అనుమ‌తి ఇచ్చి అడ్డుకోవ‌డం ఏంటి?

పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫైర్‌

తాడిపత్రి:  వైయ‌స్ఆర్‌సీపీ తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గ విస్తృత స్థాయి స‌మావేశానికి వెళ్లేందుకు హైకోర్టు, జిల్లా ఎస్పీ అనుమ‌తి ఇచ్చిన త‌రువాత కూడా అడ్డుకోవ‌డం ఏంట‌ని పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిప‌డ్డారు.  తాడిప‌త్రి వెళ్ల‌కుండా తనను అడ్డుకోవడం దుర్మార్గమ‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. అనుమతిచ్చి.. ఇప్పుడు వెళ్లొద్దంటే ఎలా? అని ప్ర‌శ్నించారు. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చి మూడు మాసాలవుతోంద‌ని,  తాడిపత్రి వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా? అని నిల‌దీశారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తాడిప‌త్రి వెళ్ల‌కుండా పోలీసులు  వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని శుక్రవారం పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

భారీ ఎత్తున పోలీసుల మోహ‌రింపు
పెద్దారెడ్డి ఇవాళ తాడిపత్రిలో వైయ‌స్ఆర్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. పెద్దారెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి హాజరయ్యేందుకు పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి గ్రామం నుంచి తాడిపత్రి బయలుదేరారు.పెద్దారెడ్డి రాకపై అప్రమత్తమైన పోలీసులు తాడిపత్రిలో భారీ ఎత్తున మోహరించారు. వైయ‌స్ఆర్‌సీపీ  విస్తృతస్థాయి సమావేశానికి అనుమతి ఉందంటూనే.. పెద్దారెడ్డి మాత్రం వచ్చేందుకు వీలులేదని ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పెద్దా రెడ్డి మినహా మిగిలిన పార్టీ నేతలు కావచ్చంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పెద్దారెడ్డి పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరుకాకుండా తాడిపత్రిలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.  ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ.. ‘టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే పోలీసుల ద్వారా నన్ను అడ్డుకుంటున్నారు` అని మండిప‌డ్డారు. 

Back to Top