తాడేపల్లి: పాలనా వైఫల్యాలనుంచి, తానిచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయకుండా ప్రజల ముందు దోషిగా నిలబడ్డ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై రాజకీయ కక్షలకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే లిక్కర్ స్కాంలో లేని స్కాంను సృష్టించి, తన ఎల్లోమీడియాతో విష ప్రచారం చేయించి, దానిమాటున ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. దీనిలో భాగంగానే లిక్కర్ స్కాం పేరుతో అరెస్ట్ చేసిన వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు తప్పనిసరిగా బెయిల్ ఇవ్వాల్సిన నేపథ్యంలో సిట్ ద్వారా చంద్రబాబు సర్కార్ సోదాలంటూ కొత్త డ్రామాకు తెరతీసిందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... సిట్ పేరుతో చంద్రబాబు కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. లేని లిక్కర్ స్కాంను సృష్టించి, రాజకీయ కక్షలకు పాల్పడుతున్న చంద్రబాబు ఆధ్వర్యంలోని సిట్ మరోసారి తెగబడింది. ఇప్పటివరకూ ఈకేసులో ఒక్క ఆధారాన్ని కూడా సంపాదించలేని సిట్, అరెస్టయిన వ్యక్తులను మరింతకాలం జైళ్లలో ఉంచే ఎత్తుగడకు పాల్పడుతోంది. ఈకేసులో అంతర్జాతీయ ప్రఖ్యాత కంపెనీ బాలాజీ గోవిందప్పను అరెస్టు చేసిన దాదాపుగా 75 రోజులు గడిచినప్పటికీ ఇప్పటివరకూ ఆయనకు సంబంధించి ఒక్క ఆధారాన్నికూడా సిట్ చూపించలేపోయింది. ఇటీవల లిక్కర్ వ్యవహారంలో ప్రిలిమినరీ ఛార్జి షీటు దాఖలు చేయడం, అరెస్టుచేసి 75 రోజులు అవుతున్నప్పటికీ, ఈ ఛార్జిషీటులో ఉద్దేశ పూర్వకంగా వీరి పేర్లను పెట్టకపోయిన నేపథ్యంలో బాలాజీ గోవిందప్ప తన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సోదాల వెనుక రాజకీయ కుట్ర బాలాజీ గోవిందప్ప వేసిన బెయిల్ పిటిషన్‌కు సంబంధించి వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో, హఠాత్తుగా ఇవాళ హైదరాబాద్‌లో బాలాజీ గోవిందప్ప నివాసంపైన, వికాట్ గ్రూపునకు సంబంధించి భారతీ సిమెంట్స్‌కు చెందిన కార్యాలయంపై హైదరాబాద్‌లో సోదాల పేరిట సిట్ డ్రామాలకు దిగింది. నిందితుడని చెప్పి బాలజీ గోవిందప్పను అరెస్టు చేసి ఇప్పటికి 75 రోజులు గడిచిన తర్వాత, ఇప్పుడు ఆయన ఇంటిమీద, ఆయన డైరెక్టర్‌గా ఉన్న వికాప్ కంపెనీ గ్రూప్‌నకు చెందిన కార్యాలయం మీద సోదాలు చేయడం… కేవలం ఒక కుట్ర మాత్రమే. ఇప్పుడే ఏదో కొత్తగా కనుక్కున్నట్టుగా, దానికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్నట్టుగా న్యాయస్థానం ఎదుట తిమ్మిని బమ్మిని చేసే వాదనలు చేసి, వారి బెయిల్ పిటిషన్‌ను అడ్డుకునేందుకే సిట్‌తో చంద్రబాబు ఈ డ్రామాలు చేయిస్తున్నాడు. తప్పనిసరిగా బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు సిట్‌చేత ఈ కొత్త డ్రామాలు ఆడిస్తున్నాడు. గతంలో కూడా వీళ్లు అదే బాలాజీ గోవిందప్పగారిని అరెస్టు చేసినప్పుడు మొత్తం ఆయన ఇంటిని జల్లెడ పట్టారు. అయినా ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారు. మళ్లీ ఇప్పుడు దాడులు చేస్తున్నారు. ఇది కేవలం కక్షపూరితమే. మద్యం కేసుకు సంబంధించి న్యాయస్థానం ఎదుట వీళ్లు ఆధారాలు చూపించలేక, కేసును అడ్డంపెట్టుకుని చంద్రబాబుగారు ఇలా వేధింపులకు దిగుతున్నారు. మద్యం వ్యవహారంలో చంద్రబాబుగారు, ఆయన ఎల్లోమీడియా సృష్టిస్తున్న వన్నీ పూర్తిగా కట్టుకథలేనన్న విషయం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. జరగని ఘటనలతో పాత్రలు సృష్టించి ఒక స్క్రిప్టు ఎలా రాస్తారో, అలా రాసి క్రైమ్ సీరియల్ మాదిరిగా కథనాలురాసి ప్రజల్లోకి విషాన్ని ఎక్కించే ప్రయత్నంచేస్తున్నారు. కాని, అవి ఒక్కొక్కటిగా బద్దలు అవుతూ వస్తూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ఈనాడు పత్రికలో ఒక స్టోరీ, దానిపై ప్రశ్నలు వేస్తూ ఆర్టీఐకి ఒక సామాజిక కార్యకర్త రాసిన ప్రశ్నలు, వచ్చిన సమాధానాలే దీనికి నిదర్శనం. 3.58 లక్షల జీబీల డేటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠా, 375 కోట్ల పేజీల డేటాను డిలీట్ చేశారని ఒక పెద్ద బ్యానర్ వేస్తూ రాశారు. కాని అలాంటి డేటా ఏమీ డిలీట్ కాలేదని, అన్నిరకాల రికార్డులు ఉన్నాయని ఏకంగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సమాధానం ఇచ్చింది. లిక్కర్ వ్యవహారంలో ఇలాంటి అల్లిన ఇలాంటి కథలెన్నో ఇప్పుడు తేలిపోతున్నాయి. సిట్‌ను అడ్డుపెట్టుకుని ఈ కట్టుకథలను ప్రజల్లోకి తీసుకెళ్లి, తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఒక ముద్ర వేయడానికి చంద్రబాబునాయుడుగారు, ఆయన కుమారుడు లోకేష్ వందలకొద్దీ యూ ట్యూబ్ ఛానళ్లను సృష్టించి, పైసలు విసిరి, మనుషులను పెట్టి.. వారిని నిపుణులుగా చూపించి, పాత్రికేయులుగా చూపించి నానా ప్రచారం చేస్తున్నారు. పరిశ్రమలను పారిపోయేలా చేస్తున్నారు వికాట్‌గ్రూపు అనేది అంతర్జాతీయ కంపెనీ. వికాట్ నేది యూరప్‌లో టాప్ కంపెనీల్లో ఒకటి. 2024లో రూ.44,316 కోట్ల విలువైన సిమెంట్‌ను విక్రయించింది. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీతో జగన్మోహన్‌రెడ్డిగారు ఏర్పాటు చేసిన భారతీ సిమెంట్స్‌లో 51%మెజార్టీ వాటాను దాదాపు 13 ఏళ్ల క్రితమే కొనుగోలు చేసింది. అలాంటి అంతర్జాతీయ కంపెనీలో బాలాజీ గోవిందప్ప పూర్తిస్థాయి డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ రాష్ట్రంతోకాని, ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలతో ఏం సంబంధం ఉంటుంది? అలాంటి ఇంటర్నేషనల్ కంపెనీపైన కూడా చంద్రబాబుగారు కక్షసాధింపులకు దిగుతున్నారు. తద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు పెట్టేవారిని కూడా బెదిరిస్తున్నారు. ఇప్పటికే లంచాలుకోసం, కాంట్రాక్టులకోసం, రాజకీయ కక్షలతో ఈరాష్ట్రంలో కంపెనీలకు చంద్రబాబు నరకం చూపిస్తున్నారు. అల్ట్రా టెక్ పరిశ్రమకు కర్ణాటక నుంచి ఎర్రమట్టి సరఫరా వివాదంపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ చోటు చేసుకుంది. కప్పం కట్టని సిమెంట్ కంపెనీలపై యరపతినేని గూండాగిరి. ప్రతి బస్తాకు కప్పం కట్టాలని ఆయన భవ్య, చెట్టినాడ్ సిమెంట్ సంస్థలపై గూండాగిరి చేశారు. ఒక సిమెంటు ఫ్యాక్టరీ యాభై రోజులపాటు, మరొక సిమెంట్ ఫ్యాక్టరీ 30 రోజులపాటు నిలిచిపోయాయి. ప్రఖ్యాత శ్రీ సిమెంట్స్‌కు చెందిన కంపెనీలు ఈ రెండు కూడా. జత్వానీని వాడుకుని వాడుకుని రాష్ట్రం నుంచి జిందాల్ స్టీల్స్ సంస్థను చంద్రబాబు వెళ్లగొట్టారు. దాదాపు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను జిందాల్ మహారాష్ట్రలో పెడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ డీజీఎం, సిబ్బందిపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాడి చేశారు. రామాపట్నం పోర్టు నిర్మాణంలో తనకు వాటా ఇవ్వాలని కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నిర్మాణ మెటీరియల్ సరఫరా ను అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని యూబీ బీర్ల ఫ్యాక్టరీలో కూటమి నేతలు అలజడి సృష్టించారు. బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తనకు నెల నెలా కప్పం కడితేనే లోడ్ లారీలు బయటకు వదులుతామని హెచ్చరించారు. తమ నియోజకవర్గం మీదుగా వెళుతున్నాయని చెప్పి గ్రానైట్ రవాణా చేస్తున్న లారీలను ఓ షాడో ఎమ్మెల్యే అనుచరులు ఆపి ముక్కుపిండి కప్పం వసూలు చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం షాడో ఎమ్మెల్యేగా పేరు పొందిన ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో కేడీ ట్యాక్స్ వసులు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కియా భూములపై మంత్రి, అక్కడి టీడీపీ ఎమ్మెల్యే కొట్లాటకు దిగారు. రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్య నేత కుమారుడు పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. ఈ విధంగా దోచుకో..పంచుకో.. తినుకో అన్న చందంగా కూటమి పెద్దల కనుసన్నల్లోనే కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా దందాలకు పాల్పడుతున్నారు. వీటితో ఇప్పుడు సిట్ రాజకీయ కక్షలతో వేధించడంతో ఇక రాష్ట్రంలో ఏ పారిశ్రామిక వేత్తా బతకలేని పరిస్థితులు నెలకొన్నాయి.