రాష్ట్రంలో యధేచ్చగా భూదోపీడీ

అనుయాయలు, అనుచరులకు పప్పు బెల్లాల్లా పంపకం

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కనుసన్నల్లోనే భూపందేరం

భూకేటాయింపులపై ఉన్న శ్రద్ధ హామీల అమలుపై లేదు

కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి అమర్నాథ్

విశాఖ ఐటీ హిల్స్ దివంగత నేత వైయ‌స్ఆర్‌ స్వప్నం

ఐటీలో హైదరాబాద్ కు ధీటుగా చేయడమే ఆయన లక్ష్యం 

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హయాంలోనూ ఆ దిశగానే అడుగులు

బీచ్ ఐటీ డెస్టినేషన్ లో భాగంగా ఇన్ఫోసిస్, డబ్ల్యూఎన్ ఎస్ ఏర్పాటు

కూటమి పాలనలో విలువైన భూములకు రెక్కలు

విశాఖ భూములు అడ్డగోలు కేటాయింపులు

ఊరూ పేరూ లేని ఉర్సాకు 60 ఎకరాలు

రూ.3 వేల కోట్ల భూమి కారుచౌకగా కేటాయించిన ప్రభుత్వం

ఐటీలో ఒక్క ఉద్యోగమూ ఇవ్వని కూటమి ప్రభుత్వం

ఐటీ హిల్స్ లో రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు

సత్వా, కపిల్ సంస్థలకు కారుచౌకగా భూములు కేటాయింపు

తెలంగాణాలో వేలం ద్వారా ఎకరా రూ.50 కోట్లకు కొనుగోలు

విశాఖలో మాత్రం ఎకరా రూ.50 లక్షలకే అప్పగింత

ఇది కచ్చితంగా క్విడ్ ప్రో కో

ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలి

ప్రభుత్వ భూదోపిడీపై ప్రజలతో కలిసి పోరాడతాం

కూటమి ప్రభుత్వాన్ని హెచ్చిరించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ 

విశాఖపట్నం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.

విశాఖపట్నం: వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములకు కస్టోడియన్ గా నిలవాల్సింది పోయి, తమకు కావాల్సిన వారికి కూటమి ప్రభుత్వం కారుచౌకగా కట్టబెడుతోందని వైయ‌స్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...  కంచె చేను మేస్తున్న తరహాలో వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరుపై కచ్చితంగా ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనపై మాట్లాడుతూ... నాలుగో దఫా సీఎం అయిన చంద్రబాబు హయాంలో సింగపూర్ నుంచి రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల కన్నా.. ఇక్కడ దోచుకుని సింగపూర్ లో దాచుకున్నదే ఎక్కువని తేల్చి చెప్పారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే..

పప్పుబెల్లాల్లా ప్రభుత్వ భూముల కేటాయింపు:

గడిచిన 15 నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ అధికారంలోకి వచ్చినప్పటి  నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ భూములను తమ మనుషులకు, తమకు నచ్చిన సంస్థలకు  పప్పుబెల్లాల్లా కేటాయిస్తున్నారు. తమ అనుయాయులకు ప్రభుత్వ భూములు కేటాయించడం మీద ఉన్న తాపత్రయం ప్రజలకిచ్చిన హామీల అమల్లో లేకుండా పోయింది.

జూలై 24న జరిగిన కేబినెట్ భేటీలో విశాఖపట్నంలో అత్యంత విలువైన రూ.3వేల కోట్ల భూములను కారుచౌకగా తమకు కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా హైదరాబాద్ తో ధీటుగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో  ఐటీహిల్స్ లో నగర నడిబొడ్డున విలువైన భూములను వాటికి కేటాయించాలని నిర్ణయించారు. తద్వారా ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించాలన్న ఆలోచన చేశారు. అనంతరం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్యక్షతన  2019-24 మధ్యలో బీచ్ ఐటీ డెస్టినేషన్ గా అభివృద్ధి చేసేందుకు ఇన్ఫోసిస్, రాన్ స్టాడ్, డబ్ల్యూఎన్ ఎస్ లాంటి సంస్థలను తీసుకుని వచ్చారు. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్ధితులను కూడా అధిగమించి.. వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న దశలో.. దిగ్గజ సంస్థలతో మాట్లాడి విశాఖ కేంద్రంగా వారి కార్యకలాపాలను ప్రారంభించేలా చేశాం. ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన దాదాపు 22 నెలల కాలంలో ఇన్ఫోసిస్ సంస్థ 1000 మందితో ప్రారంభించేలా కృషి చేశాను. మిగిలిన ప్రాంతాల్లో కూడా వివిధ సంస్థల ఏర్పాటు చేసేలా చేసాం. 

ఐటీలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా.?

గడిచిన 15 నెలలుగా ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు విశాఖపట్నంలో ఒక్కరికైనా ఐటీలో ఉద్యోగం కల్పించారా  ఏడాది క్రితం టీసీఎస్ వస్తుందని చెప్పారు. ఆరు నెలల క్రితం టీసీఎస్ కు 99 పైసలకే ఎకరా చొప్పున 20 ఎకరాలు కట్టబెట్టారు. టీసీఎస్ ముసుగులో ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఇన్ కార్పోరేట్ అయిన ఉర్సా అనే ఊరూ పేరూ లేని కంపెనీకి రూ.3వేల కోట్ల ఖరీదు చేసే 60 ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెట్టారు. ఆ సంస్థకు  కార్యాలయం లేదు, ఉద్యోగులూ లేరు. సంస్థ టర్నోవరూ లేదు. ఏమీ లేకుండానే గత ఏఫ్రిల్ లో సుమారు 60 ఎకరాలు కేటాయించారు. అది మర్చిపోక ముందే తాజా కేబినెట్ మీటింగ్ లో మరో మూడు, నాలుగు సంస్థలకు ఎకరా రూ.30 నుంచి రూ.40 కోట్లు ఖరీదు చేసే మరో 60 ఎకరాలు భూమిని ఎకరా రూ.50 లక్షలు, రూ1 కోటి చొప్పున ఐటీ సంస్థలకు కాకుండా రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయించారు. 

ఇవి కచ్చితంగా క్విడ్ ప్రో కో కేటాయింపులే:

పూణే, బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చేసే సత్వా కంపెనీకి కేటాయించారు. తెలంగాణా ప్రభుత్వం నానక్ రామ్ గూడలో వేలం వేస్తే వందలాది కోట్ల రూపాయలతో వేలంలో భూములను దక్కించుకునే రియల్ ఎస్టేట్ సంస్థలకు ఏ ప్రాతిపదికన కూటిమి ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇది కేవలం క్విడ్ ప్రో కో మాత్రమే. వారి నుంచి లంచాలు తీసుకుని భూములు కేటాయించారు. 
టీసీఎస్ లాంటి సంస్థలకు భూములు కల్పించడంలో కనీసం ఓ అర్ధం ఉంది. ఉద్యోగాలు వస్తాయన్న భరోసా అయినా ఉంటుంది. అలా కాకుండా సత్వా, కపిల్ లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు ఏ విధంగా రూ.50 లక్షలు, రూ.1 కోటి ఖరీదు చేసే భూములు కేటాయిస్తారు. ఇందులో కచ్చితంగా చీకటి ఒప్పందం ఉంటుందని భావిస్తున్నాం. కేవలం ముడుపుల కోసమే విశాఖలో అత్యంత ఖరీదైన భూములను మీ అనుయాయులకు, తాబేదార్లకు, అనుచరులకు కట్టబెడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ఇలా చేయడం అత్యంత దురదృష్టకరం. 
ఇన్ని భూముల పందేరం చేసిన మీరు 15 నెలల్లో ఒక్క ఉద్యోగ అవకాశం అయినా కల్పించారా.? పైగా స్టీల్ ప్లాంట్ లోనే 5 వేల ఉద్యోగులను తొలగించారు. ఫలానా సంస్థ వచ్చింది, ఉద్యోగాలు ఇచ్చామని చెప్పలేని కూటిమి ప్రభుత్వం.. రూ.5- రూ.6 వేల కోట్ల ఖరీదు చేసే భూములను ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా కారుచౌకగా కనీసం రూ.50 కోట్లు ఆదాయం కూడా రాకుండా కట్టబెట్టారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది.

లులూ చీకటి ఒప్పందం:

లులూ గ్రూపుకు కూడా గతంలో మేం చెప్పాం. నగర సరిహద్దుల్లో భూములు కేటాయిస్తామని చెప్పాం. వాల్లు ఆర్కే బీచ్ దగ్గర కావాలని పట్టుబట్టారు. ఈ రోజు లులూ సంస్థను ముఖ్యమంత్రి ఊరేగిస్తున్నారు. మరోవైపు మలేషియాతో పాటు ఇతర దేశాల్లో ఉన్న లులూ మాల్స్ కార్యకలాపాలు అన్నీ నిలిచిపోతున్న పరిస్థితి. అయినా విశాఖపట్నం, అమరావతిలో భూములు కేటాయిస్తున్నారంటే మీకున్న చీకటి ఒప్పందాలు ఏమిటి
ఉత్తరాంధ్రా ప్రజలు మీరు చేస్తున్న భూ పందేరాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి మరలా పబ్లిసిటీ స్టంట్ కు తెరతీశారు. 

ఈశ్వరన్, చంద్రబాబు అవినీతి కవల పిల్లలు:

చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సింగపూర్ ను మాత్రం మర్చిపోడు. 1995 నుంచి దాదాపు మూడు దశాబ్దాలుగా సింగపూర్ తో సంబంధం.. ఆయన పెట్టుబడులు, అవినీతి సామ్రాజ్యం అంతా సింగపూర్ లోనే అని చెబుతుంటారు. యూరో లాటరీ వ్యవహారంలో పట్టుబడిన కోలా కృష్ణమోహన్ గతంలోనే నాకు ఎంపీ సీటు కోసం చంద్రబాబు నాయుడు రూ.5 కోట్లు నగదు బదిలీ చేయమంటే.. సింగపూర్ లో ఓ అకౌంట్ కు చేశానని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే రాజకీయంగా అవగాహన ఉన్న ఎవరిని అడిగినా చంద్రబాబు పెట్టుబడులన్నీ సింగపూర్ లోనే అని చెప్తారు. 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అమరావతి, సింగపూర్ ఒకటే పాట. అమరావతిని సింగపూర్ చేస్తానని ఇక్కడి రైతులను విమానాలలో సింగపూర్ కూడా తీసుకెళ్లడానికి వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సింగపూర్ మంత్రిని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. తీరా 2019లో మీరు ఓడిపోయిన తర్వాత.. మీరు కీర్తించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ను అవినీతి ఆరోపణలతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఆ రోజుల్లో సింగపూర్ ఈశ్వరన్, ఆంధ్రా చంద్రబాబు కవలపిల్లల్లా తిరిగారు. అలాంటి ఈశ్వరన్ ను అవినీతి ఆరోపణలతో శిక్షించారు. వాస్తవానికి అతితక్కువ అవినీతి, అత్యంత కఠినమైన అవినీతి నిరోధక చట్టాలు, పారదర్శక పాలన ఉన్న దేశం సింగపూర్.అలాంటి సింగపూర్  ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ అవినీతికి పాల్పడిన ఈశ్వరన్ తో చంద్రబాబుకి సత్సంబంధాలు ఉన్నాయంటే వీరి బంధాన్ని అర్ధం చేసుకోవచ్చు. 
నాలుగు పర్యాయములు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు  సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చిన పెట్టుబడులు కన్నా... ఆంధ్రప్రదేశ్ అవినీతి చేసి మీరు దోచుకెళ్లి సింగపూర్ లో పెట్టిన పెట్టుబడులే ఎక్కువ. సింగపూర్ పర్యటన ఈశ్వరన్ తో ములాఖత్ కోసం వెళ్లినట్టుంది. 

లోకేష్ బ్రాండింగ్ కోసమే సింగపూర్ పర్యటన:

మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల సూపర్ సిక్స్ లో హామీలన్నీ అమలు చేసేశాం... ఒక్క ఆడబిడ్డ నిధి పథకం ఉంది అధి చేయాలంటే ఆంధ్రాని అమ్మేయాలన్నారు. బహుశా మీరు అదే పనిమీద సింగపూర్ వెళ్లారా చంద్రబాబూ.? సింగపూర్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తుకురాలేదు. చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పటికే సేకరించిన 55వేల ఎకరాలు, మరలా సేకరిస్తామంటున్న 60 వేల ఎకరాలు కలిసి 1.20 లక్షల ఎకరాలు, చంద్రబాబునాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ అథారిటీ(సీఆర్డీయే), సింగపూర్ అవినీతి మంత్రుల స్నేహాలు తప్ప మరొక్కటి కాదు. 15 నెలల పాలనలో ఎక్కడైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమము కూడా లేదు. మా ప్రభుత్వ హాయంలో మొదలైన సంస్థలను ప్రారంభించడం తప్ప ఒక్క కార్యక్రమమూ మీరు చేయలేదు. కేవలం మీ వ్యక్తిగత ప్రతిష్ఠతో పాటు మీ కుమారుడి బ్రాండింగ్ కోసం తప్ప మీ పర్యటనల వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏమీలేదు. 

నమ్మిన ప్రజలను నట్టేట ముంచడం మీ నైజం:

నాలుగు సార్లు మిమ్నల్ని నమ్మి ఓటేసిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఒక్కసారి కూడా చేయాలన్న తపన మీకు ఎప్పుడూ లేదు. నిత్యం గ్రాఫిక్స్, ప్రచారం, మార్కెటింగ్ తప్ప మరో ఆలోచనే లేదు. ఉట్టికేగలేనమ్మ స్వర్గానికి ఏగినట్లు తయారైంది మీ పరిస్థితి. విశాఖలో వందల కోట్లు ఖరీదు చేసే భూములను కారుచౌకగా రియల్ ఎస్టేట్ గ్రూపులకు కట్టబెట్టే బదులు అమరావతిలో ఎందుకు కేటాయించడం లేదు. అమరావతిలో పెట్టుబడులు పెట్టమని చెప్పవచ్చు కదా?.  అన్ని రకాల వనరులుతో ఉన్న అత్యంత ఖరీదైన విశాఖపట్నాన్ని అప్పనంగా మీకు కావాల్సిన వారికి అప్పగిస్తారు. మీకు లబ్ది చేకూరే కార్యక్రమాలు, మీ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు మాత్రం అమరావతిలో చేపడతారు. రాయలసీమ మీకు అస్సలు పట్టనే పట్టదు. సింగపూర్ పర్యటనతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం వస్తుందో తెలియడం లేదు కానీ.. అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ మీ పర్యటనలతో సింగపూర్ చంద్రంగా మారిపోయారు. 

ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం:

రాష్ట్రంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత కచ్చితంగా ప్రభుత్వానిదే. ఆ భూములకు సంరక్షకులుగా ఉండాల్సిన ప్రభుత్వమే ఈ రకంగా భూ పందేరాలు చేయడం సరికాదు. ప్రభుత్వం కంచె చేను మేసిన తరహాలో వ్యవహరిస్తోంది.  చిన్న చిన్న సంస్థలే ఎకరా రూ.5 నుంచి రూ.10 కోట్లకు భూములు కొనుక్కుంటుంటే... సత్వా లాంటి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలకు మాత్రం కారుచౌకగా భూములు కట్టబెడుతున్నారు. ఇదే సత్వా తెలంగాణా ప్రభుత్వ వేలంలో  హైదారాబాద్ లో నియోపోలీస్ లో ఎకరా రూ.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఏపీకి తెలంగాణాకి ఏంటి ఈ తేడా.? వీటన్నింటికీ కూటమి ప్రభుత్వం కచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. లేని పక్షంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో ప్రజలతో కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుందని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.

Back to Top