తాడేపల్లి: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద పోలీసు వాహనంలో గంజాయి, మద్యం బాటిళ్లు బయటపడిన ఘటనపై అద్దంకి వైయస్ఆర్‌సీపీ నాయకులు వైయస్ జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఘటనను ప్రత్యక్షంగా చూసి వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. - ప్రమాదం తర్వాత పోలీసు వాహనంలో గంజాయి “శంఖవరప్పాడు వద్ద పోలీసు వాహనం ఆటోను ఢీకొట్టడంతో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులే 108లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసు వాహనాన్ని పరిశీలించగా మద్యం బాటిళ్లతో పాటు డిక్కీలో గంజాయి ప్యాకెట్ కనిపించింది. పోలీసు వాహనంలోనే గంజాయి బయటపడటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం.” - వీడియోలు తీస్తే కేసులంటూ బెదిరింపులు “వాహనంలో గంజాయి బయటపడిన విషయాన్ని స్థానికులు వీడియో తీస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వీడియోలు తీస్తే కేసులు పెడతామని బెదిరించారు. నేను ప్రత్యక్ష సాక్షిగా అక్కడ ఉండగా, ఇప్పటికే కేసులు ఉన్నాయని, మళ్లీ కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. నిజాన్ని బయటపెట్టిన ప్రజలనే ఎందుకు బెదిరిస్తున్నారు?” - పోలీసుల ప్రకటనల్లోనే పొంతన లేదు “గంజాయి ఎక్కడ దొరికిందన్న విషయంలో డీఎస్పీ ఒక ప్రాంతం పేరు చెబితే, ఎస్పీ మరో ప్రాంతం పేరు చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంలోనూ పోలీసుల కథనానికి ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలకు తేడా ఉంది. క్షతగాత్రులకు న్యాయం చేస్తామని డీఎస్పీ హామీ ఇచ్చిన తర్వాతే వాహనాలను పంపించారు. పోలీసు వాహనంలోకి గంజాయి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? దీనిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలి.”