కర్నూలు జిల్లా: మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి రోడ్డెక్కారు. ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండల పరిధిలోని 33 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పరి చౌరస్తా లో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ..`ఆస్పరి మండలంలో ఉండే 33 గ్రామాలకు తీవ్రంగా తాగునీటి సమస్య ఉంది. నేను ఎలక్షన్ ప్రచారంలో ప్రతి గ్రామానికి వెళ్లినప్పుడు అక్క చెల్లెమ్మలు.. సార్ మాకు తాగు నీటి సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. వేసవి కాలం వస్తే తాగునీరు సమస్య అధికంగా ఉంటుంది. జోహలాపురం గ్రామంలో ఎస్ ఎస్ ట్యాంక్ నిర్మించాలని చాలాసార్లు అధికారులు కోరారు. కూటమి ప్రభుత్వం ఏడాదిగా మంచినీటి సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, కానీ ప్రజల సమస్యల గురించి గాలికి వదిలేశారు. నేను జిల్లా పరిషత్ మీటింగ్ లో కానీ అన్ని మీటింగ్ లో కూడా ఆస్పరి మండలంలో అన్ని గ్రామాలకు తాగునీటి వసతి కల్పించాలని అధికారులను అడిగాను. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడిని కూడా చాలాసార్లు వినతిపత్రం ఇచ్చాను. ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆస్పరి మండలంలో నీటి సమస్య తీర్చకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం` అని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి హెచ్చరించారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పాల్గొన్నారు.