రాజమహేంద్రవరం : ఎంపీ మిధున్ రెడ్డిని అక్రమంగానే అరెస్టు చేసారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. అసలు ఏ తప్పు చేశారని అరెస్టు చేసినట్లని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో మిథున్ రెడ్డి రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో జైలు దగ్గర మంగళవారం ఉదయం మాజీ ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ అసలు స్కాం ఎక్కడ జరిగిందని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసారని ప్రశ్నించారు. నిజానికి 2014- 2019 సమయంలో చంద్రబాబు హయాంలో 16,500కోట్లు లిక్కర్ పై వార్షిక ఆదాయం వస్తే, జగన్ హయాంలో ప్రభుత్వ ఆదాయం ఏటా 25వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చిందని భరత్ చెప్పారు. పైగా ప్రభుత్వమే అమ్మకాలు చేసినపుడు అవినీతికి ఆస్కారం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. అసలు కొత్తగా డిస్టిలరీలకు జగన్ హయాంలో అనుమతులు ఇవ్వలేదని, గతంలో చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చారని, దానిపైనా 2023లోనే కోర్టులో కేసు వేయడం జరిగిందని భరత్ వివరించారు. లిక్కర్ స్కామ్ అని చెప్పడమే కానీ 13నెలల కూటమి పాలనలో మనీ ట్రయల్ ఎక్కడ జరిగిందో తేల్చారా అని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి నేపథ్యంలో అక్రమ అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని భరత్ విమర్శించారు. ఒక పక్క పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్బంగా ముందురోజే వైయస్ఆర్‌సీపీకి చెందిన ఎంపీని అందునా ఫ్లోర్ లీడర్ ని అరెస్టు చేయడం ద్వారా సెన్షేషన్ సృష్టించాలని ప్రభుత్వం ఈవిధంగా చేసిందని భరత్ అన్నారు. పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఇక్కడ ముడిపెట్టి ఇష్టానుసారంగా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎక్కడ నుంచి ఏ రూపంలో డబ్బు వచ్చిందో .. ఏమైనా తేల్చారా అని ఆయన నిలదీశారు. ఏవో రెండు డిస్టలరీస్ సీజ్ చేసి, వాళ్ళ ఆస్తుల జప్తు చేశామని చెప్పేస్తే సరిపోదని ఆయన అన్నారు.కేవలం వత్తిడితోనే సిట్ పనిచేస్తోందని ఆయన వాపోయారు. మీకు ఇష్టం వచ్చినట్లు 300పేజీలు చార్జిషీటు తయారుచేసేస్తే అది నిజం కాబోదని భరత్ అన్నారు. మిధున్ రెడ్డి క్లీన్ చిట్ తో బయటకు వస్తారన్నారు. ఇక జైలులో కోర్టు సూచనల ప్రకారం ఒక ఎంపీకి కల్పించాల్సిన కనీస సదుపాయాలు కల్పించడంలో అధికారులు శ్రద్ధ చూపకపోవడం తగదన్నారు. పైగా విజయవాడ ఎసిబి కోర్టుకి తీసుకెళ్తామంటున్నారని ఆయన అన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున టివి వంటివి ఏర్పాటు, ప్రతిరోజూ లాయర్ కలవడానికి అనుమతి ఇవ్వడం, వంటివి అమలు చేయాలన్నారు.