ప్ర‌తిప‌క్షానికి స‌మాధానం చెప్పే ద‌మ్ము ప్ర‌భుత్వానికి లేదు

వైఫ‌ల్యాల‌పై ప్ర‌శ్నిస్తే భ‌యంతో పారిపోతోంది

వారి డాంబికాల‌న్నీ బ‌య‌టే.. మా ముందు కాదు

బొత్స స‌త్య‌నారాయ‌ణ ఎద్దేవా

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన‌ శాసనమండలి విప‌క్ష నేత, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ 

రెండేళ్ల కూటమి పాలనలో బట్టబయలైన అవినీతి, డొల్లతనం

పోలీసుల వాహనాల్లోనే య‌థేచ్ఛ‌గా గంజాయి రవాణా 

అసలు సూత్రధారులను వదిలేసి ప్ర‌భుత్వం నాటకాలు

డీఎస్సీపై సభలో చర్చించే దమ్ములేక పలాయనవాదం

స్పోర్ట్స్ కోటాలో తప్పుడు జీవోలతో ఉద్యోగాల భర్తీ.. 

విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి.. 

మండ‌లి విప‌క్ష‌నేత  

అసెంబ్లీ మీడియాతో పాయింట్‌: అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనే కూటమి ప్రభుత్వ దురహంకారం, అవినీతి, దోపిడీ, డొల్లతనం ప్రజల ముందు పూర్తిగా బట్టబయలయ్యాయని శాసనమండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ మీడియాతో పాయింట్ వ‌ద్ద ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలపై సభలో నిలదీస్తే సమాధానం చెప్పే ధైర్యం లేక పలాయనవాదం చిత్తగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. అమరావతి అభివృద్ధి పేరిట ఐదేళ్ల క్రితం ఆగిపోయిన సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గరే మళ్లీ ఇప్పుడు టెంట్లు వేసి హడావిడి చేస్తున్నారని, కొత్తగా వారు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. డీఎస్సీ, గ్రూప్-1 అంశాలపై సభలో చర్చిద్దామని మేం పట్టుబడితే ప్రభుత్వం వెనకడుగు వేస్తోంద‌ని మండిప‌డ్డారు. ప్రజా సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బొత్స స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శించారు. 

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

ఉద్యోగాల భర్తీలో కుంభకోణాలు 

డీఎస్సీలో అవకతవకలు జరిగాయి, స్పోర్ట్స్ కోటాలో తప్పుడు జీవోలు సృష్టించి ఉద్యోగాలు నింపారు. దీనిపై సభలో చర్చిద్దాం రండి అంటే అధికార పక్షం పారిపోతోంది. గ్రూప్-1, డీఎస్సీ నియామకాలపై రోజంతా చర్చిద్దామని, అవసరమైతే మరో రెండు రోజులు సభను పొడిగించాలని మేం డిమాండ్ చేస్తే గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. బయటకొచ్చి మాత్రం ప్రతిపక్షంపై బురదజల్లుతూ డాంబికాలు పలుకుతారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒకే ఒక్క నోటిఫికేష‌న్ ద్వారా ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా 1.50 లక్షల సచివాలయ పోస్టులు భ‌ర్తీ చేశాం. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, స్పోర్ట్స్ కోటాలో తప్పుడు జీవోలతో ఉద్యోగాలు భర్తీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నిజంగా తప్పు జరగ‌క‌పోయి ఉంటే విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? అందుకే డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని మేం డిమాండ్ చేస్తున్నాం. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వం దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలి.

వైఎస్సార్సీపీ హ‌యాంలో టీచర్ పోస్టుల భ‌ర్తీ 

వైఎస్సార్సీపీ ప్రభుత్వం 16 వేల టీచర్ పోస్టులు ఇవ్వలేదని పదేపదే ఆరోపిస్తున్నారు. కానీ వాస్తవాలు చూస్తే పరిస్థితి వేరుగా ఉంది.
1998 డీఎస్సీలో మిగిలిపోయిన 5,887 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 2008 డీఎస్సీలో మిగిలిపోయిన 2,193 మందికి ఉద్యోగాలు ఇచ్చాం.
2019 స్పెషల్ డీఎస్సీ ద్వారా 521 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. కేజీబీవీల్లో 1,250 మంది క్వాలిఫైడ్ టీచర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించాం. ట్రిపుల్‌ఐటీలో 450 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 2024 ఫిబ్రవరి 12న 6,100 పోస్టులతో డీఎస్సీని ప్రకటించాం. ఎన్నికల కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇవన్నీ కలిపి చూస్తే ఉపాధ్యాయ రంగంలో సుమారు 10,300కు పైగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు, 6,100 పోస్టులతో డీఎస్సీ ప్రక్రియను కూడా ప్రారంభించాం. మరి 16 వేల పోస్టులు ఇవ్వలేదని ఎలా చెబుతున్నారు? దీంట్లో ఏది అబద్ధమో సభలో నిరూపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా? డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. 

విద్యావ్యవస్థను స‌ర్వ నాశనం చేసేస్తున్నారు 
పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలన్న సత్సంకల్పంతో గత ఐదేళ్లలో జగన్ గారు నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్, రాగిజావ, జగనన్న గోరుముద్ద లాంటి విప్లవాత్మక మార్పులు తెచ్చారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో కాపీయింగ్ లేకుండా కఠిన చట్టాలు తెచ్చాం. ఈరోజు ఆ వ్యవస్థలన్నింటినీ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసి విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తోంది. ఇంగ్లీష్ మీడియంను వద్దని మళ్లీ వెనక్కి తీసుకువెళ్లే కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసి, లక్షలాది మంది విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్ల వైపు నెడుతున్నారు. గత ఏడాది ఇవ్వాల్సిన అమ్మ ఒడి నిధుల్లో సగం మంది తల్లులకు ఇంకా డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. 

పోలీసుల కారులోనే గంజాయి దొరికింది 

రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు, శాంతిభద్రతలు గాల్లో కలిశాయి. 'గంజాయి రహిత రాష్ట్రం' అని గొప్పలు చెబుతున్న ఈ ప్రభుత్వంలో... సాక్షాత్తూ పోలీసుల కారులోనే అద్దంకిలో గంజాయి పట్టుబడింది. డిక్కీ తీయమంటే దబాయించారు. ఇంతకంటే దిగజారుడుతనం ఇంకేమైనా ఉందా? చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ ఎస్పీపై, డీఎస్పీపై చర్యలు తీసుకోవాలి. కానీ ఈ మాఫియా వెనుక ఉన్న పెద్దలను, అసలు సూత్రధారులను వదిలేసి, కింద స్థాయిలో ఉన్న వారిపై తూతూమంత్రండా కేసులు న‌మోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. రాష్ట్రంలో గంజాయి, ఇసుక, లిక్కర్ మాఫియాను ప్రభుత్వ పెద్దలే నడిపిస్తున్నారు.

అమరావతి చంద్ర‌బాబుకి ఏటీఎంలా మారింది 
అమరావతి పేరుతో ప్రభుత్వం మళ్లీ మాయాజాలం మొదలుపెట్టింది. నిన్న మేం వెళ్లి చూస్తే.. ఐదేళ్ల క్రితం వేసిన సీడ్ యాక్సెస్ రోడ్డు, కరకట్ట రోడ్డు ముక్క దగ్గరే.. ఇప్పుడు కొత్తగా టెంట్లు వేసి, ఫోటోలు దిగి హడావుడి చేస్తున్నారు తప్ప వీళ్లు వేసిన ఒక్క ఇటుక లేదు. అమరావతి అనేది చంద్రబాబుకి ఒక ఏటీఎంలా మారింది. ప్రజా సమస్యల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. 'మా ఇంటికి వస్తే ఏం తెస్తావు.. మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు' అన్నట్లుగా అన్నీ రాజకీయ, వ్యక్తిగత లబ్ధి కోసమే పన్నాగాలు పన్నుతున్నారు. వైఎస్సార్సీపీ బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడుతుంది. మాకు వెన్నుపోటు పొడిచే చరిత్ర లేదు. ఈ ప్రభుత్వ మోసాలను, అరాచకాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు. ఈ ప్రభుత్వ వైఫల్యాలను నేరుగా 'ప్రజా కోర్టులో'నే తేల్చుకుంటాం. అని శ్రీ బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

Back to Top