శ‌శిధ‌ర్‌రెడ్డికి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ప‌రామ‌ర్శ 

పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించిన వైయ‌స్ఆర్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ 

తిరుపతి: చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పోలీసుల లాఠీచార్జ్‌లో గాయ‌ప‌డిన వైయ‌స్ఆర్‌సీపీ యువ‌జ‌న విభాగం నాయ‌కుడు శశిధ‌ర్‌రెడ్డిని ప‌లువురు వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు గురువారం ప‌రామ‌ర్శించారు.  వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకునేందుకు పోలీసులు అనవసరంగా వ్యవహరించారని, వారి చర్యలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  హరిప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.  తిరుపతిలోని శ‌శిధ‌ర్‌రెడ్డి నివాసంలో ఆయ‌న్ను పరామర్శించిన అనంత‌రం హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..`రైతుల సమస్యల గురించి మాట్లాడితే, అధికార పార్టీని ప్రశ్నిస్తే... దాడులు చేస్తారా?" అంటూ ప్రశ్నించారు. "ఇది ఏ పాలనకు నిదర్శనం? ప్రజాస్వామ్యంలో ప్రశ్న అడగడమే తప్పా?" అని మండిప‌డ్డారు.“కొంతమంది పోలీసులు అధికారపక్షానికి విధేయులై వ్యవహరించడం సిగ్గుచేటు. వారు భారత రాజ్యాంగం ప్రకారమే పని చేయాలి. లోకేష్ రెడ్ బుక్ కాదు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే పోలీసులు అనుసరించాల్సిన ధర్మగ్రంథం కావాలి,” అని హితవు పలికారు.

వైయ‌స్ జగన్  పర్యటనలో కార్యకర్తలు, నాయకులను అడ్డుకోవడం  దుర్మార్గమని, ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడిగా అభివ‌ర్ణించారు. పార్టీ కార్యకర్తల పట్ల ప్రభుత్వ యంత్రాంగం ప్రదర్శించిన దురుసుతనాన్ని ఖండించారు. “మా కార్యకర్తలకు పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుంది. ఈ దాడులు మా ధైర్యాన్ని తగ్గించవు, ప్రజల పక్షాన నిలిచే పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తాయి” అని తెలిపారు.

Back to Top