తాడేపల్లి: పోలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని బహిరంగంగా చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారని వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని, చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుని అప్రకటిత ఎమర్జెన్సీ తరహాలో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టాలు, వ్యవస్థలు అన్నీ ఉన్నా అవి మెజారిటీ ప్రజల ప్రయోజనాలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సామాన్యుడికి రక్షణగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ సైతం తన విధుల్లో విఫలమైందని మండిపడ్డారు. ప్రతిపక్ష హక్కులనూ కాలరాస్తున్న చంద్రబాబు రాష్ట్రాన్ని రణరంగంలా మార్చుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టాలు, వ్యవస్థలు అన్నీ యథావిధిగా ఉన్న అవి కేవలం కొంతమంది ప్రయోజనాలను మాత్రమే నెరవేరుస్తున్నాయి. రాజ్యాంగం ప్రసాదించిన ఎన్నికల ద్వారానే ప్రజల ఓటు ద్వారా అధికారంలోకి వచ్చి మెజారిటీ ప్రజల ప్రయోజనాలను నెరవేర్చకుండా.. అసమ్మతిని అణిచివేస్తూ మాఫియా ముఠాలా తమ ప్రయోజనాలను పరిరక్షించుకునే దిశగా వ్యవస్థలను తయారు చేసుకున్నారు. ఇదంతా కేవలం ఏడాది పాలనలోనే చేయగలిగారు. ఎమెర్జెన్సీ ప్రకటించి 50 ఏళ్లు పూర్తయిన సందర్బంగా దాని గురించి దేశమంతా చర్చించుకుంది. రాజ్యంగ చట్టాలకు లోబడి పనిచేయాల్సిన వ్యవస్థలను ఆ చట్టాలను పక్కన పెట్టినప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఎంత వరకు అధికార దుర్వినియోగం అవుతుందన్నది ఆ రోజు కనిపించింది. ఆ రోజు ఇందిరా గాంధీ ఎమర్జీన్సీ ప్రకటించారు. ఫలితంగా ప్రజాగ్రహం 1977 ఎన్నికల్లో ఓటు రూపంలో కనిపించింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి అన్ని పక్షాలు కలిసారు. అన్ని వ్యవస్థలున్నా సామాన్యుడికి రక్షణ కరువు... ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి భిన్నంగా ఉంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, చట్టాలు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అన్నీ ఉన్నాయి. కానీ ఏడాది కాలంగా ప్రభుత్వం యంత్రాంగం అందులో అతి ముఖ్యమైన చట్టాలు అమలు చేయడంలో అందరికీ సహకరించి, సామాన్యుడికి రక్షణగా ఉండాల్సిన ముఖ్యమైన యంత్రాంగం పోలీస్ వ్యవస్థ ఆ పని చేయడం లేదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటుంది. అది రాజ్యాంగం అందించిన స్పూర్తి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు, రాజకీయ పార్టీలకు తమ అభిప్రాయాన్ని నిరసన రూపంలో తెలియజేసే స్వేచ్ఛ కల్పించాల్సి ఉంది. ప్రతిపక్ష పార్టీలకున్న హక్కులను కాలరాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు బాధితులే... ఈ రాష్ట్రంలో ఏడాది క్రితం ఎన్నికల ముగిసే సమయానికే పాలన హింసతో మొదలైంది. ఆ తర్వాత వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై బహిరంగంగా దాడులు జరిగాయి. అనంతరం అధికార యంత్రాంగంలో అత్యున్నత స్థాయి అధికారులైన డీజీ, అడిషనల్ డీజీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు వీఆర్ లో ఉన్నారు. కూటమి పార్టీల అంటే తెలుగుదేశం పార్టీ అనుగ్రహం లేకపోతే వీఆర్ లో పెట్టడం నుంచి తాము చెప్పినట్టు వినకపోతే ఆయా అధికారులను శంకరగిరి మాన్యాలు పట్టించడం మొదలు పెట్టారు. దీంతో అధికార యంత్రాంగంలో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు కొంతమంది అధికారులు తలూపుతుండగా.. మరికొంత మంది ప్రభుత్వంతో గొడవ ఎందుకు అని రాజీపడుతున్నారు. అలాంటి పరిస్ధితి ఇప్పుడు రాష్ట్రంలో నెలకొంది. పాలకుల కోరిక తీర్చడం, వారి ఆశించింది చేస్తేనే అధికారులు పదోన్నతులు లాంటివి వస్తాయి. నిష్పాక్షపాతంగా ఉంటే వారి ఆగ్రహానికి గురి కాక తప్పని పరిస్థితి. గుడివాడలో టీడీపీ అరాచకం... చివరికి అధికార పార్టీ అంగీకరించకపోతే విపక్ష పార్టీలు తమ సమావేశాలు నిర్వహించుకోవడానికి కూడా వీలులేని పరిస్థితి తీసుకొస్తున్నారు. తాజాగా గుడివాడలో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ. పెడన నుంచి ఉప్పాల రాము వైయస్ఆర్సీపీ తరపున పోటీ చేయగా... రాము భార్య ఉప్పాల హారిక ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్నారు. వీళ్లిద్దరూ గుడివాడలో అసెంబ్లీ స్ధాయిలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎత్తి చూపడానికి నిర్వహించుకుంటున్న కార్యక్రమానికి వెళ్తున్నారు. అంటే వైయస్ఆర్సీపీ తన పార్టీ కార్యక్రమం తన మానాన తాను చేసుకుంటుందే తప్ప వేరొకరి కార్యక్రమంలో వేలు పెట్టలేదు. అలాంటిది ఆ కార్యక్రమానికి వెళ్లకుండా పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు జెండాలతో వెళ్లకుండా అడ్డుకున్నారు. గంటన్నరకు పైగా గుడివాడ పట్టణం మధ్యలో జడ్పీ చైర్ పర్సన్ దంపతులు వెళ్తుంటే పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు ఆమెను అడ్డుకున్నారు. జిల్లా ప్రధమ మహిళ, బీసీ నాయకురాలు అనే గౌరవం కూడా లేకుండా బూతులు తిడుతూ రాక్షసుల్లా కారు మీద కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ నిలబడ్డారే తప్ప.. వాళ్లను నిలువరించే ప్రయత్నం చేయలేదు. అరాచక పాలనకు బాబే జవాబుదారీ... ఆ రోజు చంద్రబాబు అంగళ్ల కార్యక్రమానికి వెళ్లినప్పుడు కూడా స్థానికంగా వైయస్ఆర్సీపీ, టీడీపీ కేడర్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటే పోలీసులు మేం అధికారంలో ఉన్నా కూడా వైయస్ఆర్సీపీ కేడర్ మీద లాఠీఛార్జ్ చేశారు. టీడీపీ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తూ పోలీస్ వాహనాన్ని తగలబెట్టారు. గుడివాడలో వైయస్ఆర్సీపీ ఆ విధంగా వ్యవహరించలేదు. అలా చేస్తే పరిస్థితి మరో రకంగా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగళ్ల పర్యటనలో నువ్వు ఏ విధంగా ప్రవర్తించావో గుర్తు చేసుకో చంద్రబాబూ. తమాషాలు పడుతున్నారా చంపండి, నరకండి అంటూ రెచ్చగొట్టావు. పోలీసుల పైనే దాడి చేసి వాళ్ల వాహనాన్ని తగలబెట్టిన విషయం గుర్తు తెచ్చుకో. ఆ రోజు వైయస్ జగన్ ప్రభుత్వం ఇలా చేయలేదు. కానీ నిన్న నీ పార్టీ కార్యకర్తలు చేసిందేమిటి (గుడివాడలో ఉప్పాల రాము దంపతులుపై టీడీపీ గూండాల దాడి విజువల్స్ ప్రదర్శించిన సజ్జల రామకృష్ణా రెడ్డి.) కారు అద్దాలు పగలగొట్టి దాడి చేస్తున్నా ఎందుకు వారిని తరిమివేయలేదు. మీ కార్యక్రమం కాదు కదా మీకేం పని అని ఎందుకు చెప్పలేకపోయారు. వైయస్ఆర్సీపీ అసెంబ్లీ స్థాయి కార్యక్రమం ఓ హాల్లో జరుగుతుంటే దానికి ఎవరూ ఆటంకం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత మీకు లేదా, అధికారంలో ఉన్నామనే మదంతో సమావేశం జరుగుతున్న హాలు వద్దే మధ్యాహ్నం మూడు నుంచి అక్కడే ఉన్న గూండాలను ఎందుకు పంపించలేదు. ఒక్కటే ఉద్దేశం, అధికారం మాది కాబట్టి గొంతెత్తడానికి వీళ్లేదన్న టీడీపీ నాయకుల మాటలనే ఆచరణలో చేసి చూపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ధర్మంగా వ్యవహరించడం లేదు. అధికారం లోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలను తీర్చే ఆలోచన లేదు. వాటి గురించి ప్రశ్నిస్తే తొక్కపెట్టడమే వీరి లక్షణం. కానీ పోలీసులు ఎందుకు తమ బాధ్యతలను నుంచి తప్పించుకుంటున్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం. డీజీపీ నుంచి కిందస్ధాయి వరకు వాళ్లను వాళ్లు ప్రశ్నించుకోవాల్సిన అంశమిది. దీనికి చంద్రబాబు నుంచి కిందస్ధాయి వరకు కచ్చితంగా జవాబుదారీ అవుతారు. ఇవాళ తప్పించుకున్నా ఏదో ఒక రోజు చట్టం ముందు నిలబడాల్సి ఉంటుంది. బాధితులపైనే తిరిగి కేసులా..? ఎల్లో మీడియా దీన్ని మరో రకంగా పోలీసులు నచ్చజెబుతున్నా వైయస్ఆర్సీపీ నేతలు వెళ్లడం లేదని ప్రొజక్ట్ చేస్తోంది. శాంతియుతంగా మా పార్టీ కార్యక్రమం చేసుకుంటుంటే మా పై దాడి చేశారు. దానిపై పోలీసులుకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంటే.. మరోవైపు ఉప్పాల రాము దంపతుల కారుపై దాడి చేసిన సునీత అనే మహిళ ఉల్టా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన సునీతకి కొడాలి నాని ఫ్లెక్సీ చించుతుండగా గాయమైతే... రాము కారుతో ఢీకొట్టినట్టు కేసు నమోదు చేశారు. ఇటీవలే హైకోర్టు దిగువ కోర్టులకు సర్క్యూలర్ జారీ చేస్తూ...ఇష్టం వచ్చినట్లు సెక్షన్లు నమోదు చేస్తే రిమాండ్ కు పంపించవద్దని చెప్పంది. ఇలాంటి సంఘటనల వల్లే ఈ విధమైన సర్క్యులర్ జారీ చేసింది. అయినప్పటికీ తమకు ఇష్టం వచ్చినట్లు సెక్షన్లు నమోదు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు ప్రభుత్వ తీరుతో మద్ధతు ధర రాక ఆవేదనలో ఉన్న వేలాది మంది మామిడి రైతులు వస్తే అక్కడికి ఎల్లో మీడియా ఫోటోగ్రాఫర్ వచ్చాడు. ఆ పర్యటనలో తన కెమెరా లాక్కున్నారని, దెబ్బలు తగిలాయని ఫిర్యాదు చేస్తే తొలుత సాధారణ కేసు నమోదు చేసిన పోలీసులు... ఆ తర్వాత దాన్ని హత్యాయత్నం కేసు కింద మార్పు చేశారు. అంటే హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడం సాధారణ విషయంగా మారింది. ఇది ప్రభుత్వ దాష్టీకం. ఇక నెల్లూరులో జిల్లాలో సీనియర్ రాజకీయనేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ఇంటిపై వందల సంఖ్యలో వెళ్లి దాడి చేశారు. దాడి చేస్తున్నప్పుడు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే... బాధితులకు కాకుండా దాడికి పాల్పడినవారికి రక్షణ కల్పిస్తున్నట్టుంది. కానీ పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. సుమోటగా కేసు నమోదు చేయాల్సిన దాడి ఘటనపై ప్రసన్నకుమార్ ఫిర్యాదు చేసినా... దానికి అతీగతీ లేకుండా చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటనలో 30 మందికి నిరసన కారుల పేరుతో టీడీపీ కార్యకర్తలకు రక్షణ కల్పిస్తారు. వాళ్లు రాల్లేస్తే తిరిగి వైయస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు, రైతులపై కేసులు నమోదు చేస్తారు. చిత్తూరులో వందలాది మందికి నోటీసులు జారీ చేశారు. ఒక్కటే లక్ష్యం వైయస్ఆర్సీపీ ప్రజల పక్షాన నిలబడకూడదు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గట్టిగా నిలబడి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతున్నారు. కాబట్టి ప్రతిపక్షం ఉండకూడదన్న లక్ష్యంతో దానికి ప్రధాన ఆయుధంగా పోలీసు వ్యవస్థను వాడుతున్నారు. పోలీస్ వ్యవస్థ ప్రభుత్వ పెద్దల చేతిలో ఆయుధంగా మారిపోయింది. కేసులుకు, జైలుకు భయపడేది లేదు... ఇప్పటికైనా ఈ పరిస్థితి నుంచి బయట పడకపోతే... వ్యవస్థ మీద నియంత్రణ లేకుండా పోతుంది. అది చంద్రబాబు తెలుసుకోవాలి. రాను రాను పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇవాళ జరుగుతున్న పరిణామాలకు చంద్రబాబు కచ్చితంగా సంజాయిషి ఇచ్చి తీరాలి. ప్రతిపక్షంగా మా కార్యక్రమాలకు సంబంధించి ఏం చేయాలో మీరే నిర్ణయిస్తారా ? తాడిపత్రిలో కోర్టు డైరెక్షన్స్ ఉన్నా పోలీసులు నియోజకవర్గంలోకి రానివ్వడం లేదు. వస్తే గొడవలు జరుగుతాయంటున్నారు. అలాంటప్పుడు నియోజకవర్గంలో టీడీపీ నేతలు కూడా ఉండకూడదు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తే 100 మందికి మించి ఉండకూడదని ఆదేశాలు జారీ చేస్తారు. ఇలాంటివి ఎక్కడా ఊహించలేం. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. వాళ్ల ముందు తామేం చేస్తామో తమ కార్యక్రమాలు ద్వారా రాజకీయ పార్టీలు కార్యక్రమాలు చేపడతారు. అవి సరైనవి కాకపోతే ప్రజలే తిరస్కరిస్తారు. కానీ ఆ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవసరమైన వెసులుబాటు, రక్షణ కల్పించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత. ప్రభుత్వాలు మారడం సహజం. కానీ అలా జరగడం లేదు. హత్యాయత్నం కేసు చాలా సామాన్యమయిపోయింది. తమకు నచ్చని వారిపై కేసు పెట్టాలనంటే తక్కువ తక్కువ హత్యాయత్నం కేసు నమోదు చేస్తున్నారు. అన్నింటికీ వైయస్సార్ కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. అక్రమ కేసులు పెట్టినా.. జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం- వారే నిర్ణేతలు... ఇంత జరుగుతున్నా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గీత దాటదు. ఓపికగా నిగ్రహంతో నాలుగు అడుగులు వెనక్కి తగ్గే ఉంటాం. కానీ చంద్రబాబు మాత్రం ఘర్షణ కోరుకుంటున్నాడు. రణరంగం సృష్టించాలనుకుంటున్నాడు. ఈ రకమైన దాడులకు ఆయనే సమాధానం చెప్పాలి. వేలాది మంది వచ్చినా ఓపికగా ఉన్న వైయస్ఆర్సీపీ కార్యకర్తల నిగ్రహశక్తి, ఓపికను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అధికారం శాశ్వతం కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అధికారులతో సహా అడ్డగోలుగా వ్యవహరిస్తున్న వారి కేసులన్నీ తిరిగి ఓపెన్ చేస్తాం. తన పర్యటనల్లో రక్షణ ఇవ్వకపోయినా వైయస్ జగన్ ఓపికగా ప్రజల సమస్యల కోసమే మాట్లాడుతున్నారు. వీటిని అవసరమైన అన్ని వేదికలపైనా ప్రస్తావిస్తామన్న సజ్జల రామకృష్ణారెడ్డి... అల్టిమేట్ గా జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.