తిరుపతి: కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ చర్యలు చూస్తుంటే హిందూ ధర్మ పవిత్రతను రోజురోజుకీ మసకబార్చేలా ఉన్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..హిందూ ధర్మాన్ని ప్రచారం చేసి, పరిరక్షించే తిరుమల కొండపై ఉన్న మఠాలకు నోటీసులు ఇవ్వడమంటే మఠాధిపతులను అవమానించడమేనని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతోపాటు నోటీసుల్లో మారణాయుధాలు, నిషేధిత వస్తువులు, పేలుడు పదార్థాలు రాకుండా తనిఖీ చేయాలని చెప్పడం చూస్తుంటే మఠాల నిర్వహణ మీద అనుమానాలు వ్యక్తం చేయడమే అవుతుందని స్పష్టం చేశారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని, హిందూ ధర్మ పరిరక్షణకు తామే బ్రాండ్ అంబాసిడర్లమని ప్రచారం చేసుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలి. అత్యంత పవిత్రంగా స్వామి వారికి సేవ చేయడంలోనే జీవితాన్ని గడిపేస్తున్న మఠాలకు నోటీసులిచ్చిన టీటీడీ, ధనికుల ఆధ్వర్యంలో నడుస్తున్న గెస్ట్ హౌస్‌లకు ఇవే నోటీసులు ఎందుకు ఇవ్వలేదో స్పష్టం చేయాలని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... మఠాలను సీజ్ చేస్తారా ? శ్రీవేంకటేశ్వర స్వామి నిలయమైన అత్యంత పవిత్ర తిరుమల క్షేత్రంగా విరాజిల్లుతున్నకొండమీద అనేక మఠాలను దశాబ్దాల క్రితం నెలకొల్పడం జరిగింది. శ్రీమహావిష్ణువే స్వయంభువుగా వెలసిన ఆ దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడుతూ స్వామి వారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో ఈ మఠాల పాత్ర విశిష్టమైనది. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ దాదాపు 32 మఠాల వరకు కొండ మీద కొనసాగుతుండగా వాటికి కూటమి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులను తీవ్రంగా అవమానించడమే. ఆ నోటీసుల్లో `మీరు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలి. మఠానికి ఒకవైపు మాత్రమే తలుపులు పెట్టుకోవాలి. అన్ని వైపులా ద్వారాలను ఏర్పాటు చేసుకోవడం కుదరదు. రూఫ్ గార్డులు పెట్టుకోవాల`ని పేర్కొన్నారు. కాంపౌండ్ నలువైపులా అన్ని వైపులా, అన్ని ఫ్లోర్ కారిడార్లు కనిపించేలా, ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్, కారిడార్, మెట్లు, లిప్టు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నోటీసులిచ్చారు. ఇదంతా ఒక ఎత్తయితే మఠాలకు జారీ చేసిన నోటీసుల్లో మారణాయుధాలు, నిషేధిత వస్తువులు, పేలుడు పదార్థాలు రాకుండా తనిఖీ చేయాలని నోటీసులు ఇచ్చారు. సీసీ కెమెరాల బ్యాకప్ మూడు నెలలపాటు ఉండేలా చేసుకోవాలని సూచించిన పోలీసులు, తాము అడిగినప్పుడు ఆ సమాచారాన్నంతా తప్పనిసరిడా అందజేయాలని ఆదేశించారు. మఠానికి సందర్శించే ప్రతి వ్యక్తి వివరాలు రాసి పెట్టుకోవాలని ఆ వివరాలను ఐడీ కార్డులతో సహా పోలీసులు అందజేయాలని నోటీసుల్లో వెల్లడించారు. ఈ నిబంధనలు అనుసరించకపోతే పోలీస్ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ యాక్ట్ 2013 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మఠాలను హెచ్చరించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ మొదటిసారి తప్పు చేస్తే రూ.5వేల జరిమానా విధిస్తామని రెండోసారి ఉల్లంఘిస్తే డీఎస్పీ ఏకంగా మఠాన్నే మూసేస్తారని చెప్పారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంతకంతో కూడిన నోటీసులు అన్ని మఠాలకు పంపారు. ఇదే నోటీసులు గెస్ట్ హౌస్‌లకు ఎందుకివ్వలేదు? హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి నడుంబిగించామని ఊదరగొట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు ఈ నోటీసులకు ఏం సమాధానం చెబుతారు..? మఠాధిపతులు ఆధీనంలో నడిచే సంస్థలకు మారణాయుధాలు, నిషేధిత వస్తువులు తేవద్దు అంటూ హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారా.? ఇదే తిరుమల కొండ మీద వందలాది ధనవంతులతో నడుస్తున్న గెస్ట్ హౌస్‌లు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పీఏసీలకు ఇలాంటి నోటీసులు ఎందుకివ్వలేదు.? పరమ నిష్టాగరిష్టంగా ఉండి స్వామివారికి సేవ చేస్తూ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న పీఠాధిపతులకు నోటీసులు ఇవ్వడాన్ని ఈ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది.? సాంప్రదాయ బద్దంగా మడికట్టుకుని కనీసం ఆహారం కూడా తీసుకోకుండా ప్రయాణాన్ని ప్రారంభించి ఆకలేసినప్పుడు కేవలం అటుకులను మాత్రమే అతి పరిమితంగా తింటూ దీక్షగా యాత్ర చేసుకుంటూ స్వామివారి దర్శనం కోసం వచ్చే సాధువుల మీద ఈ దాష్టీకం ఏంటి.? హైందవ ధర్మం మీద ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడి కాక ఇంకేమిటి.? దేశ వ్యాప్తంగా మహా మహా క్షేత్రాలకు సంబంధించిన పీఠాధిపతులంతా వేంకటేశ్వరుని స్మరించి సేవించడానికి ఇక్కడ మఠాలు నిర్మిస్తే వారికి నోటీసులు ఇవ్వడం హిందూ ధర్మాన్ని చంద్రబాబు తన ఇనుప పాదాలతో అణచివేస్తున్నారు. సీఎం చంద్రబాబు తక్షణం దీనిపై స్పందించాలి. బ్రిటీష్ పాలకుల కన్నా ఘోరంగా... ఈ నోటీసులను శ్రీవైష్ణవానికి జరుగుతున్న ఘోర అవమానంగా చూడాలి. బ్రిటీష్ పాలకులు, ఆర్కాట్ నవాబుల కన్నా దారుణంగా బీఆర్ నాయుడు నేతృత్వంలో హిందూ ధర్మాన్ని అణగదొక్కడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉసిగొల్పినట్టుగా ఉంది. మీ గెస్ట్ హౌస్‌ల వద్ద ఈ నిబంధనలు ఎందుకు పెట్టలేదు? స‌్వామి వారికి నిత్యం పూజలు, భజనలు, అన్నదానం చేసే మఠాల మీద అక్కసు వెళ్లగక్కడం సిగ్గుచేటు. హిందూ ధర్మం మీద కూటమి ప్రభుత్వ దాడి చూస్తుంటే రాబోయే రోజుల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి మూల మూర్తి కొలువై ఉన్న ప్రదేశంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మఠాలు మఠాధిపతులు ఉండేది ధర్మ పరిరక్షణ కోసం. ధర్మ ప్రచారం కోసం. అలాంటిది అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశిస్తున్నారంటే ఆ మఠాల్లో అనైతిక, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని అనుమానాలు వ్యక్తం చేయడమే అవుతుంది. టీటీడీలో మఠాల మీద జరుగుతున్న దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వేంకటేశ్వరస్వామి భక్తుల మీద నిఘా పెట్టడమే అవుతుంది. ఇలాంటి చర్యలను వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. సనాతన ధర్మం మీద వేస్తున్న గొడ్డలిపెట్టు ఇదని స్పష్టంగా చెబుతున్నా.