విజయవాడ: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం లోని మణీంద్రం ఎంపీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ గూండాలు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. వైయస్ఆర్‌సీపీ నాయకులు ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుల నాయకత్వంలో పార్టీ ప్రతినిధులు విజయవాడలో ఎన్నికల కమిషనర్‌ను కలిసి మణీంద్రంలో జరిగిన దౌర్జన్యాలను వివరించారు. వైయస్ఆర్‌సీపీకి చెందిన అభ్యర్థి శ్రీదేవితో కనీసం నామినేషన్ కూడా వేయనివ్వకుండా భీభత్సం సృష్టించారని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కమిషన్ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రజాస్వామ్యంపై అపారమైన గౌరవం ఉన్నట్టు, మహిళల మీద అపరిమితమైన గౌరవ మర్యాదలు చూపుతున్నట్టు సీఎం చంద్రబాబు పదే పదే ప్రచారం చేసుకుంటారు. కానీ ఎక్కడా చేతల్లో చూపించరు. సొంత నియోజకవర్గంలో మహిళల మీద దాడులు జరుగుతున్నా, మహిళలు అవమానాలకు గురవుతున్నా ఆయన పట్టించుకోరు. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం మణీంద్రం అనే స్థానానికి ఉప ఎన్నిక కోసం నామినేషన్ కార్యక్రమం జరిగింది. ఈ స్థానం నుంచి గెలిచిన శాంతకుమారి అనే వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మా పార్టీ తరఫున ఆమె సోదరి శ్రీదేవిని అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్తుంటే టీడీపీ గూండాలు ఆమె చేతిలో ఉన్న బ్యాగును లాక్కుని అందులోని నామినేషన్ పత్రాలను లాగేసుకున్నారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా పోలీసులు కనీసం పట్టించుకోలేదు. కనీసం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినా ఫిర్యాదు స్వీకరించలేదు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఈ విధంగా వ్యవహరిస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి..? ఇదేనా చంద్రబాబు చెప్పే ప్రజాస్వామ్య విలువలు పాటించడం..? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది కాలంగా జరిగిన ఉప ఎన్నికల్లో జరుగుతున్న అరాచకాలపై ఎన్నోసార్లు ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేయడం జరిగింది. మణీంద్రం ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలను నిలుపుదల చేయాలని వైయస్ఆర్‌సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రెండు రోజుల క్రితం కూడా ఈసీని కలిసి ఆన్‌లైన్‌లో నామినేషన్ వేసేలా అవకాశం ఇవ్వాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరాం. కానీ ఏవీ అమలు కావడం లేదు. బీహార్ లో ఉన్న రౌడీరాజ్యం ఏపీలో అమలవుతోంది. కొంతమంది అధికారులు చట్టాలను ఉల్లంఘించి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వీరంతా భవిష్యత్తులో తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదని వైయస్ఆర్‌సీపీ తరఫున హెచ్చరిస్తున్నాం. చట్టాన్ని ఉల్లంఘించే అధికారుల పేర్లు మా డిజిటల్ లైబ్రరీలో నమోదు చేస్తున్నాం. పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలు లాక్కున్నారు: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని మరోసారి కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. స్థానిక సంస్థలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను వివరిస్తూ రెండు రోజుల క్రితమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి ఫిర్యాదు చేశాం. ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులను కనీసం నామినేషన్ కూడా వేయనీయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఎన్నికలు పారదర్శకంగా జరిగే వాతావరణం కనిపించడం లేదని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితులు లేవని ముందస్తుగానే ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. మా అనుమానాలన్నీ నిజమయ్యేలా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం మణీంద్రం ఎంపీటీసీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో శ్రీదేవి అనే దళిత మహిళ నామినేషన్ వేయడానికి వెళ్తుండగా టీడీపీ గూండాలు దాడి చేసి ఆమెను అడ్డుకోవడమే కాకుండా ఆమె బ్యాగులో ఉన్న ఆమె నామినేషన్ పత్రాలను కూడా లాక్కున్నారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగడం సిగ్గుచేటు. పోలీసు యంత్రాంగం మొత్తం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లినా పోలీసులు పట్టించుకోలేదు. ఎన్నికల కమిషన్‌ను కలిసిన వారిలో విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, పార్టీ కార్యదర్శులు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, మస్తాన్ వలీ, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య తదితరులు ఉన్నారు.