కృష్ణాజిల్లా: ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనపై మాజీ ఎంపీ, వైయస్ఆర్‌సీపీ నేత మార్గాని భరత్ ప్రశ్నల వర్షం కురిపించారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికను పరామర్శించిన మార్గాని భరత్.. మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అరాచకాల్ని నిలదీశారు భరత్. ‘ఏపీలో గడచిన ఏడాది కాలంగా ఆటవిక రాజ్యం నడుస్తోంది. ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రథమ పౌరురాలి పై దాడి చేయడమేంటి?, ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా?, జడ్పీ చైర్ పర్సన్ పై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేసినట్లుగానే మేం భావిస్తున్నాం. టిడిపి గూండాలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్ష పాత్ర వహించడమేంటి?, గతంలో పూనకం వచ్చినట్లు ఊగిపోయిన పవన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు?, టిడిపి బిసిల పార్టీ అని చెప్పుకుంటుంది. ఒక బిసి మహిళ పై దాడి జరిగితే మీరేం చేస్తున్నారు?, దాడి చేసి తిరిగి జడ్పీ చైర్ పర్సన్ భర్త పై కేసు నమోదు చేయడమేంటి?, చంద్రబాబు , పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తున్నాం. జడ్పీ చైర్ పర్సన్ పై దాడి చేస్తారని పోలీసులకు ముందే తెలుసు. ఇదంతా స్పాన్సర్డ్ ప్రీ ప్లాన్డ్ దాడిలా కనిపిస్తోంది. ఏడాది కాలంగా వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తల పై ఏ రకంగా దాడులు చేస్తున్నారో అంతా గమనిస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ నేతల పై దాడులు చేస్తే ప్రజలు ఎలాగూ ప్రశ్నించరని ఒక అజెండాగా టిడిపి వ్యవహరిస్తోంది. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉంటుందని అనుకోవద్దు. రేపు మా ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఓ సారి ఆలోచన చేయండి. ఏడాది కాలంలోనే మీ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కూడా వస్తాయోలేదో చూసుకోండి. ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి. బిసి మహిళ పై జరిగిన దాడికి నిరసనగా బిసి సంఘాలన్నీ బయటికి రావాలి’ అని సూచించారు.