డాక్టర్ ప్రియాంక హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు జరపాలి

నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసుల యత్నం.. హైకోర్టుకు వెళ్తాం

స్పష్టం చేసిన డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులు, మాజీ ఎంపీలు మార్గాని భరత్, బుట్టా రేణుక.

తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ ను కలిసిన డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులు.

తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై వైయస్.జగన్ ని కలిసి మొరపెట్టుకున్న ప్రియాంక తల్లిదండ్రులు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీలు మార్గాని భరత్, బుట్టా రేణుక, ప్రియాంక తండ్రి వెంకటేష్.

తాడేపల్లి : రాజమండ్రిలో దారుణ హత్యకు గురైన డాక్టర్ ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఈ కిరాతక ఘటనపై నిష్పక్షపాత విచారణ కోసం సీబీఐతో దర్యాప్తు జరిపించాలని వైయస్సార్సీపీ డిమాండ్ చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ని ప్రియాంక తల్లిదండ్రులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూతురిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను వైయస్ జగన్ ఓదార్చి, పార్టీ తరపున న్యాయపోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం మాజీ ఎంపీలు మార్గాని భరత్, బుట్టా రేణుకలతో కలిసి ప్రియాంక తండ్రి వెంకటేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కేసులో స్థానిక పోలీసులు నిందితులను కాపాడేందుకు ప్రయత్నించారని, హత్యను సాధారణ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తూ తేలికపాటి సెక్షన్లు నమోదు చేశారని, ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వారు ధ్వజమెత్తారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరేమన్నారంటే..
 
● మాజీ ఎంపీ మార్గాని భరత్:
ఇది ముమ్మాటికీ హత్యే.. నిందితులను కాపాడుతున్న అధికార పార్టీ పెద్దలు ఎవరు?

రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను అతి కిరాతకంగా మూడుసార్లు ఉద్దేశపూర్వకంగా కారుతో తలపై నుంచి ఎక్కించి చంపేస్తే, దానిని ప్రభుత్వం, పోలీసులు సాధారణ యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇది ముమ్మాటికీ హత్యే. ఘటన జరిగిన మూడో తారీకు రాత్రి కేవలం మాల్ దగ్గరి సీసీ ఫుటేజ్ మాత్రమే ఎందుకు చూపించారు? మిగిలిన సిటీ సీసీ ఫుటేజీలను ఎందుకు దాచిపెట్టారు?
నిందితుల కాల్ డేటా రికార్డులను ఎందుకు బయటపెట్టడం లేదు? ఆ రాత్రి వారికి తిలక్ రోడ్డులో షెల్టర్ ఇచ్చి కాపాడిన బడా బాబులు ఎవరు? ఆ వివరాలు వెంటనే వెల్లడించాలి.
ఇంత ఘోరం జరిగితే 6వ తారీకు వరకు అరెస్ట్ చూపించలేదు. పైగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ అంటూ 125B సెక్షన్ నమోదు చేయడం వెనుక ఆంతర్యమేంటి? నాలుగో తారీకే ఫోన్లు సీజ్ చేశామని ఎఫ్‌ఐఆర్‌లో రాసిన పోలీసులు, నిందితులను ఎందుకు దాచారు? అనుమానాలు ఉన్న సీఐ బాజీలాల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి. 
నిందితులతో పాటు వారికి రక్షణ కల్పించిన వారిపై కూడా అత్యంత కఠినమైన శిక్షలు పడాలి.
డాక్టర్ ప్రియాంక హత్య కేసు విచారణ తాత్సారంలో అధికార పార్టీ నేతల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ కేసులో అనేక అనుమానాలు ఎదుర్కొంటున్న సీఐ బాజీలాల్‌ను విచారణ నుంచి తప్పించి తక్షణమే సస్పెండ్ చేయాలి. దారుణ ఘటన జరిగిన కాసేపటికే బాధ్యతగల డీఎస్పీ అదే మాల్‌కు సినిమాకి వెళ్లడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం. నిందితులు మద్యం లేదా డ్రగ్స్ సేవించిన విషయాన్ని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదు. ఢిల్లీ నిర్భయ, కోల్‌కతా అభయ ఘటనల మాదిరిగానే రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక ఘటన అత్యంత హేయమైనది. స్థానిక పోలీసులపై మాకు నమ్మకం లేదు. తక్షణమే ఈ కేసును సీబీఐకి అప్పగించాలి, లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తాం.

● మాజీ ఎంపీ బుట్టా రేణుక:
ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతోంది.

ఎంతో కష్టపడి కూతురిని డాక్టర్‌ను చేసి పీజీ చదువుల కోసం రాజమండ్రికి పంపిస్తే, ఇలా అన్యాయంగా పొట్టనబెట్టుకోవడం అత్యంత హేయమైన చర్య. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై గళమెత్తే వరకు పోలీసులు కేసును పట్టించుకోలేదు. పలుకుబడి ఉన్న నిందితులను కాపాడాలని చూస్తే సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు?  ఉద్దేశపూర్వకంగా కారును వెనక్కి ముందుకు తిప్పి మూడుసార్లు ఎక్కించారంటే హత్య చేయాలనే స్పష్టమైన కుట్ర కనిపిస్తోంది. దీని వెనుక ఉన్న కారణాలు, వ్యక్తులను కూటమి ప్రభుత్వం వెంటనే నిగ్గుతేల్చాలి.  కేసును తప్పుదోవ పట్టించేలా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత చేనేత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు పోరాడతాం.

● వెంకటేష్ (డాక్టర్ ప్రియాంక తండ్రి):
మా బిడ్డను చంపిన రాక్షసులకు మరణశిక్ష పడేవరకు విశ్రమించం

 
ఆర్థిక స్తోమత లేకపోయినా రెక్కలు ముక్కలు చేసుకుని, ఎన్నో ఆశలతో మా బిడ్డను డాక్టర్‌ను చేశాం. మెరిట్‌లో పీజీ సీటు వచ్చిందని రాజమండ్రికి పంపిస్తే.. రాక్షసుల్లా కారుతో గుద్ది గుద్ది చంపేశారు.
ఈ నెల 2వ తారీకు పెళ్లిచూపులు జరిగి, 3న కాలేజీకి వెళ్లిన పాపను అదే రోజు రాత్రి పొట్టనబెట్టుకున్నారు. మేము ప్రాణాలతో ఉన్నా చనిపోయిన శవాలతో సమానం అయిపోయాం.
ఆసుపత్రిలో చేర్పించినప్పటి నుంచి మాకు ఎలాంటి సరైన సమాచారం ఇవ్వలేదు. ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా ఇవ్వకుండా కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. నిందితులు మద్యం, గంజాయి మత్తులో ఉన్నారా లేదా అనే పరీక్షల వివరాలు కూడా మాకు బయటపెట్టలేదు. స్థానిక పోలీసులు, అధికారులపై మాకు ఏమాత్రం నమ్మకం లేదు. మా పాపను పొట్టనబెట్టుకున్న హంతకులకు ఉరిశిక్ష పడేవరకు మా పోరాటం ఆగదు. ఈ కేసును తక్షణమే సీబీఐకి అప్పగించి మా కుటుంబానికి న్యాయం చేయాలి. దీనిపై మేం హైకోర్టుకు కూడా వెళ్తాం.

మేము వైయస్.జగన్ గారిని కలిసాం. మా కుమార్తెను ఉద్దేశపూర్వకంగా చంపిన వాళ్లు ఎవ్వరూ తప్పించుకోలేరు. చట్ట ప్రకారంగా వాళ్లకు శిక్షలు పడేలాగానే మేము చేస్తాము మీరేం భయపడవద్దు, బాధపడవద్దు అని చెప్పి మమ్మల్ని ఓదార్చి మాకు ధైర్యం చెప్పారు.

Back to Top