంతా ఈ అప్పు కట్టడానికి తాకట్టు పెట్టినట్లు మరో జీవో ఇచ్చారు. ఇది మీకు మాకు తేడా. మా హయాంలో బాండ్లు కూడా జారీ చేయలేదు. అలా ఆలోచన చేసినప్పుడు కేవలం ఖనిజాభివృద్ధి సంస్థ అభివృద్ధికి మాత్రమే వాడాలి. ఆ అప్పు కూడా వాళ్లే కట్టాలి అని చెప్పాం. మీరు నేరుగా బాండ్లు యాజమాన్యానికి రాష్ట్ర ఖజానా మీద అధికారం ఇచ్చారు. ఇది చాలా అన్యాయం. బాండ్లు జారీకి సంబంధించి సంస్ధకున్న క్రెడిట్ వర్దినెస్ పై రేటింగ్ ఇస్తారు. ఏపీఎస్ బీ సీ ఎల్ కు డబుల్ ఏ రేటింగ్ ఇచ్చారు. ఏపీబ్రూవరేజెస్ (ఏపీఎస్ బీ సీఎల్) కి సంబంధించి డస్రా ( డీఎస్ ఆర్ ఏ) అకౌంట్ కి కార్పొరేషన్ నుంచి మాత్రమే డబ్బులు వెళ్తాయి. ఒకవేళ ఆ డస్రా అకౌంట్ లో కార్పొరేషన్ నుంచి డబ్బులు తక్కువ పడితే ఆ అమౌంట్ ని ప్రభుత్వమే చెల్లిస్తుంది అని మా హయాంలో జారీ చేసిన జీవోలో ఉంది. ఇక లిక్విడిటీకి సంబంధించి ఏబీ బ్రూవరేజెస్ కార్పొరేషన్ కు 2023-24 రూ.8వేల కోట్ల పై చిలుకు ఆదాయం ఉంది కాబట్టి... వాళ్లకు ఆ అప్పు కట్టే శక్తి ఉంది అని ఇచ్చారు. మీ హయాంలో ఏం అదేశాలు ఇచ్చారంటే... డస్రా అకౌంట్ లో డబ్బులు తక్కువైతే రాష్ట్ర ఖజానా నుంచి బాండు యాజమానులు నేరుగా డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. అందుకనే డబుల్ ఏ రేటింగ్ ఇచ్చారు. బాండు సర్వీసింగ్ అకౌంట్ లో డబ్బులు తక్కువైతే ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐలో ఉన్న ఖజానాలో నేరుగా డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. మూడోది డస్రా అకౌంట్ లో అమౌంట్ తక్కువైతే బాండు యాజమాన్యానికి ఆర్బీఐ నుంచి తగ్గించడానికి మీరు అంగీకరించారు. అంటే మొత్తం నాలుగు చోట్ల మీరు నేరుగా రాష్ట్ర ఖజానా నుంచి బాండు యాజమాన్యం డబ్బులు డ్రా చేయడానికి హక్కు ఇచ్చారు. మేం చేసేది, మీరు చేసింది ఒక్కటే ఎలా అవుతుంది. అంటే ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటున్నారా? గతంలో మద్యం అమ్మకాల్లో ప్రయివేటు వర్తకులు సిండికేట్ ద్వారా రూ.10 లేదా రూ.20 అధిక ధరకు అమ్ముకునేవాళ్లు. మా హయాంలో బ్రూవరేజీ కార్పొరేషన్ అమ్మకాలను ప్రభుత్వం తీసుకున్న తర్వాత.. రూ.10 లేదా రూ.20 తయారీ పన్నును ప్రభుత్వ ఖజానాలోకి అప్పు కట్టడానికి ఏర్పాటు చేశాం. అదే మీరు ఏపీఎండీసీకి వచ్చే డబ్బులు పెడుతూ.. అవి చాలకపోతే రాష్ట్ర ఖజనా నుంచి వెళ్లేటట్టు పెట్టారు. దీన్నిప్రశ్నిస్తే దేశద్రోహమా? ప్రజల తరపున మా పోరాటం ఆగదు. మీరు తప్పు చేస్తే మేం ప్రజల తరపున పోరాటం చేస్తాం. ప్రజల భవిష్యత్తుకోసం పోరాటం చేస్తాం అది మీకు ఏడుపులు, పెడబొబ్బలు పొర్లు దండాలు కింద కనిపిస్తుందా? మేం తాకట్టు పెట్టామని చెపుతున్నారు. మేం రూ.25వేల కోట్ల అప్పుకు రూ.1941 కోట్ల ఆస్ధిని తాకట్టు పెట్టాం. మీరు రూ.9వేల కోట్ల అప్పుకు రూ.1,91,000 కోట్ల ఆస్దిని తాకట్టు పెట్టి, ఖజానా నుంచి ప్రయివేటు వ్యక్తులు నేరుగా డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. అది ప్రశ్నిస్తే దేశ ద్రోహమా. జగన్మోహన్ రెడ్డిగారు ఇదే ట్వీట్ చేసి రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పారు. మీరు చేసిన పని రాజ్యాంగ ఉల్లంఘన కాదా? మా పాత్ర ప్రతిపక్ష పాత్ర. మేం కచ్చితంగా ప్రశ్నిస్తాం. మీరు బంగారుపాళ్యంలో దండుపాళ్యం అని రాస్తారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారెని చూడ్డానికి, కలవడానికి వచ్చిన వాళ్లను ఆపడానికి చెక్ పోస్టులు పెట్టి పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఆ క్రమంలో తోపులాట జరిగిన దెబ్బలు తగిలితే దండుపాళ్యం అంటారా రైతులను రౌడీషీటర్లు అంటారా ఇది చాలా దురదృష్టకరం. మీ పాలన చూసే ప్రజలు నవ్వుతున్నారు. ప్రజలకు మీరిచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల నవ్వుతున్నారు. మేం ప్రశ్నిస్తున్నందుకు కాదు. మేం రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్లు తల ఎత్తుకుని ప్రవర్తిస్తున్నాం. మీ పాలన చూసిన వాళ్లు మంచి పరిపాలనా కాదో చెప్పాలి. మీకు మీరే మంచిపరిపాలన అని చెప్పుకోవడం కాదు. మీ పరిపాలనపై అధికార్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. గతంలో మా హయాంలో పనిచేసినఅధికార్లకు మీరు పోస్టింగులు ఇవ్వకుండా అంటరాని వాళ్లలా చూస్తున్నారని చెబుతున్నారు. కానీ మా హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లు మాత్రం బ్రహ్మాండంగా పనులు చేసుకుంటున్నారు. మా పార్టీ నుంచి వచ్చిన వాళ్లనూ తీసుకుంటున్నారు. అంటే అధికార్లకు వర్తించిన మీ దేశద్రోహ చట్టాలు, అంటరాని చట్టాలు వీళ్లకు వర్తించవా అని బుగ్గన సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా వ్యవస్థను మార్చుకుని ప్రజలిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఇచ్చిన హామీలు అమలుచేయాలని సూచించారు. లేదంటే ఇలాగే ప్రజలు రొడ్డెక్కడం ఖాయమని హెచ్చరించారు.