శ్రీశైలం: కూటమి నేతలు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గ్రామాలలో విష సంస్కృతిని అలవాటు చేయడం దురదృష్టకరమని, రెడ్‌బుక్ రాజ్యాంగానికి కార్యకర్తలు భయపడకుండా కలసికట్టుగా ఉంటూ ఆత్మస్థైర్యంతో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని వైయస్ఆర్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌లోని రెడ్ల కళ్యాణ మండపంలో సోమవారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమంపై శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వ ఆదేశాలతో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అణచివేసేందుకు కొందరు అత్యుత్సాహం చూపుతున్నారని, తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తే వారి పైనా ప్రైవేటు కేసులు పెట్టేందుకు సిద్ధమని హెచ్చరించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేయకుండా ప్రజలను నట్టేట ముంచుతుందని మండిపడ్డారు. చంద్రబాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మోసాలను నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని అన్నారు. క్యూఆర్ కోడ్‌ను వినియోగించే విధానంపై నాయకులు, కార్యకర్తలకు ఆయన వివరించారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వర్‌రెడ్డి, గంగుమాల శోభన్‌బాబు, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.