పల్నాడు: రైతులకు మందు, బిర్యానీ వద్దు కానీ, పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర ఇప్పిస్తే చాలని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ దాచేపల్లిలోని మార్కెట్ యార్డ్‌లో నిర్వహిస్తున్న కిసాన్ మేళా కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరవుతున్నారని, జనసమీకరణలో భాగంగా రైతులకు మందు, బిర్యానీ అంటూ ఆశ చూపుతున్నారని ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు మహేష్‌రెడ్డి గురువారం ఓ వీడియో రిలీజ్ చేశారు.` రైతులు మందు, బిర్యాని, చికెన్ కొరకు కిసాన్ మేళాకు రావట్లేదు!. వాళ్లకి గిట్టుబాటు ధర కల్పించండి మిరప క్వింటాకు రూ.5వేలు, పత్తికి రూ.3వేలు, అపరాలు కందులు, మినుములు , శనగకి కనీసం రూ.2వేల ఐదు వందలు అధనంగా ఇప్పించాలి. ఎన్నికల సమయంలో రైతులకు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. గడేదాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఇంత వరకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు. గత సంవత్సరం అన్నదాత సుఖీభవ రూ.20 వేలు ఈ సంవత్సరం రూ.20వేలు కలుపుకొని 40వేలు రూపాయలు తక్షణమే ఈ నెలలోనే రిలీజ్ చేయాలి. త్వరలోనే డ్యామ్‌కు నీళ్లు వదులుతారని అంటున్నారు. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తే రైతులు సంతోషంగా పంటలు సాగు చేసుకుంటారు. ఆ దిశగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలి` అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాసు మహేష్‌రెడ్డి డిమాండ్ చేశారు.