రైతులంటే కనికరం లేదా బాబూ?

వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం
 

నెల్లూరు జిల్లా: భారీ వర్షాలు, దిత్వా తుఫాను ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతుంటే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు క‌నిక‌రం క‌లుగ‌డం లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్య‌క్తం చేశారు. స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో తుపాన్ కార‌ణంగా దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ఆయ‌న సోమ‌వారం ప‌రిశీలించి, రైతుల‌ను ప‌రామ‌ర్శించారు.  ఈ సంద‌ర్భంగా కాకాణి మండిపడుతూ..“లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు, రైతులు తీవ్ర కష్టాల్లో ఉండగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. రైతులు తమ సొంత డబ్బుతో వేసుకున్న నారుమళ్లు భారీ వర్షాలకు నాశనం అయితే, ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయడం లేదు,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. “అవినీతి సొమ్ము కోసమే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి నిద్రలేస్తాడు. సర్వేపల్లి ప్రజలు, రైతులు అతనిని పూర్తిగా మర్చిపోయారు. అభివృద్ధి అంటే ఏమిటో తెలుసుకునే పరిస్థితిలోనే లేడు,” అని విమ‌ర్శించారు

వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు రైతుల ముంగిటే అందించిందని, ప్రతి సంవత్సరం రూ.13,500 రైతు భరోసా ద్వారా ఐదేళ్లపాటు నిరంతర సహాయం అందించిందని గుర్తుచేశారు. వరదల సమయంలో సబ్సిడీ విత్తనాలు, పంటభీమా ఇవ్వడం ద్వారా రైతులను ఆదుకున్న ప్రభుత్వం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీదేనని కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి చెప్పారు. 

Back to Top