అసెంబ్లీ మీడియా పాయింట్: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై శాసనమండలిలో చర్చకు ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. గత నాలుగు రోజులుగా డీఎస్సీ అవకతవకలపై చర్చకు పట్టుబడుతున్నా ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోందని ఆరోపించారు. డీఎస్సీతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతలు, గంజాయి మాఫియా, రైతులు, మహిళలు, చిన్నారుల భద్రత వంటి అంశాలపై కూడా చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్లతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారంటూ ఎమ్మెల్సీలు తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, కానీ ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వలేదంటూ తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్సీతో పాటు గ్రూప్-1 నియామకాలపైనా సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధపడాలని సవాల్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రాజెక్టుల పేరుతో గిరిజనులను వారి భూముల నుంచి తరిమివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, గిరిజనులకు న్యాయం జరిగే వరకు ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రకటించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిగే వరకు ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వారు ఇంకా ఏం మాట్లాడారంటే... సొంత భూముల నుంచి గిరిజనులను గెంటేస్తున్నారు - కుంభా రవిబాబు గత నాలుగు రోజులుగా శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డీఎస్సీ అవకతవకలు, గిరిజన చట్టాల ఉల్లంఘనలపై కూటమి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా నిలదీశాం. గిరిజన ప్రాంతాల్లోని 1/70 చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కుతూ ఈ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్లకు అడవులను దోచిపెడుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో అనుమతులిస్తూ చట్టవిరుద్ధంగా తెచ్చిన 'జీవో నెంబర్ 51'ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. గిరిజన హక్కులను కాపాడాల్సిన మంత్రే ఈ దోపిడీపై చర్చకు రాకుండా పారిపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. జీవో నెంబర్ 3 ని రక్షించడంలోనూ ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ప్రాజెక్టుల పేరుతో అడవులను నాశనం చేస్తూ గిరిజనులను వారి సొంత భూముల నుంచి గెంటివేసే కుట్రలను ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతాం. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ గిరిజనులకు ద్రోహం చేస్తున్న ఈ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గిరిజన బిడ్డలంతా ఏకమై పోరాడాలని నేను పిలుపునిస్తున్నాను. డీఎస్సీపై చర్చిద్దామంటే పారిపోతూనే ఉన్నారు - బొమ్ము ఇజ్రాయేల్ గత నాలుగు రోజులుగా శాసనమండలిలో డీఎస్సీ అక్రమాలపై చర్చకు పట్టుబడుతున్నా, సమాధానం చెప్పలేక ఈ ప్రభుత్వం పారిపోతోంది. డీఎస్సీతో పాటు రాష్ట్రంలో క్షీణించిన లా అండ్ ఆర్డర్, గంజాయి మాఫియా, రైతుల సమస్యలు, మహిళల రక్షణపై చర్చిద్దామని మేము అడుగుతున్నాము. అద్దంకిలో పోలీసు అధికారుల కారులోనే గంజాయి పట్టుబడిందంటే, ఈ రాష్ట్ర హోం మంత్రి సిగ్గుపడాలి. ఒకపక్క మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. సూపర్ సిక్స్, ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ దద్దమ్మ ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రజలను మోసం చేసింది. గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి 1.40 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి, 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను పర్మినెంట్ చేసి చరిత్ర సృష్టించారు. డీఎస్సీ అక్రమాలపై మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సీబీఐ ఎంక్వైరీ వేయాలి, విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలి. మండలిలో మా ప్రశ్నలకు బదులిచ్చే ధైర్యం లేదా? - ఇసాక్ బాషా డీఎస్సీ అక్రమాలపై ప్రతిపక్షం లేని శాసనసభలో స్టేట్మెంట్ ఇచ్చిన విద్యాశాఖ మంత్రికి, మండలిలో మా ప్రశ్నలకు బదులిచ్చే ధైర్యం లేదు. డీఎస్సీకి, ఎస్సీఈఆర్టీకి ఒకరే కన్వీనర్‌గా ఉండి అక్రమాలకు బీజం వేశారు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఔట్ సోర్సింగ్ అభ్యర్థి నవీన్ ఐడీని బ్లాక్ చేసి, ఆ తర్వాత అతనే వెరిఫికేషన్‌కు రాలేదని కోర్టును కూడా ఈ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. స్పోర్ట్స్ కోటాలో మన రాష్ట్రానికి సంబంధం లేని ఐస్ స్కేటింగ్ వంటి ఆటలను చేర్చి, నకిలీ సర్టిఫికెట్లు తెచ్చుకున్న అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. ఆఖరికి వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించాల్సిన మంత్రే, వాటిని పప్పు బెల్లాల్లా పంచుతూ మైనార్టీలకు తీరని ద్రోహం చేస్తున్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు సభను స్తంభింపజేస్తాం, ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వ దొంగతనాన్ని బయటపెడతాం. వైఎస్సార్సీపీ హయాంలోనే 16వేల టీచర్ పోస్టుల భర్తీ - వరుదు కళ్యాణి మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి జగనన్న మండలికి వస్తే తమ బండారం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే ఈ ప్రభుత్వం చర్చ నుంచి పారిపోతోంది. స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్లతో, అసలు పరీక్ష కూడా రాయకుండానే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడం ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగలేదు. మా జగనన్న ఐదేళ్లలో 1998, 2008 డీఎస్సీ బాధితులతో కలుపుకుని 16 వేల కంటే ఎక్కువ టీచర్ ఉద్యోగాలను ఇచ్చి ఉంటే, అసలు మా ప్రభుత్వం ఒక్క పోస్టు కూడా ఇవ్వలేదని నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు. ఇన్ని అక్రమాలు చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికే గ్రూప్-1 పై బురదజల్లుతున్నారు. గ్రూప్-1 లో ఎంపికైన వారు ఐఐటీ, ఎన్ఐటీల్లో చదివి సెంట్రల్ సర్వీస్ ఇంటర్వ్యూల వరకు వెళ్లిన వారు. మీకు దమ్ముంటే డీఎస్సీతో పాటు గ్రూప్-1 పై కూడా సీబీఐ ఎంక్వైరీ వేయండి, అప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో తేలిపోతుంది. సీబీఐ ఎంక్వైరీ వేసేంత వరకూ పోరాడతాం - కల్పలతా రెడ్డి డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగి ఉంటే సభలో చర్చకు రావడానికి, సీబీఐ ఎంక్వైరీ వేయడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? విద్యాశాఖ మంత్రి మండలికి వచ్చినా కూడా మా ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయారు. మా దగ్గర అక్రమాలకు సంబంధించిన పక్కా ఆధారాలు ఉన్నాయి, దమ్ముంటే వాటిని మీ ఆధారాలతో సభలో బేరీజు వేసుకుందాం రండి. స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయాల్సిన శాప్ ను డీఎస్సీలో పూర్తిగా ఇన్వాల్వ్ చేసి, అందులోని పోస్టులను బేరసారాలు ఆడి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. రాజశేఖర్ రెడ్డి గారు 54 వేల పోస్టులతో డీఎస్సీ వేస్తే అది మెగా డీఎస్సీ అవుతుంది కానీ, మీరిచ్చిన ఈ 16 వేల పోస్టులది మెగా డీఎస్సీ ఎలా అవుతుంది? మా జగనన్న ఈరోజు డీఎస్సీ అక్రమాలపై ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెడుతున్నారు, దానికి సమాధానం చెప్పడానికి అధికారులు, మంత్రులు సిద్ధంగా ఉండాలి. సీబీఐ ఎంక్వైరీ వేసేంత వరకూ నిరుద్యోగుల పక్షాన నిలబడి మా పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తామని హెచ్చరించారు.