కరేడులో బలవంతపు భూసేకరణ కోసం అక్రమ అరెస్ట్‌లు

ఎస్టీ కాలనీలో అర్థరాత్రి ముగ్గురు మహిళల అరెస్ట్

ఆచూకీ చెప్పాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట 500 మంది గిరిజనుల ఆందోళన

భూసేకరణ కోసం తప్పుడు విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వం

జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం

వచ్చే శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం

ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఫైర్

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు

తాడేపల్లి:నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో బలవంతంగా భూములను సేకరించేందుకు ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ భూసేకరణను వ్యతిరేకిస్తున్న ముగ్గురు గిరిజన మహిళలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి, అర్థరాత్రి సమయంలో అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబంలో జరిగిన వివాదాన్ని పోలీసులు సాకుగా చూపుతూ భూసేకరణపై వ్యతిరేకంగా గళం విప్పిన గిరిజన మహిళలు మానికల సుజాత, మానికల శిరీష, మల్లవరపు లలితలను అర్థరాత్రి పోలీస్ వాహనాల్లో తీసుకువెళ్లిన పోలీసులు ఇప్పటి వరకు వారిని ఎక్కడ ఉంచారో కూడా కుటుంబసభ్యులకు చెప్పడం లేదని అన్నారు. ఈ రాష్ట్రంలో మహిళలకు, ముఖ్యంగా దళిత, గిరిజన మహిళలకు పోలీసుల నుంచే రక్షణ లేని పరిస్థితి కనిపిస్తోందని ధ్వజమెత్తారు. చట్టప్రకారం వ్యవహరించాల్సిన పోలీసులే ఇలా ప్రభుత్వం చెప్పిందని, స్థానిక ఎమ్మెల్యే ఆదేశించారని గిరిజన మహిళల పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులో ఉందా.? లేక నారా లోకేష్ చెబుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో ఉందా అని నిలదీశారు. తమ కుటుంబంలోని ముగ్గురు మహిళలను ఎక్కడ ఉంచారో చెప్పాలంటూ అయిదు వందల మంది గిరిజనులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన‌ చేస్తున్నా కనీసం పోలీసులు సమాధానం కూడా చెప్పకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం భూములను సేకరించాలనుకుంటే, ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం లేదా?  మా భూములు ఇచ్చేందుకు సిద్దంగా లేము అని చెప్పినంత మాత్రాన పోలీసులను ఉసికొల్పి కనీసం మహిళలు అని కూడా చూడకుండా అర్థరాత్రి వారిని ఎలా అదుపులోకి తీసుకుంటారు? రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేని పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. దీనిపై జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నాం. అలాగే వచ్చే శాసనమండలి సమావేశాల్లో కూడా ప్రభుత్వ తీరు, పోలీసుల వైఖరిపై సర్కార్‌ను నిలదీస్తామని అన్నారు.

Back to Top